Short Letter, Big Message: దేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఆయా పార్టీలు.. తమ విధివిధానాలను ప్రజల ముందుంచి, వారి సమ్మతిని ఓటు రూపంలో పొందటం తెలిసిందే. అలా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయాన్ని పార్లమెంటులో చర్చల రూపంలో వ్యక్తం చేయటం, దీనిపై అటు ప్రభుత్వం, ఇటు విపక్షం కలసి నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. అయితే, ఈసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు, విద్వేష ప్రసంగాలే తప్ప పేదలు, మహిళలు, కార్మికులు, రైతులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు చర్చకు రావటం లేదు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ 2024 మే 9 వతేదీన హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఎడిటర్ ఎన్. రామ్, సుప్రీంకోర్టు మాజీన్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్, మాజీ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అజిత్.పి. షాలు.. భారత ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్న రాజ్యాంగం, రిజర్వేషన్లు, ఆర్టికల్ 370, సంపద పంపిణీ వంటి అంశాల మీద బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని ఆ లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ ప్రధాన నేతల మధ్య చర్చ సాధ్యపడకపోతే, వారి ప్రతినిధుల మధ్య అయినా చర్చ జరగాలని తాము కోరుకుంటున్నట్లు, ‘పబ్లిక్ డిబేట్’ నిర్వహించే ట్రెండ్ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో మాదిరిగా జరిగే ఈ చర్చకు ఇద్దరు నేతలూ అంగీకరిస్తే, తాము తటస్థ వేదికను ఏర్పాటుచేసి, పబ్లిక్ డిబేట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఆ లేఖలో ప్రతిపాదించారు. లోక్‌సభ వంటి అత్యున్నత చట్టసభలకు జరిగే ఎన్నికలలో ప్రధాన పార్టీలు తమ రాజకీయ లక్ష్యాలను పక్కనబెట్టి, దేశంలోని ప్రధాన సమస్యలు,అంశాలపై పారదర్శకంగా చర్చకు సిద్ధమైతేనే దేశ వాస్తవిక పరిస్థితి ప్రజలకు అర్థమవుతుందనే ఆశ, తద్వారా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం నెలకొంటుందనే భావన వారి లేఖలో కనిపించింది. అయితే, దురదృష్టవశాత్తూ ప్రధాన స్రవంతి మీడియాలో ఈ లేఖకు, ఈ లేఖలో వారు ప్రస్తావించిన గొప్ప ఆలోచనకు ఎలాంటి ప్రాచుర్యమూ దక్కకపోగా, సదరు మీడియా సంస్థలన్నీ దీనిని ఒక వార్త స్థాయికి పరిమితం చేశాయి. దీనిపై ఎలాంటి చర్చ కూడా జరగలేదు. అయితే, ఈ లేఖను అందుకున్న రాహుల్ గాంధీ చర్చకు సిద్ధమని ప్రకటించగా, ప్రధాని మోదీ మాత్రం మౌనంగా ఉండిపోయారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారపు వేళ, సదరు మేధావులు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు లేఖ రాయటం వెనక బలమైన కారణాలే ఉన్నాయి. వీరిలో ప్రధాని మోదీ గత దశాబ్దకాలంగా దేశాన్ని పాలించిన ప్రధానిగా, అత్యంత జనాకర్షణ గల నేతగా పేరుపొందారు. ఇక.. రాహుల్ గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాధికారిగానే గాక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీకి ప్రధాన ప్రతినిధి. అంతేకాదు.. దేశంలో మోదీ తర్వాత.. ప్రధాని కాగల అర్హతలున్న వ్యక్తిగా 28 శాతం ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తి కూడా. గతంలో ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రలోనూ ప్రజలకు ఆయన పట్ల, ఆయన పార్టీ పట్ల, ఆయన ప్రస్తావించే అంశాల పట్ల ఆసక్తి, కుతూహలం ఉన్నట్లు స్పష్టమైంది. కాబట్టి ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో.. ఈ ఇద్దరు ప్రభావశీలమైన నాయకుల మధ్య వివిధ అంశాల మీద ముఖాముఖి చర్చ జరిగితే, అది మరింత వేగంగా, సూటిగా ప్రజల దృష్టిని ఆకర్షించగలుగుతుందే ఆశ, ఆకాంక్ష కూడా ఈ లేఖ రాసిన వారిలో ఉంది. మరోవైపు ప్రధానిగా ఉన్న వ్యక్తి విద్వేష ప్రసంగాలతో ప్రజల్లో అనుమాన బీజాలు నాటిన వేళ ఇక రాబోయే ఎన్నికల ప్రచారంలో దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, నానాటికీ పెరుగుతున్న అసమానతలు, ధరల నియంత్రణ, ద్రవ్యోల్బణం, మితిమీరిన ప్రైవేటీకరణ, అంతర్జాతీయ స్థాయిలో ఆయా దేశాలతో ఉన్న సమస్యల వంటి కీలక అంశాలు బొత్తిగా చర్చకు రావేమోననే ఆందోళన కూడా ఈ లేఖ రాసేలా ఆ మేధావులను ప్రోత్సహించి ఉంటుంది.
