Never mind primary education in Telangana
Editorial

Primary Education: ప్రాథమిక విద్యను ఇకనైనా పట్టించుకోరూ..!

Never mind primary education in Telangana: వేసవి సెలవుల అనంతరం తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ జూన్ 12వ తేదీన తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో రాబోయే విద్యా సంవత్సరం కోసం విద్యాశాఖ తగిన ఏర్పా్ట్లు చేస్తోంది. డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో కుదైలైపోయిన పాఠశాల విద్య మీద ప్రత్యేకంగా ద‌ృష్టి సారించటం అభినందనీయం. ప్రమాణాల పరంగా పతనావస్థకు చేరిన మన పాఠశాల విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, పేద, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన విద్యను అందించేందుకు విద్యాశాఖ ఆచరణ సాధ్యమైన ప్రణాళికలతో ముందుకు రావాల్సిన సమయమిది. మానవ వికాసానికి పునాది వంటి ప్రాథమిక విద్యను గొప్ప ప్రమాణాలతో అందించి, ఎందరో ప్రముఖులకు జ్ఞానభిక్ష పెట్టిన మన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు పట్టిన దుస్థితిని దూరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని కీలక అంశాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనం కారణంగా సుమారు 40 శాతం పాఠశాలలు మూసివేత అంచున నిలబడాల్సి వచ్చింది. గతంలో అమలైన బడి బాట, బడి పిలుస్తోంది రా, జయశంకర్ బడిబాట వంటి కార్యక్రమాలేవీ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు అనుకున్న స్థాయిలో తీసుకురాలేకపోయాయి. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి, వాటినే రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. కానీ, గత ప్రభుత్వం ఆ పనిచేయకపోగా, రెసిడెన్షియల్ స్కూళ్ల పేరుతో ఏకంగా ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రవేశ పరీక్షలు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను అక్కడకు వెళ్లేలా చేసింది. అంటే.. దశాబ్దాల పాటు గొప్పగా విలసిల్లిన ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను నాశనం చేసి, రెసిడెన్షియల్ పాఠశాలల పేరుతో మరో నూతన వ్యవస్థను నిర్మించామని చెప్పుకున్నారు. నిజానికి రెసిడెన్సియల్ స్కూళ్లకు పెట్టిన ఖర్చుతో పాత ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, అనుబంధంగా హాస్టళ్లు, ప్లే గ్రౌండ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలు అమర్చి ఉంటే, ఈపాటికి మెరుగైన ప్రాథమిక విద్య గ్రామీణ పేద విద్యార్థులకు అంది ఉండేది.

మూడు దశాబ్దాల నాడే మూడేళ్లు నిండిన విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి లాంటి ప్రీ ప్రైమరీ క్లాసులకు చేరటానికి అప్పటి ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. కానీ, అవే ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే మాత్రం పిల్లలకు ఐదేళ్లు నిండాల్సిందేననే నిబంధన పెట్టి పేద విద్యార్థులకు అన్యాయం చేశాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘కేజీ టు పీజీ’ అనే అందమైన అబద్ధపు నినాదాన్ని తెరమీదకి తెచ్చి కాలక్షేపం చేసింది తప్ప ప్రభుత్వ రంగంలో కిండర్ గార్డెన్ క్లాసులనూ ప్రారంభించలేదు, ఐదేళ్ల నిబంధననూ ఎత్తేయలేదు. దీని మూలంగా నర్సరీలో ప్రైవేటు స్కూలుకు వెళ్లిన విద్యార్థి.. తర్వాతి చదువులూ అదే స్కూలులో కొనసాగిస్తున్నాడు. అటు కాయకష్టం చేసి సంపాదించిన సొమ్మంతా పేద, మధ్యతరగతి వర్గాలు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లకు ధారపోయాల్సి వస్తోంది. మరోవైపు ఏటా వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల్లో చేరేవారి సంఖ్య తగ్గిపోతోంది. అటు సమాజానికి, ఇటు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న ఈ నిబంధనలను నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షించాలని మేధావులు, విద్యావేత్తలు కోరుతున్నారు. కనుక, ఇకనైనా ఈ వ్యవస్థను సమీక్షించి ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కాపాడుకోకపోతే, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు బడికి దూరమై పోయే ప్రమాదం ఉంది.

