New NCERT book: భారత అంతరిక్ష చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన శుభాంశు శుక్లా.. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించారు. విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకంలో శుభాంశు అందించిన అద్భుతమైన సందేశం లిఖించబడింది. భారత వ్యోమగామి అయిన శుభాంశు శుక్లా.. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 18 రోజుల పాటు గడిపిన సంగతి తెలిసిందే. యాక్సియం – 4 మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లా అతడి బృందం.. స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టి పలు పరిశోధనలు చేసింది. అయితే అంతరిక్షం నుంచి భూమిని చూసిన అనుభవాలను శుభాంశు పంచుకోగా.. వాటిని పాఠ్యపుస్తకం ద్వారా విద్యార్థులకు అందించారు.
శుభాంశు సందేశం ఏంటంటే?
ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) ఐదో తరగతి పర్యావరణ పాఠ్య పుస్తకాల్లో భారత వ్యోమగామి తన శుభాంశు శుక్లా తన అనుభవాలు పంచుకున్నారు. ‘అంతరిక్షం నుండి భూమిని చూసినప్పుడు భూమి పూర్తిగా ఒకటిగా కనిపించింది. ఎలాంటి సరిహద్దులు లేవని అనిపించింది. రాష్ట్రాలు, దేశాలు అన్న ఉనికే కనిపించలేదు. మనమందరం మానవజాతిలో భాగం. భూమి మన ఒకే ఇల్లు. మనమందరం దానిలో ఉన్నాము’ అని శుభాంశు శుక్లా అన్నారు. ఈ వ్యాఖ్యలు ‘అవర్ వండరస్ వరల్డ్’ అనే పాఠ్యపుస్తకంలో ‘ఎర్త్, అవర్ షేర్డ్ హోమ్’ అనే అధ్యాయంలో పొందుపరచడం గమనార్హం. అయితే ప్రధాని మోదీ, శుభాంశు శుక్లా మధ్య జరిగిన సంభాషణ సందర్భంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశారు. వాటిని యధాతథంగా పాఠ్యపుస్తకంలో ముద్రించడం ద్వారా.. భూమిపైన ఉన్న మానవులంతా ఒక్కటే అన్న సందేశాన్ని విద్యార్థులకు ఇచ్చినట్లైంది.
ఈ పుస్తకం ప్రత్యేకత తెలుసా?
జాతీయ విద్యావిధానం 2020 చట్టం ప్రకారం ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) ఐదో తరగతి పాఠ్యపుస్తకాల్లో “ది వరల్డ్ అరౌండ్ అస్” అనే సబ్జెక్ట్ ను చేర్చారు. యువ శాస్త్రవేత్తలు, ప్రముఖులు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకోవడం ద్వారా వారిలో పర్యావరణ అవగాహన పెంపొందించాలని ఈ పాఠ్యాంశం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఈ బుక్ లో శుభాంశు అనుభవాలను సైతం పొందుపరచడం విశేషం. ఈ పాఠ్యాంశంలో నోటి ఆరోగ్య భద్రత, సూక్ష్మజీవుల జీవనం, వరద సన్నద్ధత, ఆహార సంరక్షణ పద్ధతులపై నిపుణుల అభిప్రాయాలు, సూచనలను సైతం పొందుపరిచారు.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా పైన నా అన్వేష్ సంచలన వీడియో.. అదంతా అబద్ధమా? నిజమా?
శుభాంశు గురించి ఇవి తెలుసా?
శుభాంశు శుక్లా చదువు లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో మొదలైంది. 1998లో కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే, దేశానికి సేవ చేయాలనే బలమైన సంకల్పం ఆ సమయంలో పురుడు పోసుకుంది. దృఢ సంకల్పాన్ని పూనుకున్న ఆయన, తన కుటుంబానికి తెలియజేయకుండా యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షకు అప్లికేషన్ పెట్టారు. ఎంతో సంక్లిష్టంగా ఉండే ఆ పరీక్షలో పాసయ్యారు. 2005లో ఎన్‌డీఏ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా ఆయన చదివారు. ఆ తర్వాత, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమానం నడపంలో ట్రైనింగ్ తీసుకున్నారు. 2006లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు నడిపేందుకు అధికారికంగా నియమితులయ్యారు.