CM Revanth Reddy ( image CREDIT: SWETCHA REORTER)
Politics

CM Revanth Reddy: 42శాతంపై ఎందుకు స్పందించడం లేదు.. లోక్‌సభలో రాజ్యసభల్లో ఒత్తిడి తెస్తాం

CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మౌనం వీడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. బీసీల వెనకబాటు తనం ఆధారంగా తాము రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే కేంద్రంలోని బీజేపీ (Bjp)  సర్కార్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. లేకపోతే లోక్ సభ, రాజ్యసభల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. 1931 తర్వాత కుల గణన చేసింది ఒక్క తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు ఎంతో కీలకమని పేర్కొన్నారు. బీసీల‌కు విద్యా, ఉపాధి రంగాల్లో రిజ‌ర్వేష‌న్లు, స్థానిక సంస్థల్లో 42 శాతానికి సంబంధించి తెలంగాణ శాస‌న‌స‌భలో చర్చించి ఆమోదించామన్నారు. కానీ, బిల్లు ఆమోదించ‌డంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ స‌మావేశాల్లోనే బీసీ బిల్లుపై ప‌ట్టుప‌డతామని పేర్కొన్నారు.

 Also Read: BRS: నివురుగప్పిన నిప్పులా గ్రూపులు.. మెజార్టీ ఎలా?

దత్తన్నకు ఉప రాష్ట్రపతి ఇవ్వాలి
ఉప రాష్ట్రప‌తి జ‌గ్‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ రాజీనామాకు కార‌ణాలేమిటో త‌న‌కు తెలియ‌ద‌ని, కానీ ఆ రాజీనామా దుర‌దృష్టక‌ర‌మ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విని ఈ ద‌ఫా తెలంగాణ‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఉప రాష్ట్రప‌తిగా ఉన్న తెలుగు వ్యక్తి వెంక‌య్య నాయుడిని రాష్ట్రప‌తి కాకుండా ఇంటికి పంపించారని ఆరోపించారు. సికింద్రాబాద్ నుంచి గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న బీసీ నేత ద‌త్తాత్రేయ‌ను గ‌వ‌ర్నర్‌గా పంపి ఆ ప‌ద‌విని కిష‌న్ రెడ్డికి ఇచ్చార‌న్నారు.

బీసీ నేత‌గా ఉన్న సంజ‌య్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ప‌ద‌వి నుంచి తొల‌గించి కిష‌న్ రెడ్డికి, ఆయ‌న త‌ర్వాత రాంచంద‌ర్‌ రావుకు ఇచ్చార‌ని, బీజేపీ బీసీల‌కు అన్యాయం చేసింద‌ని రేవంత్ విమ‌ర్శించారు. ద‌త్తన్న గ‌వ‌ర్నర్ ప‌ద‌వీ వయస్సు కారణంగా ముగిసిపోయింద‌ని తెలిసింది. బీసీల‌కు చేసిన ఈ అన్యాయాన్ని స‌రిచేసుకునేందుకు ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి ఇస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లో అంతిమ‌ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేన‌ని, త‌న‌కు అవ‌కాశం ఉంటే తెలుగు బిడ్డగా ద‌త్తాత్రేయ‌కు మ‌ద్దతు ఇచ్చే విష‌యంలో ప్రయ‌త్నం చేస్తాన‌ని సీఎం చెప్పారు.

ఫ్యామిలీ ట్యాపింగ్ వాళ్లు సూసైడ్ చేసుకోవాలి (బాక్స్)
‘ (Phone Tapping) ఫోన్ ట్యాపింగ్‌పై నాకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు, ఇస్తే వెళ్తాను. ట్యాపింగ్‌పై గవర్నమెంట్ కేసు పెట్టలేదు. సామాగ్రి మిస్సింగ్ కేసు మాత్రమే ఉంది. దాన్ని లోతుగా విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చాయి. ఆర్ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. అన్ని ప్రభుత్వాలు చేసేవే అయితే కేటీఆర్ (KTR)  కమిషన్ ముందుకెళ్లి అదే చెప్పాలి. ఆయన వాక్ స్వాతంత్రాన్ని”నేను హరించను. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)  పద్ధతి ప్రకారం చేయాలి. చట్టవిరుద్దం కాదు కానీ, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. పెగాసస్ వాడారో లేదో కమిషన్ ఇచ్చే నివేదికను బట్టే తెలుస్తుంది. నెగెటివ్ అంశాలను నేను పెద్దగా పట్టించుకోను. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా చాటుగా వినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికంటే చావడమే మేలు’ అని రేవంత్ మండిపడ్డారు.

42 శాతం బీసీ రిజర్వేషన్‌తో ఎన్నికలు
‘స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధ‌న‌ను ఎత్తివేసే విష‌యాన్ని తీవ్రంగానే ప‌రిశీలిస్తున్నాం. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లతో తెలంగాణలో స్థానిక ఎన్నిక‌లు నిర్వహించేందుకు కృత‌ నిశ్చయంతో ఉన్నాం. హైకోర్టు సైతం 90 రోజుల్లో (సెప్టెంబ‌రు నెలాఖ‌రులోగా) స్థానిక సంస్థలు ఎన్నిక‌లు నిర్వహించాలి. 30 రోజుల్లో (జూలై నెలాఖ‌రులోగా) రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయాల‌ని ఆదేశించింది. బీసీల‌కు విద్యా, ఉపాధి రంగాల్లో రిజ‌ర్వేష‌న్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లకు సంబంధించి తెలంగాణ శాస‌న‌స‌భ పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లుల‌ను ఆమోదించ‌డంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.

