TCS layoffs 2025: భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఊహించని బ్యాడ్ న్యూస్ ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల సంఖ్యను దాదాపు 2 శాతం మేర తగ్గించుకోనున్నట్టు (TCS layoffs 2025) వెల్లడించింది. ఈ నిర్ణయం 12,000 మందికిపైగా ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. వచ్చే ఏడాదిలో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఉద్వాసనకు గురవనున్న వారిలో మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ఉండనున్నారు. ఈ మేరకు ‘మనీకంట్రోల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీసీఎస్ సీఈవో కే.కృతివాసన్ వెల్లడించారు. సాంకేతిక మార్పుల నేపథ్యంలో సంస్థను మరింత క్రియాశీలకంగా, భవిష్యత్‌కు తగిన విధంగా రూపుదిద్దడమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగమని ఆయన వివరించారు.
ఉద్యోగుల తగ్గింపునకు గల కారణాలు ఏమిటని ప్రశ్నించగా కృతివాసన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఐటీ ఇండస్ట్రీలోనే మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పని చేసే విధానాలు మారుతున్నాయని అన్నారు. ప్రతి సంస్థ విజయవంతంగా ముందుకు సాగాలంటే, భవిష్యత్తు తగిన విధంగా సిద్ధంగా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
కృత్రిమ మేధస్సు (AI), అలాగే ఆపరేటింగ్ మోడల్ మార్పుల గురించి గతకొంతకాలంగా ప్రస్తావిస్తూనే ఉన్నామని కృతివాసన్ పేర్కొన్నారు. టీసీఎస్ కంపెనీ ఏఐను పెద్దఎత్తున వినియోగిస్తోందని, అదేవిధంగా భవిష్యత్ అవసరాల మేరకు అవసరమైన నైపుణ్యాలను అంచనా వేస్తోందని ఆయన వివరించారు. కంపెనీ ఉద్యోగులకు కెరీర్ అభివృద్ధి, చక్కటి అవకాశాలు పొందే విషయంలో తాము పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టామని తెలిపారు. అయితే, కొన్ని విభాగాల్లో ఉద్యోగుల తిరిగి నియామక ప్రక్రియ (redeployment) ఆశించినంతగా లేదని కృతివాసన్ వివరించారు. అందుకే కొన్ని విభాగాల్లో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
కింది స్థాయి ఉద్యోగులు సేఫ్
టీసీఎస్ చేపట్టనున్న ఉద్వాసన ప్రక్రియలో కింది స్థాయి ఉద్యోగులు సేఫ్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 2025 జూన్ నాటికి టీసీఎస్‌లో మొత్తం 6,13,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 2 శాతం అంటే, సుమారుగా 12,200 ఉద్యోగాల కోత విధించాల్సి ఉంటుంది. ప్రధానంగా మిడిల్ లెవల్, సీనియర్ లెవల్‌లో ఉండబోతోందని, కిందిస్థాయి ఉద్యోగులపై ప్రభావం ఉండబోదని కృతివాసన్ వెల్లడించారు. ఏఐ కారణంగానే ఉద్యోగుల కోత జరుగుతోందనే సందేహాలను ఆయన కొట్టివేశారు. ఈ కోతలకు ఏఐ అసలు కారణం కాదన్నారు. టీసీఎస్ భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలకు సంబంధించిన అంశమన్నారు. కంపెనీకి తక్కువ ఉద్యోగులు ఉంటే చాలు అన్నది తమ ఉద్దేశం కాదని, అవసరమైన, తగిన ఉద్యోగులను నియమించుకోవడం కంపెనీ సమస్య అని ఆయన వివరణ ఇచ్చారు. మొత్తంగా భవిష్యత్ అవసరాలకు సరిపోయే నైపుణ్యాల లభ్యతపై ఆధారంగా వ్యూహాత్మక నిర్ణయమని టీసీఎస్ చెబుతోంది.
Read Also- Thai Vs Cambodia: ట్రంప్ చెప్పినా తగ్గని థాయ్‌లాండ్, కాంబోడియా
నిశ్శబ్దంగా దెబ్బకొడుతున్న ఐటీ
టీసీఎస్ ఉద్యోగుల కోతపై సీఈవో కృతివాసన్ స్పష్టత ఇచ్చినప్పటికీ, ఏఐ ప్రభావంతో ఐటీ రంగం మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఉద్యోగుల కోతకు ఇదే కారణమని ఐటీ పరిశీలకులు చెబుతున్నారు. ఏఐ సైలెంట్‌గా ఐటీ రంగాన్ని మార్చివేస్తోందని, ఆటోమేషన్ పెరుగుతోందన్నది సత్యమని అంటున్నారు. మాన్యువల్ టెస్టింగ్ వంటి పనుల అవసరం తగ్గిపోతోందని, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో సీనియర్ ఉద్యోగులు ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు స్పష్టం అవుతుందని అంటున్నారు. ఉద్యోగుల తొలగింపు టీసీఎస్‌కు మాత్రమే పరిమితం కాలేదని, గత రెండేళ్ల కాలంలో అనేక కార్పొరేట్ సంస్థలు ఇలా ఉద్యోగులను తొలగిస్తూ, వాటిని ఏఐ ఆధారిత వ్యవస్థలతో భర్తీ చేసుకుంటున్నాయని ఐటీ నిపుణులు చెబుతున్నాయి. అయితే, ఏఐ వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఒక్క సంస్థ కూడా బహిరంగంగా ఒప్పుకోవడం లేదని ప్రస్తావిస్తున్నారు.
Read Also- Fake Embassy: నకిలీ ఎంబసీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి