Viral Video: సాధారణంగా పాములంటే నూటికి 99 శాతం మంది ప్రజలు భయపడతారు. అవి కనిపిస్తే ఆమడ దూరం పరిగెడతారు. ఎక్కడ కాటు వేస్తాయోనని గజ గజ వణికిపోతారు. అటువంటిది ఓ ఊరి ప్రజలు మాత్రం.. పాములను పట్టుకొని ఊరేగింపుగా తిరిగారు. విష సర్పాలను చేతుల్లోకి తీసుకొని రోడ్లపై సంచరించారు. శివుడి తరహాలో మెడకు చుట్టుకొని గుంపులు గుంపులుగా రోడ్లపైకి తిరిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఏ ప్రాంతంలో అంటే!
భారతీయ సనాతన ధర్మంలో పాములకు సైతం ప్రత్యేక స్థానం ఉంది. హిందువులు వాటిని దేవుళ్లుగా పూజిస్తారు. ఇందులో భాగంగా ఏటా నాగ పంచమీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున పుట్ట వద్దకు వెళ్లి.. పాములకు పాలు, గుడ్లు సమర్పిస్తారు. అయితే బిహార్ లోని సమస్తీపూర్ జిల్లా సింఘియా ఘాట్ ప్రాంత ప్రజలు.. నాగుల పంచమి పండుగను వినూత్న రీతిలో జరుపుకున్నారు. విషసర్పాలను మెడలో చేతుల్లో, తలపై ధరించి ఊరేగింపుగా తిరుగుతున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ దృశ్యాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
నదిలో సర్పాలను ముంచి
సింఘియా ఘాట్ ప్రాంతంలోని మా భగవతి ఆలయంలో ఈ పాముల మేళాను నిర్వహించారు. స్థానిక నాగ దేవత మాతా విషహరికి పాముల మేళా అంకింత చేయబడుతుంది. తమ వెంట పాములను తీసుకొచ్చిన భక్తులు.. వాటిని బుర్హి గండక్ నది తీరానికి తీసుకెళ్తారు. అక్కడ పాములను నదిలోకి వదిలి.. తిరిగి వాటిని చేతులు, నోటితో తీసుకుంటారు. అలా పాములను నదిలో ముంచి తీస్తే.. తమకు మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఈ ప్రక్రియ అనంతరం ఆయా పాములను.. సురక్షితంగా అడవుల్లో విడిచిపెడతారు.
Also Read: Cyber Fraud: ప్రతీ 20 నిమిషాలకో సైబర్ క్రైమ్.. రూ.700 కోట్లు స్వాహా.. జాగ్రత్త భయ్యా!
300 ఏళ్ల చరిత్ర
స్థానికుల ప్రకారం.. పాముల మేళా నిర్వహణ 300 సంవత్సరాల నాటి సంప్రదాయం. ఇది మిథిలా ప్రాంత సంస్కృతితో లోతుగా ముడిపడి ఉంది. ఖగారియా, సహర్సా, బెగుసరాయ్, ముజఫర్‌పూర్ వంటి జిల్లాల నుండి వేలాది మంది భక్తులు ఈ మేళాకు హాజరవుతారు. ఈ మేళాలో పాల్గొనడం వల్ల సర్ప దోషం, కుటుంబ సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. సర్పాలను ఊరేగించడం ద్వారా వాటి పట్ల గౌరవాన్ని చాటుకున్నట్లు భక్తులు భావిస్తారు. అయితే అన్ని పాములను ఊరేగించినప్పటికీ ఒక్కటి కూడా భక్తులను కాటు వేయకపోవడం విశేషం.
Hindus celebrate ancient snake festival ‘Nag Panchami’ in India’s Biharhttps://t.co/6sYYoIGahj
🎥: Sandeep Kumar pic.twitter.com/N5pLQQB01z
— Anadolu Images (@anadoluimages) July 16, 2025