Asia Cup: పహల్గామ్ ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’ పరిణామాల తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈ ప్రభావంతో ఆసియా కప్ (Asia Cup) ప్రశ్నార్థకంగా మారింది. ఆసియా కప్ షెడ్యూల్ త్వరలోనే వెలువడాల్సి ఉండగా, ఈ నేపథ్యంలో జులై 24న బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక సమావేశం (AGM) జరగాల్సి ఉంది. అయితే, ఢాకా వేదికగా ఏసీసీ సమావేశాన్ని నిర్వహించొద్దంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అభ్యంతరం చెబుతోంది. సమావేశాన్ని ఢాకాలోనే నిర్వహిస్తే, ఆ భేటీలో తీసుకునే ఏ నిర్ణయాన్నీ బీసీసీఐ ఆమోదించదని ఒక అధికారి స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏసీసీ చీఫ్‌గా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్ నక్వీ… భారత్‌పై అనవసరంగా ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారని బీసీసీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సమావేశ వేదికను మార్చాలంటూ బీసీసీఐ విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నాయి. ‘‘ఏసీసీ సమావేశాన్ని ఢాకా నుంచి మార్చితే మాత్రమే ఆసియా కప్ జరగుతుంది. మొహ్సిన్ నక్వీ అనవసరంగా భారత్‌పై ఒత్తిడి తెస్తున్నారు. వేదిక మార్చాలని మేము కోరినా, ఇంకా ఎటువంటి స్పందన లేదు. ఢాకాలోనే భేటీ నిర్వహిస్తే ఏ నిర్ణయాన్నీ బీసీసీఐ అంగీకరించదు’’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వివరించారు.
Read Also- Viral News: మరిదితో వివాహేతర సంబంధం.. భర్తను ఎలా చంపారంటే?
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, ఢాకాలో జరిగే సమావేశంలో పాల్గొనేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆగస్టులో జరగాల్సిన భారత పర్యటనను భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు పరస్పరం ఈ మధ్యే రద్దు చేశాయి. ఈ షెడ్యూల్‌ను 2026 సెప్టెంబరుకు వాయిదా వేశారు.
6 జట్లతో ఆసియా కప్
ఈ ఏడాది నిర్వహించాల్సిన ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగాల్సి ఉంది. ఆరు జట్లు పాల్గొనాల్సి ఉంది. అయితే, టోర్నమెంట్‌పై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. భారత్ ఈ ఏడాది టోర్నమెంట్‌కు ఆతిథ్య దేశంగా ఉంది. అయితే, టోర్నీకి సంబంధించిన షెడ్యూల్, వేదికలు ఇంకా ఖరారు కాలేదు. అయితే, సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగవచ్చంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2023లో జరిగిన ఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. ఆ ఏడాది పాకిస్థాన్ వేదికగా టోర్నీ జరగాల్సి ఉండగా, అక్కడికి వెళ్లి ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో, భారత్ మ్యాచ్‌లన్నింటినీ పాకిస్థాన్‌లో నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వగా, భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరిగాయి.
Read Also- Azharuddin: అజారుద్దీన్ ఇంట్లో దొంగలుపడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారంటే?
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్ ఈ ఏడాది జరిగే ఆసియా కప్, ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో పాల్గొనబోదంటూ మే నెలలో జోరుగా కథనాలు వెలువడ్డాయి. భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలే ఇందుకు కారణమని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ కథనాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. ఆసియా కప్ నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకోలేదని, అలాంటి చర్చలు కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన కథనాలన్నీ ఊహాజనితమైనవేనని, అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు.