Sarcoma Signs: క్యాన్సర్ వ్యాధి అనేక రకాలుగా మానవ శరీరంలో వృద్ధి చెందుతుంది. ఎముకలు, మృదులాస్థి, కొవ్వు, కొండరాల వంటి కణజాలలపై ప్రభావం చూపే క్యాన్సర్ ను సార్కోమా (Sarcoma) అంటారు. పిల్లలు, యువకులు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఆంకాలజీ నిపుణులు తెలియజేస్తున్నారు. శరీరంపై గడ్డలు లేదా వాపు మాత్రమే ఈ వ్యాధి లక్షణంగా చాలా మంది భావిస్తూ వస్తున్నారు. అయితే సార్కోమాకు మరికొన్ని లక్షణాలు సైతం ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సంకేతాలు మీ శరీరంలో కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదిచాలని సూచిస్తున్నారు. అలా చేస్తే సార్కోమా నుంచి బయటపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సూచిస్తున్నారు. ఇంతకీ ఆంకాలజిస్ట్‌లు సూచిస్తున్న ఆ ఐదు లక్షణాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
నొప్పిలేని గడ్డ లేదా వాపు
శరీరంలో ఎక్కడైనా (ముఖ్యంగా చేతులు, కాళ్లు లేదా బొడ్డు ప్రాంతంలో) నొప్పిలేని గడ్డ లేదా వాపు కనిపిస్తే దానిని సార్కోమా అతి సాధారణ లక్షణంగా చెప్పవచ్చు. ఈ గడ్డ సాధారణంగా గట్టిగా ఉంటుంది. వేలితో నొక్కినప్పుడు సులభంగా కదలదు. ఇది కొన్ని వారాల నుండి నెలల గ్యాప్ తర్వాత క్రమంగా పెరుగుతుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఎముకలో నొప్పి
ఎముకల సార్కోమా (ఉదా: ఆస్టియోసార్కోమా) ఉన్నవారిలో సంబంధిత ఎముక లేదా ఆ ప్రాంతంలో నొప్పి రావడం మెుదలవుతుంది. ఈ నొప్పి తొలుత తాత్కాలికంగా భరించకలిగేదిగా ఉండవచ్చు. ఆ తర్వాత క్రమంగా ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుతుంది. ముఖ్యంగా రాత్రివేళ్లలో ఎముకలో నొప్పి తీవ్రంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
కదలికలో ఇబ్బందులు
సార్కోమా క్యాన్సర్ కు సంబంధించిన కణితి పెరిగే కొద్ది దాని చుట్టూ గడ్డ లేదా ఎముక చుట్టూ వాపు ఏర్పడవచ్చు. ఇది సమీపంలోని కీలు లేదా అవయవం కదలికలపై ప్రభావం చూపవచ్చు. నడవడం, కీలు వంచడం లేదా నిఠారుగా నిలబడటం వంటి వాటిలో సమస్యలు ఎదురుకావొచ్చు. కొన్నిసార్లు వాపు ఉన్న ప్రాంతం వెచ్చగా లేదా సున్నితంగా అనిపించవచ్చు.
బరువు తగ్గడం
సార్కోమా క్యాన్సర్ బారినపడ్డ వారిలో అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా ఓ లక్షణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డైట్, వ్యామయం వంటివి చేయనప్పటికీ గణనీయంగా బరువు తగ్గుతుంటే అది శరీరంలో పుట్టుకొస్తున్న వ్యాధి సంకేతం కావొచ్చని స్పష్టం చేస్తున్నారు.
అలసట, బలహీనత
తీవ్రమైన అలసట, బలహీనంగా మారినట్లు అనిపించడం కూడా సార్కోమా క్యాన్సర్ లక్షణాల్లో ఒకటిగా ఆంకాలజిస్ట్ లు చెబుతున్నారు. శరీరంపై క్యాన్సర్ చూపిస్తున్న ప్రభావం వల్ల నిరసించిపోతున్న ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.
Also Read: Janhvi Kapoor: ఛీ ఛీ వాడు మనిషేనా.. చాలా సిగ్గుచేటు.. జాన్వీ తీవ్ర ఆగ్రహం!
సార్కోమా ఎంత ప్రమాదకరం?
క్యాన్సర్లలోని రకాల్లో సార్కోమా చాలా దూకుడు కలిగిన వ్యాధి అని ఆంకాలజిస్ట్ లు తెలియజేస్తున్నారు. ఇది ఊపిరితిత్తులు వంటి సున్నితమైన శరీర భాగాలకు సైతం వ్యాపించవచ్చని తెలియజేస్తున్నారు. ఫలితంగా ట్రీట్ మెంట్ కష్టంగా మారడంతో పాటు మనిషి బతికే అవకాశాలను గణనీయంగా తగ్గించేస్తుందని స్పష్టం చేస్తున్నారు. పైగా ఈ వ్యాధిని గుర్తించడం కూడా చాలా కష్టమని.. దీనికి నిర్ధిష్టమైన స్క్రీనింగ్ పరీక్షలు సైతం లేవని చెబుతున్నారు. పైన చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తే వాటి ఆధారంగా ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లేదా బయప్సీ వంటి రోగ నిర్ధారణ పరీక్షల ద్వారా సార్కోమాను గుర్తించే అవకాశముంటుందని వివరిస్తున్నారు. రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ, టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ.. సార్కోమా వ్యాధికి చికిత్సలుగా ఉన్నాయని తెలియజేస్తున్నారు.
Also Read This: Fat Loss Tips: ఒంట్లో కొవ్వు పెరిగిపోతోందా? ఈ 7 చిట్కాలతో చెక్ పెట్టండి!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.