Rahul Gandhi: భారత్- పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగిన సైనిక సంఘర్షణలో 5 విమానాలు కూల్చివేశారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు. “మోదీ గారూ, ఆ ఐదు విమానాలకు సంబంధించిన సత్యం ఏమిటి?. నిజం తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది!” అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తన ట్వీట్‌కు ట్రంప్ వ్యాఖ్యల వీడియోను కూడా జోడించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు ముందు డొనాల్డ్ ట్రంప్ మిస్సైల్ మరోసారి పేలిందని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ మాట చెప్పడం ఇప్పటికి 24వ సారి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో హౌడీ మోడీ, 2020లో నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాల ద్వారా డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన మోదీ, పార్లమెంట్ వేదికగా స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని జైరామ్ రమేష్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సెషన్ జులై 21 నుంచి మొదలవనున్న నేపథ్యంలో, ట్రంప్ వ్యాఖ్యల టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.
ట్రంప్ అసలు ఏమన్నారు?
కాగా, వైట్‌హౌస్‌లో శుక్రవారం రిపబ్లికన్ సెనేటర్లకు ఇచ్చిన విందు సమయంలో ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్–పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగిన సైనిక సంఘర్షణలో ఐదు విమానాలను కూల్చేశారని వ్యాఖ్యానించారు. విమానాలు గాల్లో ఉండగానే కూలిపోయాయన్నారు. ఊ.. నాలుగా లేకా?, ఐదా?… ఐదింటిని కూల్చివేశారనుకుంటా, ఘర్షణ మరింత ముదిరిపోతుందని అనిపించింది కదా? అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఏ దేశానికి సంబంధించిన విమానాలను కూల్చివేశారన్నది ఆయన పేర్కొనలేదు. భారత్, పాక్ రెండు దేశాలకూ జరిగిన నష్టాల గురించి మాట్లాడారా?, లేక వేరే ఉద్దేశంతో మాట్లాడారా? అనే విషయాన్ని ట్రంప్ వివరించలేదు.
Read Also- Tax Free: ఈ దేశాల్లో పన్నులు ఉండవు.. సంపాదనంతా వాడుకోవచ్చు
వాణిజ్య ఒప్పందంపై కూడా స్పందించిన ట్రంప్, భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను ఇలాగే కొనసాగిస్తే అమెరికా ఎలా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోదని ట్రంప్ పునరుద్ఘాటించారు. సైనిక సంఘర్షణ సమయంలో పరిస్థితి దిగజారుతున్నట్టే అనిపించిందని, అణుశక్తి సామర్థ్యం ఉన్న ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి మరింత ముదిరిపోతున్న సమయంలో వాణిజ్యం ద్వారా ఈ సమస్యను పరిష్కరించగలిగామని ట్రంప్ వ్యాఖ్యానించారు. మే 10న రాత్రి పొద్దుపోయాక భారత్–పాకిస్థాన్ మధ్య చర్చలు జరిగాయని, అమెరికా మధ్యవర్తిత్వం వహించడంతో రెండు దేశాలు వెంటనే విరమణ ఒప్పందానికి అంగీకరించాయంటూ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి ఆయన పదేపదే చెబుతూ వస్తున్నారు. అయితే, ట్రంప్ వాదనను భారత్ ఖండిస్తూ వస్తోంది. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఇరు దేశాల సైన్యాల డైరెక్టర్లు నేరుగా చర్చించుకున్న తర్వాతే విరమణ ఒప్పందం కుదిరిందని స్పష్టంగా ప్రకటించింది. ఇక, భారత్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ ప్రకటించింది. అయితే, ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇంతవరకు చూపించలేదు.
Read Also- Jasprit Bumrah: బుమ్రా స్థానంలో ఎవరు?.. తెరపైకి డెబ్యూట్ ప్లేయర్!