Ilaiyaraaja: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja)కు దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)లో బిగ్ షాక్ తగిలింది. సోనీ మ్యూజిక్ కంపెనీ (Sony Music)తో తలెత్తిన కాపీ రైట్ వివాదం కేసును.. బాంబే హైకోర్టు (Bombay High Court) నుంచి మద్రాస్ హైకోర్టు (Madras High Court)కు బదిలి చేయాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఇళయరాజాకు తీవ్ర నిరాశ ఎదురైంది.
సోనీ మ్యూజిక్ తో తన 536 పాటలకు సంబంధించిన కాపీ రైట్ వివాదంపై ఇటీవల ఇళయరాజా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఇళయరాజా మ్యూజిక్ ఎన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (IMMPL) వారు ఈ రచనలను ఉపయోగించకుండా నిషేధించాలని సోనీ మ్యూజిక్స్ కోరుతుండటాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, ఎన్.వి. అంజారియా తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇళయరాజా తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వివాదం సాగుతున్న 536 రచనలలో 310 రచనలు ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో 2014లో దాఖలైన ఒక సూట్‌లో పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. తాను సృష్టించిన పాటలకు కాపీ రైట్ చట్టం కింద నైతిక, ఆర్థిక హక్కులను గుర్తించాలని ఆ పిటిషన్ లో ఇళయరాజా కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో ఆ కేసు విచారణ దశలో ఉన్నందును బాంబే హైకోర్టు నుంచి ఆ కేసును మద్రాస్ హైకోర్టుకు బదిలి చేయాలని ఇళయరాజా తరుపు న్యాయవాది కోరారు.
Also Read: NIMS Fire Incident: అగ్నిప్రమాదంపై ఆధారాలు లేవా? దర్యాప్తుపై అనుమానాలు
అయితే సోనీ మ్యూజిక్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బాంబే హైకోర్టులో కేసు దాఖలైన సమయంలో మద్రాస్ హైకోర్టులో ఎలాంటి సూట్ పెండింగ్ లో లేదని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. బాంబే హైకోర్టులో విచారణ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో కేసును బదిలి చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. ఇళయరాజా కోరిన కోరికను మన్నించేందుకు తిరస్కరించింది. దీంతో IMMPL, సోనీ మ్యూజిక్ మధ్య తలెత్తిన వివాదం.. బాంబే హైకోర్టులోనే కొనసాగనుంది. ఇదిలా ఉంటే 2022లోనే సోనీ మ్యూజిక్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఇళయరాజా స్వరపరిచిన 536 సంగీత పాటలను IMMPL ఉపయోగించుకోకుండా నిషేధం విధించాలని కోర్టును కోరింది. ఆయా పాటలకు కాపీ రైట్ హక్కులను ఓరియంటల్ రికార్డ్స్, ఎకో రికార్డింగ్ ద్వారా సంపాదించినట్లు పిటిషన్ లో పేర్కొంది. ఇదిలా ఉంటే భారత్ లోని అత్యంత ప్రముఖ సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకరు. ఆయన 1500 పైగా చిత్రాలకు 7,500 పాటలు స్వపరిచారు.