Health News: బరువు తగ్గాలంటే జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తే సరిపోదు. ఆహారం విషయంలో (Health News) కూడా అప్రమత్తంగా ఉండాలని సంపన్న దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే స్పష్టమవుతోంది. అభివృద్ధి దేశాల్లో జనాలు ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ ఎక్కువ కేలరీలు కరిగిస్తున్నా బరువు పెరుగుతూనే ఉన్నారు. ఎక్కువ శారీరక శ్రమతో అధిక కేలరీలు కరిగిస్తున్నా ఎందుకు బరువు పెరుగున్నారు? అనే అంతుచిక్కని ప్రశ్నకు సమాధానం వ్యాయామంలో లేదని, తినే ఆహారంలో ఉండొచ్చని నూతన అధ్యయనం పేర్కొంది.
వ్యాయామం చేస్తూ బరువు తగ్గుతారానే అపోహపై డ్యూక్ యూనివర్శిటీ జరిపిన ఒక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. తిని, పని పాట లేకుండా కూర్చునే లేదా నిద్రిపోయేవారికి ఊబకాయం వస్తుందనే భావనను ఈ అధ్యయనం సవాలు చేసింది. ఈ అధ్యయనంలో భాగంగా టాంజానియాలో వేటాడి ఆటవిక తెగల నుంచి నార్వేలో ఆఫీస్ వర్కర్ల వరకు మొత్తం 34 దేశాలకు చెందిన 4,200 మందిని క్షుణ్ణంగా పరిశీలించారు. అధ్యయనకారులు గుర్తించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు మిగతా దేశాలవారికంటే ప్రతి రోజూ ఎక్కువ కేలరీలు కరిగిస్తున్నారు. అయినప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాల ప్రజల శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటోంది. ఈ మేరకు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్’ అనే జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైంది.
Read Also- Viral News: 9 నెలల్లో మృత్యువు.. విలువైన సలహాలు కోరిన యువతి
అధ్యయనంలో భాగంగా ‘డబ్లీ లేబుల్డ్ వాటర్’ అనే ఆధునిక విధానాన్ని ఉపయోగించి రోజువారీగా ఎంత శక్తి వినియోగిస్తున్నారో కచ్చితత్వంతో కొలిచారు. శరీర పరిమాణం పరంగా పరిగణనలోకి తీసుకున్నా కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు సగటున 6 శాతం అధికంగా కేలరీలు ఖర్చు చేస్తున్నట్టు స్పష్టమైంది.
అయినా బరువు ఎందుకు పెరుగుతున్నారు?
శరీరంలోని కేలరీలు అధికంగా కరిగిస్తున్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో జనాల బరువు ఎందుకు పెరుగుతోంది? అంటే, అసలు కారణం వారి శరీరంలో కదలికలు లేకపోవడం కాదని, తినే ఆహారమేనని అధ్యయనం పేర్కొంది. కొన్ని దేశాల జనాభా తింటున్న ఆహారానికి సంబంధించి సేకరించిన డేటా ఆధారంగా అధ్యయనకారులు ఈ అభిప్రాయానికి వచ్చారు. విటమిన్స్ లేని ప్యాకెట్ స్నాక్స్, తియ్యగా ఉంటే కూల్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ల శరీరంలో కొవ్వు అధికంగా ఉంటుందని అధ్యయనకారులు తేల్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తీసుకుంటున్న ఈ తరహా ఆహారం త్వరగా జీర్ణమవుతుందని, శరీరానికి అధిక శాతం కేలరీలు అందుతాయని పేర్కొంది. ఆకలిని నియంత్రించడంపై కూడా ఈ రకమైన ఆహార పదార్థాలు ప్రతికూల ప్రభావం చూపిస్తాయని, ఫలితంగా ఎక్కువ తినే అవకాశం ఉంటుందని పేర్కొంది. అందుకే, ఆయా దేశాల ప్రజల శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయి. అందుకే, లావైపోతున్నట్టు అధ్యయనం పేర్కొంది. కాబట్టి, ఊబకాయాన్ని తగ్గించాలంటే వ్యాయామం మాత్రమే సరిపోదని, మంచి ఆహారం కూడా ముఖ్యమేనని అధ్యయనం సూచించింది.
Read Also- Serial kisser: నా మూవీస్‌లో ముద్దులు అందుకే.. ఇమ్రాన్ హష్మి క్లారిటీ