US Visa: వీసా నిబంధనలను (US Visa) కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశంలో ఉన్నత విద్య అభ్యసించాలని కలలు విద్యార్థులకు అవరోధాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా అమెరికా యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఏకంగా 70 శాతం మేర పతనమైందని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. వీసా అపాయింట్‌మెంట్ స్లాట్లు విడుదల కాకపోవడం, వీసా తిరస్కరణ రేటు గణనీయంగా పెరిగిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని వెల్లడించాయి. ఈ పాటికే చాలామంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, అమెరికా బయలుదేరేందుకు సిద్ధమవ్వాల్సిన సమయం ఇదని, కానీ, ఇప్పటికీ ప్రతిరోజూ వెబ్‌సైట్ ఓపెన్ చేసి స్లాట్లు ఓపెన్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హైదరాబాద్‌కు చెందిన ఓవర్సీస్ కన్సల్టెంట్ సంజీవ్ రాయ్ చెప్పారు. గత కొన్నేళ్ల కాలంలో ఇదే అత్యంత చెత్త పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు.
విండో ఓవర్సీస్ కన్సల్టెన్సీకి చెందిన అంకిత్ జైన్ మాట్లాడుతూ, అమెరికా అధికారులు వీసా స్లాట్‌లను విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పినా, స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. స్లాట్ బుక్ అయినా కన్ఫర్మేషన్ రావడం లేదని, బహుశా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రక్రియను టెస్టింగ్ చేస్తున్నారమోనన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాయానంలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా విద్యార్థులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారని అంకిత్ జైన్ చెప్పారు. ఈ పరిస్థితిపై 23 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థి స్పందిస్తూ, ఒక సంవత్సరం వృథాగా పోతుందేమో అనిపించి, తాను యూఎస్ వీసా అప్లికేషన్‌ను వెనక్కి తీసుకున్నట్టు చెప్పాడు. జర్మనీలో ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
ఆలస్యమైతే.. కలలు కల్లలు
యూఎస్ వీసా మరింత ఆలస్యమైతే వేలాది మంది విద్యార్థుల కలలు చెదిరిపోతాయని ‘ఐ20 ఫీవర్ కన్సల్టెన్సీ’కి చెందిన అర్వింద్ మండువా వ్యాఖ్యానించారు. యూఎస్ వర్సిటీల్లో విద్యార్థుల సంఖ్య ఇప్పటికే 80 శాతం వరకు తగ్గిపోయిందని, ప్రతిరోజూ స్టూడెంట్స్, వారి తల్లిదండ్రుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన పరిస్థితిని వివరించారు. మార్చిలోనే దరఖాస్తులు చేసిన విద్యార్థులకు కూడా వీసాలు ఎక్కువగా తిరస్కరణకు గురయ్యాయని, సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివ్ రికార్డులు లేకపోయినా, వీసా తిరస్కరణకు గురైన విద్యార్థులు ఉన్నారని అర్వింద్ మండువా పేర్కొన్నారు.
Read more- Masood Azhar: పీవోకేలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్.. పసిగట్టిన ఇంటలిజెన్స్
214బీ సెక్షన్ చూపించి తిరస్కరణ..
దరఖాస్తు చేసుకున్న దాదాపు అందరికీ 214బీ సెక్షన్‌ను చూపించి వీసా తిరస్కరిస్తున్నారని అంకిత్ జైన్ వెల్లడించారు. అమెరికా వీసా తిరస్కరణకు సాధారణంగా చూపించే కారణం ఈ సెక్షన్ అని, అభ్యర్థి తన దేశానికి తిరిగివచ్చే ఉద్దేశంతో వీసా కోసం దరఖాస్తు చేస్తున్నట్టు నమ్మదగిన ఆధారాలు చూపించలేకపోతే ఈ సెక్షన్ ద్వారా వీసాను తిరస్కరిస్తారని వివరించారు. వీసా తిరస్కరణ వ్యవహారంపై డలాస్‌లోని యూఎస్ అడ్మిషన్ అనే కన్సల్టెన్సీకి చెందిన రవి లోతుమల్లా స్పందిస్తూ, ఈ విధంగా జరగడం కొత్త ప్రక్రియ కాదని, చాలా కాలంగా ఉన్న నిబంధనలనే ప్రస్తుతం కఠినంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఇదిలావుంచితే, వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌లు తిరిగి ప్రారంభమయ్యాయని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తుదారులు ముందుగా అప్లికేషన్ పెట్టుకొని, ఇంటర్వ్యూకు సమయం ఉండేలా ముందే సిద్ధంగా ఉండాలని, అభ్యర్థులు తమ నైపుణ్యాలను నిరూపించుకోవాలని కాన్సులేట్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
Read Also- Dukes Ball: శుభ్‌మన్ గిల్ అభ్యంతరం.. స్పందించిన డ్యూక్స్ బాల్ కంపెనీ
కాగా, భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గతేడాది నుంచి అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 3.3 లక్షలు మించిపోయింది. 2024 జనవరి 1 నాటికి 11.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకుంటున్నారు. యూరప్ వైపు మొగ్గు చూపుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.