Kanwar Yatra: దేశంలో భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలో ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కసితో.. కొందరు స్త్రీలు విచక్షణా రహితంగా జీవిత భాగస్వామిని తుదిముట్టిస్తున్నారు. అలాంటి మహిళలకు చెంపపెట్టులాంటి ఘటన తాజాగా ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో చోటుచేసుకుంది. పక్షవాతానికి గురైన భర్తను భుజాన వేసుకొని.. ఓ భార్య ఏకంగా 150 కి.మీ కాలినడకన యాత్ర చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
యూపీలోని ముజాఫర్ నగర్ (Muzaffarnagar)కు చెందిన సచిన్ (Sachin), ఆశ (Asha) భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వతహాగా దేవుడి భక్తుడైన సచిన్.. గత 13 ఏళ్లుగా కన్వర్ లేదా కాంవడ్ యాత్రలో పాల్గొంటున్నాడు. అయితే గతేడాది వెన్నుపూసకు గాయం కావడంతో అతడు పక్షవాతానికి గురయ్యాడు. దీంతో ఈసారి కన్వర్ యాత్ర చేయలేకపోతున్నందుకు తెగ మదనపడ్డాడు. ఈ క్రమంలో భార్య ఆశ.. అతడికి అండగా నిలిచింది. పక్షవాతానికి గురైన భర్త చేత కన్వరి యాత్ర చేయిస్తానని హామీ ఇచ్చింది.
భర్త తిరిగి నడవాలని..
భర్తకు ఇచ్చిన మాట ప్రకారమే హరిద్వార్ నుంచి మోదీ నగర్ వరకూ 150 కిలోమీటర్ల మేర కాలినడకన భర్తను మోసుకెళ్లింది. తన భర్త సంకల్పాన్ని ఎలాగైన నెరవేర్చాలన్న దృఢ నిశ్చయంతో ఈ కఠిన యాత్రను ఆశ పూర్తి చేసింది. ఆశతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు సైతం ఈ యాత్రలో పాల్గొనడం గమనార్హం. తన భర్త తిరిగి మాములు మనిషి కావాలని ఈ యాత్ర ద్వారా ఆ పరమ శివుడ్ని వేడుకున్నట్లు ఆశ చెప్పింది. ఎలాగైన తన భర్తను మామూలు మనిషిని చేయాలని ప్రార్థించినట్లు పేర్కొంది.
నెటిజన్లు హర్షం
భర్తను వీపు మీద ఎక్కించుకొని భార్య ఆశ.. కన్వర్ యాత్ర చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భర్తను దారుణంగా హత్యలు చేస్తున్న ఈ రోజుల్లో.. నిజమైన భార్య ఎలా ఉండాలో ఆశ నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు. భర్త కోరిక తీర్చేందుకు ఆమె చేసిన ఈ యాత్ర ఎంతో స్ఫూర్తిదాయకమైనదని అంటున్నారు. ఆశ కోరిక నెరవేరి తిరిగి ఆమె భర్త ఒకప్పటిలా నడవాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు.
हरिद्वार में महिला ने पति को कंधों पर उठाकर भोलेनाथ के दर्शन किए सावन की आस्था में प्रेम और समर्पण का अनोखा संगम दिखा
वीडियो देख सोशल मीडिया पर यूजर्स भावुक होकर कर रहे सराहना #Haridwar | Sawan 2025 | #KawadYatra | @JhakkasKhabar | pic.twitter.com/VCp3KrBnaM— प्रतीक खरे/Pratik khare 😷 (@pratik_khare_) July 14, 2025
Also Read: Pawan Kalyan: రాజకీయంగా పేరున్నా.. ఆ హీరోల కంటే తక్కువే.. పవన్ షాకింగ్ కామెంట్స్!
కాంవడ్ యాత్ర అంటే ఏంటీ?
హిందూ మతంలో కాంవడ్ లేదా కన్వర్ యాత్రకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. శైవ భక్తులు శివుడిని పూజించేందుకు ఏటా ఈ యాత్ర చేస్తుంటారు. ఇది సాధారణంగా శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు.. హరిద్వార్, గంగోత్రి, గోముఖ్, సుల్తాన్‌పూర్ ప్రాంతాలలోని గంగానది నుంచి జలాన్ని కాంవడ్ (నీటి కుండ)లోకి సేకరిస్తారు. అలా సేకరించిన జలాన్ని ఓ కర్రకు కట్టి భుజంపై యాత్రగా మోసుకెళ్తారు. అలా కాలినడకన వెళ్లి నీలకంఠ్ మహాదేవ ఆలయం (హరిద్వార్ సమీపంలో), కాశీ విశ్వనాథ ఆలయం (వారణాసి), బైద్యనాథ్ ఆలయం (జార్ఖండ్) వంటి ప్రముఖ శివ ఆలయాలను సందర్శిస్తారు. కాంవడ్ లో సేకరించిన జలంతో శివుడికి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం ద్వారా తమ కోరికలను శివుడు నెరవేరుస్తాడని వారి విశ్వాసం.