Also Read: ఈ భీకర యుద్ధం ఆగేదెప్పుడో…?
గతంలో తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన అధికార పార్టీ, ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా దేశంలో కరాళ నృత్యం చేస్తున్న నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడటం లేదు. గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ గణాంకాలు చెబుతున్నప్పటికీ, గడచిన నాలుగు దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఎక్కడా కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలలో 9 లక్షలకు పైగా ఉన్న ఖాళీల మీద ఈ ప్రచారంలో కనీసం ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇక సంక్షోభంలో ఉన్న భారత రైతాంగపు ప్రధాన సమస్యలైన మద్దతు ధర పెంపు, సబ్సిడీల కోతపైనా ఎలాంటి స్వాంతన కలిగించే ప్రకటనా రాలేదు. సాగుచట్టాలను వ్యతిరేకించే క్రమంలో చనిపోయిన రైతుల గురించి మాటవరకైనా సంతాపమో, సానుభూతో వ్యక్తం చేసినా, ప్రధాని దృష్టిలో రైతుల ఎజెండాకు ప్రాధాన్యం ఉన్నదనే భావనైనా రైతాంగానికి కలిగేది. దురదృష్టవశాత్తూ అదీ జరగలేదు. ఇక, దేశంలో పేదలు, సంపన్నుల మధ్య పెరుగుతున్న అంతరాల గురించి కూడా ప్రధాని ప్రసంగాలు ప్రస్తావించలేదు. 2020లో దేశంలో 102 మంది బిలియనీర్లు ఉంటే 2022 నాటికి వారి సంఖ్య 166 కి పెరగటమే గాక, ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నులకు 3, 11 స్థానాలు దక్కాయి. ఈ అంతరాలు ఇలానే కొనసాగి, దేశ సంపద గుప్పెడు మంది సంపన్నుల చేతిలో కేంద్రీకృతమైతే, దేశంలో ఆర్థిక హింస (ఎకనమిక్ వైలెన్స్) తప్పదంటూ ఆక్స్‌ఫామ్ సంస్థ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిచ్చెన మెట్ల మన సమాజంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వాస్తవిక పరిస్థితి తెలుసుకోవాలంటే దేశవ్యాప్తంగా బీసీల జనగణన జరగాలని ప్రతిపాదిస్తున్న విపక్షపు ఆలోచనను పూర్వపక్షం చేస్తూ, ఇది దేశ ప్రజల మధ్య చీలిక తెస్తుందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేయటం కూడా ప్రజల దృష్టిని దాటిపోలేదు.
