ULI: ప్రస్తుతం లోన్ మంజూరు చేయాలంటే సిబల్ స్కోర్ చాలా చాలా ముఖ్యం. అయితే, చాలాకాలంగా కొనసాగుతున్న ఈ విధానం స్థానంలో, త్వరలోనే కొత్త రకమైన రుణ అనుమతి విధానం అమలులోకి రాబోతోంది. సిబిల్ వంటి క్రెడిట్ స్కోర్లపై ఆధారపడే విధానానికి బదులుగా, ‘యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్” (ULI) అనే కొత్త డిజిటల్ విధానాన్ని తీసుకురావడంపై ఆర్థిక శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (DFS) పనిచేస్తోంది. ప్రస్తుతం రుణ జారీ విషయంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలన్నీ దరఖాస్తుదారుల క్రెడిట్ హిస్టరీని ట్రాక్ చేస్తున్నాయి. సీబీల్ స్కోర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. యూఎల్ఐ ప్రక్రియ ద్వారా మరింత సులభతరంగా, విస్తృతంగా రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ఉంది.
యూఎల్ఐ ఎలా పనిచేస్తుంది?
యూఎల్ఐ (Unified Lending Interface) అనేది ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డేటాను బ్యాంకులకు సురక్షితంగా అందించి, రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడం, పారదర్శకంగా నిర్వహించే ప్రక్రియను సరళతరంగా మార్చుతుంది. సాఫీగా రుణ మంజూరుకు ఈ విధానం తోడ్పడుతుంది. దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తవుతుంది. రుణ అనుమతికి అవసరమైన డేటా ప్రభుత్వ శాఖల నుంచి షేర్ అవుతుంది. అంతేకాదు, డేటా వ్యవస్థల మధ్య అనుసంధానం సులభంగా మారుతుంది. దరఖాస్తుదారులకు సంబంధించిన వివిధ డేటా ఆధారంగా అర్హతను పరిశీలిస్తారు. అంటే, విద్యుత్ బిల్లు, జీఎస్టీ రికార్డులు వంటి వాటి ఆధారంగా రుణం చెల్లించగలడా లేదా అంచనా వేస్తారు.
Read Also- US Visa: యూఎస్ వీసా వచ్చేదెట్టా?.. ఆందోళనలో భారతీయ విద్యార్థులు
ఉపయోగాలేంటి?
యూఎల్ఐ విధానం అందుబాటులోకి వస్తే, గ్రామీణ ప్రజానీకం, చిన్న వ్యాపారాలు వంటి ఆర్థిక పరంగా వెనుకబడినవారు కూడా రుణాలు తీసుకోవడానికి అర్హులు అవుతారు. పారదర్శకత పెరుగుతుంది. మోసాలు, రుణ జారీలో ఆలస్యాలు తగ్గుతాయి. లోన్ తీసుకునేందుకు అయ్యే ఖర్చులక కూడా గణనీయంగా తగ్గుతాయి. డాక్యుమెంట్స్ తగ్గి, డిజిటల్ ప్రక్రియలు వేగవంతమవుతాయి. సకాలంలో రుణం అందడానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. ఎంఎస్ఎంఈలు, రైతులు త్వరగా అవసరమైన రుణాలు పొందగలుగుతారు.
Read Also- Masood Azhar: పీవోకేలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్.. పసిగట్టిన ఇంటలిజెన్స్
ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (DFS) కార్యదర్శి ఎం. నాగరాజు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలతో జూన్ 23న సమావేశమై యూఎల్ఐపై చర్చించారు. కొన్ని బ్యాంకులు ఇప్పటికే యూఎల్ఐని అమలు చేస్తుండగా, ఈ విధానంలో ఇంకా చేరని బ్యాంకులకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా యూఎల్ఐ విధానం అమల్లోకి వస్తే రుణ జారీ వ్యవస్థలో పెద్ద మార్పు సంభవించే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ వంటి ప్రమాణాలకు బదులుగా, సులభమైన మార్గం అందరికీ అందుబాటులోకి వస్తుంది.