Jagruti vs BRSV: తెలంగాణలో జాగృతి వర్సెస్ బీఆర్ఎస్వీగా పరిస్థితి మారింది. రెండూ పోటాపోటీగా శిక్షణా తరగతులకు సిద్ధమయ్యాయి. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అన్నాచెల్లెళ్ల సవాల్ అన్నట్లుగా పరిస్థితి నెలకొన్నది. జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్‌కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉంది. పార్టీకి కేటీఆర్(KTR) వర్కింగ్ ప్రెసిడెంట్. ఇద్దరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తారా? లేకుంటే ఒకరినొకరు విమర్శస్త్రాలు సంధించుకుంటారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పార్టీ కేడర్‌లో మాత్రం గందరగోళానికి తెరదీసింది. బీఆర్ఎస్‌లో కేటీఆర్,(KTR) కవిత(Kavitha) ఇద్దరు కీలక నేతలు. పార్టీలో ఎమ్మెల్సీ కవిత పదవి ఉన్నప్పటికీ సొంత జాగృతి(Jagruthi) సంస్థ బలోపేతంపైనే ప్రత్యేక దృష్టిసారించారు.
కేటీఆర్,(KTR) మాత్రం పార్టీ బలోపేతంపై దృష్టిసారించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. పార్టీ విద్యార్థి విభాగం నేతలను పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు చేయాలని ఆదేశిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు, ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ 26న నిర్వహిస్తున్నట్లు ఇరువురూ ప్రకటించారు. జాగృతి ‘లీడర్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితనే రెండు సెషన్లు నిర్వహిస్తున్నారు. కానీ, బీఆర్ఎస్వీ సదస్సుకు హరీశ్ రావు, కేటీఆర్,(KTR) తో పాటు ముఖ్య నేతలు హాజరై రెండు సెషన్లలో పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ వ్యవహారం గులాబీ పార్టీలోనే చర్చకు దారితీసింది. ఒకేసారి రెండు కార్యక్రమాలను ఎందుకు ఫిక్స్ చేశారు? అసలు కారణమేంటి? వేర్వేరు తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహించొచ్చు కదా? అనేది ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. అసలు పార్టీలో ఏం జరుగుతోందో తెలియక కేడర్‌లో అయోమయం నెలకొన్నది.
Also Read: Kavitha on BRS: మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదు.. కవిత
❄️రండి.. విచ్చేయండి!
యువత, విద్యార్థులే లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో కవిత ముందుకు సాగుతున్నారు. యువత, మహిళలు, బహుజనులు రాజకీయాల్లో రావాలని ప్రతీ సందర్భంలోనూ పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజకీయశిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలుత రాష్ట్రస్థాయిలో ‘లీడర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 26న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని గత నెల 15వ తేదీనే కవిత ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జాగృతి(Jagruthi) ప్రతినిధులు రావాలని పిలుపు నిచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ లీడర్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ శిక్షణా తరగతుల్లో యువతకు పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విధులు, నిధులతో పాటు పోటీచేసేందుకు అర్హతలు, యువత రాజకీయాల్లోకి వస్తే మార్పులను వివరించనున్నారు. అంతేగాకుండా త్వరలోనే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు జాగృతి కమిటీలు సైతం వేయనున్నట్లు తెలుస్తోంది.
❄️ఉద్యమానికి సిద్ధమవ్వండి!
బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్,(KTR) పార్టీని నడిపిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎప్పకటిప్పుడు ఎండగడుతున్నారు. హామీలు, గ్యారెంటీలపై నిలదీస్తున్నారు. అయితే బనకచర్లపై ఈనెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే 26న ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఉదయం సెషన్‌ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సాయంత్రం కేటీఆర్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టనున్నారు. ప్రాజెక్టుపై జంగ్ సైరన్ మోగించేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే నేతలు ప్రకటించారు. అయితే ఈ పోటాపోటీ శిక్షణ కార్యక్రమాలు ప్రస్తుతం కేడర్‌ను గందరగోళానికి తెరదీశాయి.
రేపే జాగృతి ‘లీడర్’
❄️యువత, మహిళలను నేతలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆధ్వర్యంలో రేపు (శనివారం) ‘లీడర్’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) కీలక ఉపన్యాసంతో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, బహుజనులను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ జాగృతి ‘లీడర్’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్‌లో రెండు సెషన్స్‌గా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని నవీన్ చెప్పారు.
జంగ్ సైరన్ కోసం సదస్సు
❄️26న మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహణ
బనకచర్ల ప్రాజెక్టుపై జంగ్ సైరన్ మోగించేందుకు 26న బీఆర్ఎస్‌వీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నామని, ఉదయం 10గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ పాల్గొని బనకచర్లతో తెలంగాణకు జరిగే నష్టాన్ని విద్యార్ధి నేతలు ప్రతీ కాలేజి తిరిగి వివరిస్తున్నారన్నారు. 5లక్షల కరపత్రాలు ముద్రించామని, విద్యార్థులను కలిసి బనకచర్లతో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని కరపత్రాలతో వివరిస్తున్నామన్నారు. చంద్రబాబు, మోదీ, రేవంత్ రెడ్డిలు కలిసి తెలంగాణ నీటి వనరులను కొల్లగొడుతున్న తీరును వివరిస్తామని గెల్లు వెల్లడించారు.
Also Read: MLC Kavitha: కవిత కయ్యాలపై కీలక భేటీ.. జాగృతిపైనే ప్రధానంగా చర్చ!