ఈ రెండు బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యస‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేల‌ను గురువారం ఉద‌యం క‌లిసి తెలంగాణ ప్రభ‌త్వం చేప‌ట్టిన సామాజిక‌, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజ‌కీయ, కుల స‌ర్వే జ‌రిపిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం అనుస‌రించిన విధానాల‌ను వివ‌రిస్తాం. కాంగ్రెస్ లోక్‌స‌భ‌, రాజ్యస‌భ స‌భ్యుల‌కు ఈ అంశాన్ని వివ‌రిస్తాం. ఈ పార్లమెంట్ స‌మావేశాల్లోనే తెలంగాణ ప్రభుత్వం చేసిన‌ రెండు బిల్లుల ఆమోదానికి ప‌ట్టుప‌డ‌తాం. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లకు సంబంధించి తెలంగాణ శాస‌న‌స‌భ‌లో బీజేపీ, బీఆర్ఎస్‌, సీపీఐ, ఎంఐఎం మ‌ద్దతు ప‌లికాయి.

బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లను అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, సంజ‌య్ ముస్లింల‌ను సాకుగా చూపుతున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌, ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉత్తర‌ప్రదేశ్‌, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాల‌యం ఉన్న మ‌హారాష్ట్రలోనూ ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతున్నాయి. బీజేపీ నేత‌ల‌కు ద‌మ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌ని ప్రక‌టించాలి. గుజ‌రాత్‌లో ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతున్నాయి, ఇక ముందు అమ‌లు చేస్తామ‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఈ కామెంట్స్ చేసినందుకు బీజేపీ నేత‌లు అమిత్ షాను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తారా?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఫిబ్రవరి 4న సోషల్ జస్డిస్ డే
ఇక తెలంగాణ‌లో సామాజిక‌, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజ‌కీయ కుల స‌ర్వే ప్రక్రియ‌ను 2024, ఫిబ్రవ‌రి 4న మొద‌లు పెట్టి 2025, ఫిబ్రవ‌రి 4వ తేదీ నాటికి పూర్తి చేసి శాస‌న‌స‌భ‌లోనూ ఆమోదించామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే తెలంగాణ‌లో ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా (సోష‌ల్ జ‌స్టిస్ డే) జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. ఈ స‌ర్వేలో తెలంగాణ‌లో 3.55 కోట్ల మంది వివ‌రాలు సేక‌రించామ‌ని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స‌ర్వే వివ‌రాల‌ను శాస‌న‌స‌భ ముందుంచామ‌ని, దాని ప్రకారం 56.4 శాతం బీసీలు, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శాతం ఎస్టీలు, 10.09 శాతం ఉన్నత వ‌ర్గాల వారు ఉన్నార‌ని సీఎం చెప్పారు. తెలంగాణ‌లో 3.09 శాతం మంది తాము ఏ కులానికి చెంద‌మని ప్రక‌టించార‌ని, తెలంగాణలో ఇదో కొత్త పరిణామమని అన్నారు.

స‌ర్వే వివ‌రాల‌ను స్వతంత్ర నిపుణుల స‌ల‌హా క‌మిటీకి ఇచ్చామ‌ని, వారు దానిపై చ‌ర్చించి నివేదిక‌ను రాష్ట్ర ప్రభుత్వానికి స‌మ‌ర్పించార‌ని రేవంత్ తెలిపారు. ఆ నివేదిక‌ను మంత్రివ‌ర్గంలో చ‌ర్చించి శాస‌న‌స‌భ‌లో ప్రవేశ‌పెడ‌తామ‌ని వెల్లడించారు. స‌ర్వే చేసిన‌ప్పటికీ వ్యక్తిగ‌త వివ‌రాలు వెల్లడించ‌కూద‌ని, అది వ్యక్తిగత డేటా ప్రైవ‌సీ యాక్ట్‌కు విరుద్ధమ‌ని సీఎం వెల్లడించారు. కుల గ‌ణ‌న విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిలిచింద‌న్నారు. రాబోయే 2029 లోక్‌స‌భ ఎన్నిక‌లు ఓబీసీ రిజ‌ర్వేష‌న్లకు లిట్మస్ టెస్ట్‌గా నిలుస్తాయ‌ని రేవంత్ రెడ్డి ప్రక‌టించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారులు ష‌బ్బీర్ అలీ, హ‌ర్కార వేణుగోపాల రావు, ఎంపీలు డాక్టర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘురామిరెడ్డి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, కుందూరు ర‌ఘువీర్ రెడ్డి, గ‌డ్డం వంశీ కృష్ణ, డాక్టర్ క‌డియం కావ్య, సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్ యాద‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read: Hyderabad Floods: వర్షపు నీటి ప్రవాహానికి ‘లైన్ క్లియర్’.. నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న హైడ్రా అధికారులు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు