Pak on India: వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025) ట్రోఫీలో భాగంగా ఆదివారం (జూలై 20, 2025) పాక్ – భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్ట్ లో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. కీలక ఆటగాళ్లైన శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్‌లు తదితరులు పాక్ తో ఆడేందుకు నిరాకరించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ తో ఆడబోమని తెగేసి చెప్పారు. దీంతో భారత్ – పాక్ మ్యాచ్ రద్దయింది. దీనిపై తాజాగా స్పందించి పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. భారత్ తో అక్కసు వెళ్లగక్కాడు.
సల్మాన్ బట్ వార్నింగ్..
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ (Salman Bhatt).. టీమిండియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ తో ఆడకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం.. ఐసీసీ టోర్నమెంట్లలోనూ కొనసాగించాలని సూచించారు. వరల్డ్ కప్ లేదా ఆసియా కప్ లో పాక్ తో ఆడకూడదని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన యూట్యూబ్ లో ఛానల్ భట్ మాట్లాడుతూ ‘వరల్డ్ కప్ (World Cup) లో కూడా మాతో ఆడకండి. ఏ ఐసీసీ టోర్నమెంట్ లో ఆడమని హామీ ఇవ్వండి. మీరు ఈ జాతీయవాద ధోరణి కొనసాగిస్తే.. మేము దీన్ని మర్చిపోము. ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూనే ఉంటాం’ అంటూ భట్ చెప్పుకొచ్చారు. అటు పాక్ మాజీ పేసర్ అబ్దుల్ రవూఫ్ ఖాన్ (Abdur Rauf Khan) సైతం భారత ఆటగాళ్లపై విమర్శలు చేశారు. ‘ఆటగాళ్లు ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటారు. కలిసి తిని షాపింగ్ చేస్తారు. కానీ మ్యాచ్ ఆడాలంటే జాతీయవాదం గుర్తొస్తుందా?’ అని ప్రశ్నించారు.
Also Read: Nitish Reddy: సిరీస్ మధ్యలోనే నితీష్ కుమార్ రెడ్డి తిరుగుపయనం.. బీసీసీఐ కీలక ప్రకటన
నిర్వాహకుల స్పందన
భారత్ – పాక్ మ్యాచ్ రద్దుపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు స్పందించారు. ఇరు దేశాల అభిమానులకు సంతోషకరమైన క్షణాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మ్యాచ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే తమ నిర్ణయంతో భారత ఆటగాళ్లు, అభిమానుల భావోద్వేగాలు గాయపరిచినట్లు అంగీకరించారు. ‘మేము ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నాము. భావోద్వేగాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాము’ అని వారు తెలిపారు. మరోవైపు డబ్ల్యూసీఎల్ స్పాన్సర్ గా ఉన్న ఈజ్ మై ట్రిప్ (EaseMyTrip) భారత్ – పాక్ మ్యాచ్ స్పాన్సర్ షిప్ ను వదులుకుంది. ‘మేము డబ్ల్యూసీఎల్ తో ఐదేళ్ల కాలానికి స్పాన్సర్ షిప్ ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందంలో ఉన్నప్పటికీ పాక్ ఆడే ఏ మ్యాచ్ లోనూ పాల్గొనము. మేము భారత జట్టును సమర్థిస్తాము. భారతే మా తొలి ప్రాధాన్యం’ అని స్పష్టం చేశారు.