Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీలో (YSR Congress) టెన్షన్ మొదలైంది. ఈ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి శనివారం సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. విచారణ తర్వాత ఇవాళ సాయంత్రం ఆయన్ను పోలీసులు అదుపులోనికి తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చే మార్గాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఇప్పటికే ఏపీ హైకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో మిథున్‌రెడ్డి అరెస్ట్‌కు పోలీసులకు లైన్ క్లియర్ అయ్యింది. మరోవైపు సిట్ ఆఫీసు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం, వాహనాల రాకపోకలను పూర్తిగా పోలీసులు నియంత్రిస్తుండటంతో కీలక పరిణామం చోటుచేసుకుంటుందని వైసీపీ కూడా ఓ అంచనాకు వచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మిథున్ రెడ్డికి అరెస్ట్ వారంట్ జారీచేయడానికి సిట్ అధికారులు శుక్రవారమే ఏసీబీ కోర్టులో మెమో జారీ చేశారు. మెమో రిటర్న్ కూడా న్యాయాధికారి ఆగమేఘాలపై సమర్పించడంతో ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లుగానే అనిపిస్తోందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కాగా, మిథున్ రెడ్డి.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. పార్టీలోనూ కీలక నేత.
Read Also- Mohan Lal: చేతికి గాజులు.. మెడలో ఆడవారి హారం.. మోహన్‌లాల్‌కు ఏమైంది!
ఆధారాలు చూపించండి..
సిట్ విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన మిథున్ రెడ్డి.. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఒత్తిడితోనే తనపై కేసు పెట్టారని.. మద్యం కేసులో తన పాత్రపై ఆధారాలు ఉంటే చూపించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ‘ వైసీపీలో ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్‌గా కేసులు పెడుతున్నారు. ఇదే సమయంలో సిట్ విచారణకు నేను హాజరు అవుతున్నాను. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవు. కేసులకు భయపడే ప్రసక్తి లేదు. భయపడే వ్యక్తినే అయితే రాజకీయాల్లోనే ఉండను.. ఉండలేను. వీటన్నింటిని ధైర్యంగానే ఎదుర్కొంటాను. ఈ కేసుల నుంచి తప్పకుండా నేను బయటపడతాను. నా పాత్రపై ఆధారాలు ఉంటే చూపించండి. నా ఫోన్లు కూడా మీకిచ్చేస్తా. దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తాను. సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు. ముందుగానే ఒక వ్యక్తిని జైల్లో వేయాలని నిర్ణయించుకుని ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుతున్నారు’ అని మిథున్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also- Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అసలు టార్గెట్ వేరు..!
‘ తమకు అనుకూలంగా ఉన్న వారిని నయానో, భయానో ఒప్పించి మరీ స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు. నోటి మాటలతో ఇచ్చిన స్టేట్మెంట్లతో కేసు నడుపుతున్నారు. ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్. మద్యం కేసు వారి టార్గెట్ ఏమాత్రం కాదు. తమకు నచ్చని వారిని వేధించేందుకు రకరకాల కథలు అల్లుతున్నారు. ఇలాంటి కేసులు కొత్తేమీ కాదు. 2014-19 టీడీపీ (TDP) హయాంలోనూ నాపై తప్పుడు కేసులు పెట్టారు. నేనే ఏదో దాడి చేశానని, నాడు టీడీపీ హయాంలో కేసు పెట్టారు. నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినకుండా జైల్లో పెట్టారు. అప్పుడు తప్పుడు సాక్షాలు చెప్పిన వారంతా మళ్లీ కోర్టుకు వచ్చి అదంతా తప్పని చెప్పారు. దాంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే తరహాలో అరెస్టు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎవరినైనా అరెస్టు చేయాలనుకుంటే ముందుగా ఎల్లో మీడియాలో మాస్టర్ మైండ్ అని కట్టుకథలు అల్లుతున్నారు. గతంలో ఇతరులను మాస్టర్ మైండ్ అన్నారు.. ఇప్పుడు నన్ను మాస్టర్ మైండ్ అంటున్నారు. ఏదో రకంగా మాపై బురద జల్లాలనే చూస్తున్నారు. కొద్దిమంది అధికారులను తీసుకొచ్చి భయపెట్టి.. ఒప్పుకోకపోతే జైల్లో పెడతామని స్టేట్మెంట్లు తీసుకున్నారు. మేం ఎక్కడ కలిశామో ఆధారాలు చూపండి. నోటి మాటతో కేసు పెడతారా? అధికారులను బెదిరించి మాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు తీసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇదే అధికారులను బెదిరించి చెప్పించారని కోర్టులో చెబుతారు.. చివరికి కేసు కొట్టివేస్తారు. గతంలో కూడా ఇలాగే నాపై తప్పుడు కేసు పెడితే కోర్టు కొట్టేసింది. ఈ కేసులో రేపు జరగబోయేది కూడా ఇదే’ అని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also-Azharuddin: అజారుద్దీన్ ఇంట్లో దొంగలుపడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారంటే?