Ashley Madison: వివాహితుల డేటింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఏష్లీ మాడిసన్’ (Ashley Madison) యాప్‌లో లాగిన్ అవుతున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. భాగస్వామి ఉన్నప్పటికీ పరాయి వ్యక్తులతో తెరచాటు ప్రేమాయణం లేదా వివాహేతర సంబంధం కోసం వెంపర్లాడుతున్న ట్రెండ్ ఇండియాలోనూ పెరిగుదలకు ప్రతిబింబంగా నిలుస్తోంది.
‘ఏష్లీ మాడిసన్’ వాడకందార్ల సంఖ్య మనదేశంలో గణనీయంగా పెరిగిపోతోంది. భారత్‌లో ఈ యాప్ సైన్ అప్ (sign-ups) ప్రక్రియ కొన్నాళ్లక్రితమే మొదలైంది. దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే ద్వితీయ, తృతీయ స్థాయి నగరాలకు చెందినవారు ఈ యాప్‌లో ఎక్కువగా సైన్ అప్ అవుతున్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరింత ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, దక్షిణ భారతంలో కేవలం 2 లక్షల జనాభా మాత్రమే ఉన్న ఓ చిన్న పట్టణం ‘వివాహితుల డేటింగ్’కు హాట్‌స్పాట్‌గా మారిపోయింది. ఆ పట్టణం పేరు ‘కాంచీపురం’.
భారత్‌లో అత్యధికంగా సైన్ అప్‌లు అయిన టాప్ 20 జిల్లాల జాబితాను 2025 జూన్ రిపోర్టులో ఏష్లీ మాడిసన్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో తమిళనాడులోని కాంచీపురం జిల్లా టాప్‌లో నిలిచింది. చీరలు, ఆలయాలు, శిల్పకళకు ప్రపంచఖ్యాతి గాంచిన కాంచీపురం వరూ ఊహించని ‘వివాహితుల డేటింగ్’కు అడ్డాగా మారింది. ఒకరికంటే ఎక్కువ మందితో సంబంధాలు (మోనోగమీ) కోరుకుంటున్నవారు కాంచీపురంలో పెరిగిపోయినట్టుగా గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. గతేడాది 17వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది నంబర్ 1 స్థానంలో నిలిచింది. అయితే, కాంచీపురంలో ఈ స్థాయిలో సైన్ అప్‌లు పెరగడానికి కారణాలను ‘ఏష్లీ మాడిసన్’ వివరించలేదు.
Read Also- Priyanka Chopra: హాలీవుడ్‌లో ప్రియాంక సక్సెస్ అయ్యిందా? సమీక్ష ఇదిగో
మెట్రోపాలిటిన్ సిటీ అయిన ముంబై ఈ జాబితాలో టాప్-20లో కూడా లేదు. అయితే, గజియాబాద్, జైపూర్, రాయగఢ్, అసోంలోని కామరూప్, చండీగఢ్ వంటి ద్వితీయ స్థాయి నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత పరిధిలో మొత్తం 9 జిల్లాలు టాప్ 20లో నిలిచాయి. ఒక్క ఢిల్లీలోనే 6 జిల్లాలు ఉన్నాయి. సెంట్రల్, సౌత్ వెస్ట్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ వెస్ట్ ఢిల్లీలు ఈ జాబితాలో నిలిచాయి. గురుగ్రామ్, గాజియాబాద్, నోయిడా (గౌతమ్ బుద్ధ నగర్) కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
నాన్-మోనోగమీ పెరుగుతోందా?
ఏష్లీ మాడిసన్, యూగోవ్ సంస్థ కలిసి ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. భారత్, బ్రెజిల్ దేశాల్లో అత్యధిక వివాహితులు ‘అఫైర్లు’కు సుముఖంగా ఉన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న భారతీయ వివాహితుల్లో 53 శాతం మంది కనీసం ఒకరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఒప్పుకున్నారు. ఈ పరిణామంపై ఏష్లీ మాడిసన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక వివాహ బంధాల పునః నిర్వచనంలో భారత్ ముందంజలో ఉన్నట్టు డేటా ఆధారంగా భావిస్తున్నట్టు కీబుల్ చెప్పారు. భారతీయులు నాన్-మోనోగమీని అంగీకరించే దిశగా మారిపోతున్నారని, తమ ప్లాట్‌ఫామ్‌పై గోప్యంగా ఆ బంధాలను అన్వేషించుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తమకు టాప్-6 మార్కెటింగ్ దేశంగా భారత్ ఉందని, ఈ ఏడాది ముగిసేలోపు ఇంకా పురోగతి ఉంటుందని కీబుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also- F-35B Jet: కదిలిన యూకే యుద్ధ విమానం.. భారత్‌కు థ్యాంక్స్
పొరపాటు పడుతున్నారా?
కాగా, పెళ్లైనవారి డేటింగ్ విభాగంలో ‘ఏష్లీ మెడిసన్’ యాప్ ప్రపంచంలో నంబర్ 1 అని యాజమాన్యం ప్రచారం చేసుకుంటోంది. సైన్ ఇన్ చేస్తున్న వారి సంఖ్య ఇంత వేగంగా పెరుగుతుండడంపై పలువురు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ‘మ్యారీడ్ డేటింగ్ యాప్’ అని ప్రచారం చేస్తుండడంతో జనాలు ‘మ్యారేజ్ డేటింగ్ యాప్’ అని పొరపాటు పడుతున్నారేమోనని పలువురు పేర్కొంటున్నారు. పేర్ల స్పెల్లింగ్‌లో కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ అర్థం ఒకటేనని భావించే విధంగా స్పెల్లింగ్ కనిపిస్తోంది.