నేలచూపులు చూస్తున్న రూపాయి విలువ, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్ ధరల అంశాలు, అన్ని కీలక రంగాల్లోనూ విజృంభిస్తున్న కార్పొరేట్ శక్తుల ప్రభావం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గనులు, విద్యుత్ వంటి కీలక రంగాల్లో పెరుగుతున్న వారి ప్రభావం వంటి అంశాలపై వస్తున్న ఆరోపణల మీదా ప్రధాని ఎక్కడా స్పందిచలేదు. దేశపు అంతర్గత భద్రత, పొరుగు దేశాలతో మన సంబంధాల్లో ఏర్పడిన అగాథాలు, ప్రభావశీల దేశాలు, వాటి విధానాలపై మన విదేశాంగ విధానాల్లో వచ్చిన, రావాల్సిన మార్పుల వంటి కీలక అంశాలు, కేంద్ర అవలంబిస్తున్న ఆర్థిక విధానాలపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్, అమర్త్యసేన్ వంటివారి అభిప్రాయాలపై ఎక్కడా ప్రధాని బదులివ్వకపోవటమూ ఈ లేఖ రాసిన బుద్ధిజీవులను కంగారు పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకవేళ ప్రధాని మోదీ గనుక రాహుల్ గాంధీతో ముఖాముఖి చర్చకు వచ్చి ఉండిఉంటే, చట్టసభలకు ప్రభుత్వాలు జవాబుదారీ కావాలన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య అంతస్సూత్రం ఈ పదేళ్ల కాలంలో ఎంతగా అపహాస్యం పాలైందీ దేశవాసుల దృష్టికి వచ్చి ఉండేది. అరుపులు, ఆందోళనలు, అవాంతరాలు, వాయిదా పర్వాలతో ఏటికేడు తగ్గిపోతూ వస్తోన్న మన పార్లమెంటు పనిగంటల ముచ్చట మీదా చర్చ జరిగేది. 2020లో రాజ్యసభలో పెద్దగా చర్చలేకుండానే కీలకమైన ఐఐఐటీ సవరణ చట్టం బిల్లు, నిత్యావసరాల చట్ట సవరణ, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట సవరణ, కంపెనీ చట్ట సవరణ, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ చట్ట చవరణ, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, పన్ను చట్ట సవరణ బిల్లులు నిమిషాల్లో ఎలా ఆమోదం పొందాయో, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాగు చట్టాల విషయంలోనూ ఏ చర్చాలేకుండా ఆమోదంపొందాయో, 2023లో ద్రవ్య వినిమయ బిల్లును ఎలాంటి చర్చా లేకుండా రూ. 2,70,507 కోట్ల మొత్తానికి కేంద్రం ఆమోదం పొందిన వైనం.. ఇలా అనేక కీలక విషయాల మీద ఆరోగ్యకరమైన చర్చ జరిగి వాస్తవాలు ప్రజలకు బోధపడేవి. అయితే, దురదృష్టవశాత్తూ ఈ చర్చ కార్యరూపం దాల్చలేదు.
Also Read: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం..!
దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక మన పార్లమెంటు. పౌరపాలన సక్రమంగా సాగుతుంతో లేదో కనిపెట్టే అతిపెద్ద రాజ్యాంగ సభ అది. సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా శాసన నిర్మాణంలో విపక్షాలనూ కలుపుకుపోయి, వాటి సహేతుక సూచనలను మన్నించే రాజనీతిజ్ఞతను ఈ సభా నాయకులు ప్రదర్శించాల్సి ఉంది. మరి.. ఇంత పెద్ద బాధ్యతగల మన పార్లమెంటుకు ఎన్నికయ్యే వ్యక్తులు, వారి ఆలోచనలు, ప్రజాసమస్యలపై సభికుల చిత్తశుద్ధి ఎలాంటిదో తెలియాలంటే ఎన్నికల సమయంలో వారు ప్రజల ముందు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఆయా అంశాలపై చర్చకు సిద్ధం కావాల్సి ఉంది. ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాలానుగుణంగా ఇలాంటి చర్చలు ప్రధాన పార్టీల మధ్య ముఖాముఖి జరగటం వల్ల మన ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుంది. అలాంటి సానుకూలమైన మార్పు కోసం పైన చెప్పుకున్న ముగ్గురు పెద్దమనుషులు మౌనం వీడి, లేఖ రూపంలో ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య నిర్మాణంలో చర్చ అవసరాన్ని జాతిముందు పెట్టటం సదా అభినందనీయం.
-డాక్టర్ తిరునహరి శేషు పొలిటికల్ ఎనలిస్ట్
కాకతీయ విశ్వవిద్యాలయం (9885465877)