Donald Trump: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన సైనిక సంఘర్షణలో ఐదు యుద్ధ విమానాలు కూల్చివేతకు గురయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జులై 18) ఓ ప్రైవేట్ విందులో ఆయన ఈ మాటలు మాట్లాడారు. వైట్ హౌస్‌లో రిపబ్లికన్ నేతలతో జరిగిన రాత్రి భోజన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. “విమానాలు గాల్లో ఉండగానే కూల్చివేసిన విషయం వాస్తవం. ఊ.. నాలుగా లేదా ఐదా, నిజానికి ఐదు విమానాలను కూల్చివేశారు” అని ట్రంప్ అన్నారు. అయితే, ఏ దేశానికి చెందిన విమానాలు కూల్చవేతకు గురయ్యాయన్నది ఆయన పేర్కొనలేదు. ఏ దేశానికి చెందిన విమానాలు అనే మాట చెప్పకపోయినప్పటికీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక సంఘర్షణ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
భారత్ విమానాలు కూల్చామంటున్న పాక్
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న రాత్రి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ సైనిక దాడులు ప్రారంభించింది. ఆ తర్వాత పాకిస్థాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగడంతో 4 రోజుల పాటు జరిగిన సైనిక సంఘర్షణ కొనసాగింది. ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన రాఫెల్ యుద్ధవిమానాలను కూల్చామని పాకిస్థాన్ పదేపదే చెబుతోంది. ముగ్గురు పైలట్లను కూడా పట్టుకున్నామని అంటోంది. అయితే, ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను పాకిస్థాన్ ఇంతవరకు చూపించలేదు. తాము రాఫెల్ యుద్ధవిమానాలను కోల్పోలేదని, ఏ భారత పైలట్ కూడా పాక్ చేతికి చిక్కలేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, భారత్ కూడా వాయుసేనకు జరిగిన నష్టాల వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. మే 11న ఎయిర్ మార్షల్ ఏకే భారతి మీడియాతో మాట్లాడుతూ, భారత పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని స్పష్టం చేశారు.
Read Also- Viral News: గూగుల్, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..లివ్-ఇన్ పార్టనర్‌పై..
మే నెలలో సింగపూర్‌లో జరిగిన శాంగ్రి-లా డైలాగ్ కార్యక్రమంలో భారత రక్షణ సిబ్బంది చీఫ్, జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, ‘‘విమానాలను కోల్పోయిన విషయం నిజమే. అయితే, వాటిని ఎందుకు కోల్పోయామన్నది ముఖ్యం’’ అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో 300 కిలోమీటర్ల లోపల ఉన్న పాక్ ఎయిర్‌ఫీల్డ్స్‌పై అత్యంత కచ్చితత్వంతో వ్యూహాత్మకంగా ఎలా దాడులు నిర్వహించామన్నది కీలకమని అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ అత్యంత సమర్థవంతంగా దాడులు చేశామని ఆయన పేర్కొన్నారు.
Read Also- US Visa: యూఎస్ వీసా వచ్చేదెట్టా?.. ఆందోళనలో భారతీయ విద్యార్థులు
రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసిన దసాల్డ్ ఏవియేషన్ చైర్మన్, సీఈవో ఎరిక్ ట్రాపియర్ జూన్ 15న మాట్లాడుతూ, రాఫెల్ విమానాలను కూల్చమని పాక్ చెబుతున్న కథల్లో నిజంలేదని పేర్కొన్నారు. పాక్ చేస్తున్న ప్రకటనలు తప్పు అని, నిజాలు బయటకు వచ్చినప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుందని ఓ ఫ్రెంచ్ మేగజైన్‌కి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10న మాట్లాడుతూ, భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని తానే ఆపానని అన్నారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయని, ఇదంతా తనవల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను భారత్ ఇప్పటికే ఖండించింది. భారత్-పాక్ ఇరు దేశాలూ స్వతంత్రంగా సమస్యను పరిష్కరించుకున్నాయని, అమెరికా ప్రమేయంతో జరిగిందన్న వాదనలో నిజంలేదని పేర్కొంది.