Also Read: చిన్న లేఖ, పెద్ద సందేశం

కార్పొరేట్ స్కూళ్లలో ఇ-టెక్నో, కాన్సెప్ట్, ఒలింపియాడ్ వంటి పేర్లతో చిన్నవయసు నుంచే విద్యార్థులకు బోధన జరుగుతోంది. కానీ, ప్రభుత్వ టీచర్ల కంటే అక్కడి టీచర్లు ప్రతిభావంతులేమీ కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. ఇదే తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విధానాలను అమలు చేయగలిగితే, పేద, మధ్యతరగతి కుటుంబాలు లక్షల్లో ప్రైవేటు స్కూళ్లకు కడుతున్న ఫీజులు ఆదా అవుతాయి. మన ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న టీచర్లు ఉన్నారు. వీరికి తోడు.. యూనివర్సిటీల్లో పీజీ, ఆ పై చదువులు చదివి ఖాళీగా ఉన్న యువతను కాంట్రాక్ట్ బేస్‌లోనైనా ఈ పాఠశాలల్లో నియమిస్తే, వారికీ ఉపాధి లభించటమే గాక పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన ప్రాథమిక విద్యను అందించటం సాధ్యమవుతుంది. మరోవైపు దశాబ్దంన్నర క్రితమే ప్రైవేటు పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ వచ్చాయి. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పరిచిన కంప్యూటర్‌ ల్యాబ్‌లను, వాటిలోని టీచర్లను తొలగించడంతో అవన్నీ మూతపడ్డాయి. గ్లోబలైజేషన్‌లో కంప్యూటర్‌ విద్యకు ఉన్న ప్రాముఖ్యత గుర్తించి కూడా కంప్యూటర్‌ స్కూల్‌ అసిస్టెంటు పోస్టులను ఇకనైనా ప్రభుత్వం సృష్టించాల్సి ఉంది.

జాతీయ విద్యా విధానం, విద్యాహక్కు చట్టం ప్రకారం కాని ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలి. అంతే కాకుండా పాఠశాల క్రమబద్ధీకరణ అనేది బడిలో చేరిన పిల్లల సంఖ్య ఆధారంగా కాకుండా ఆవాస ప్రాంతాలలో బడిఈడు గల పిల్లల సంఖ్య ఆధారంగా నిర్ణయించాల్సి ఉంది. బడిఈడు పిల్లలుండి, వారు బడిలో చేరకపోతే ప్రభుత్వ బడిలో పిల్లలు చేరకపోవడానికి గల కారణాలు అన్వేషించాలి. వాటి ఆధారంగా సమస్యల పరిష్కరిస్తే ప్రభుత్వ బడులు బతుకుతాయి. పాఠశాలల్లో అవసరాలకు మించి ఉన్న అదనపు పోస్టులను సర్దుబాటు చేయటంలో తప్పులేదు. కానీ, గత ప్రభుత్వం కొన్ని పాఠశాలలు మూసివేసి, మరికొన్ని పాఠశాలను డీగ్రేడ్‌ చేసి, ఉపాధ్యాయుపై పనిభారం పెంచి, టీచరు పోస్టులు మిగులు ఉన్నట్లుగా చూపించింది. ఈ విధానం సమర్ధనీయం కాదు. గత పదేళ్లలో అవసరమైన పాఠశాల్లో అదనపు టీచరు పోస్టులు కల్పించకపోగా, అటెండరు, స్వీపరు, జూనియర్‌ అసిస్టెంటు పోస్టుల వంటి భర్తీనీ నిలిపివేశారు.అనేక జిల్లాలకు డిఈవోలు లేకుండా ఇన్‌ఛార్జ్‌ల పాలనలో దశాబ్దకాలాన్ని నెట్టుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్‌ను కుదించి పారేసి, అప్రాధాన్య రంగాలకు మళ్లించారు.

ఏ జాతి భవితైనా తరగతి గదిలోనే రూపుదిద్దుకొంటుంది. నాణ్యమైన విద్య అందరికీ అందినపుడే మానవ వనరులు అభివృద్ధి చెంది, దేశ ప్రగతి పరుగులు పెడుతుంది. అందుకే, విద్యలో ఆదర్శంగా నిలుస్తున్న ఫిన్లాండ్‌, స్విట్జర్లాండ్‌, బెల్జియం, సింగపూర్‌, నెదర్లాండ్‌ వంటి దేశాల విద్యా విధానాలను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణ పరిస్థితికి అన్వయింపజేయటానికి ప్రభుత్వం చొరవ చూపాలి. అందరికీ ఉన్నత ప్రమాణాలున్న విద్య అందించేందుకు కొఠారీ కమిషన్‌ సూచనలను ప్రమాణంగా ఈ ప్రభుత్వం తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. అలాగే, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్న అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాన్ని అమలుకు ప్రభుత్వం ఏదో ఒక స్థాయిలో ప్రయత్నం చేయటమూ మంచిదే. విద్యాహక్కు చట్టం అనుకున్నట్లుగా అమలు కావాలంటే ప్రైవేట్‌ పాఠశాలలను నియత్రించటంతో బాటు ప్రభుత్వ పాఠశాల క్రమబద్ధీకరణకు అనుసరిస్తున్న విధానాలను ప్రైవేట్‌ పాఠశాలకూ వర్తింపజేయాలి. ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, సిబ్బందిని అందించగలిగితేనే ప్రభుత్వం ఏటా ప్రాథమిక విద్య మీద పెడుతున్న వేల కోట్ల రూపాయల ఖర్చు సద్వినియోగమవుతుంది. ప్రభుత్వ పాఠశాల మూసివేతకాదు.. పాఠశాల అభివృద్ధి జరగాలనే ఆశయంతో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ముందుకు సాగాలని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు.

శివరామక‌ృష్ణ, సీనియర్ జర్నలిస్ట్

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు