TDP Vs YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా నాయకులపై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇది రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని దిగజారుస్తుందని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని అటు తెలుగుదేశం.. ఇటు వైసీపీ పార్టీల నేతల ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో, నాయకుల మధ్య వ్యక్తిగత దూషణలు అమాంతం పెరిగిపోతున్నాయి. అసలు తామేం మాట్లాడుతున్నామో సోయి లేకుండా ఆడవారిపై మాట్లాడుతుంటే అస్సలు వీళ్లు ఎలా లీడర్లు అయ్యారబ్బా? అనే సందేహాలు రాక మానదు. నిన్నగాక మొన్న టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణాతి దారుణం. నిన్నటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక బర్నింగ్ టాపిక్ అయ్యింది. ఆఖరికి ఏపీ హైకోర్టు కూడా సీరియస్ అయ్యి నల్లపురెడ్డికి అక్షింతలు ఇచ్చింది. ఈ వ్యవహారం మరిచిపోక మునుపే మాజీ మంత్రి రోజా సెల్వమణిపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అంతకుమునుపు రోజా ఏమన్నారు? ఈ ఇద్దరి మధ్య రచ్చ ఎక్కడ మొదలైంది? అనే విషయాలు తెలుసుకుందాం..
Read Also- Ramayana: సీతగా సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో తెలుసా?
గాలి అన్నదేంటి?
ఇటీవల రోజా వర్సెస్ గాలిగా పరిస్థితులు నెలకొనగా భాను ప్రకాష్ ఈసారి తీవ్రంగా స్పందించారు. ‘ రోజా 2 వేలు ఇస్తే ఏ పనైనా చేసేది. ఆమె వ్యాంప్ డాన్సర్‌కి ఎక్కువ.. హీరోయిన్‌కి తక్కువ. రోజా, ఆమె సోదరులు బియ్యం, ఇసుక డైవర్షన్‌లో పాల్గొన్నారు. నువ్వు రూ.12వేలు అద్దె ఇంట్లో ఉండి.. ఇప్పుడు చెన్నై, హైదరాబాద్, నగరిలో ఇళ్లు కొన్నావు. నీ చీప్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రజలకు తెలుసు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా తనకు కౌంటర్ ఇచ్చిన తర్వాత మళ్లీ స్పందించిన భాను కనీసం పశ్చాత్తాపపడకపోవడం గమనార్హం. అంతేకాదు తిరిగి రోజాకు సవాల్ విసిరారు. ‘ రోజాకు నీకు దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చెయ్యగలవా? టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్న సరే. గత ఐదేళ్ళుగా ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో రోజా, ఆమె అన్నదమ్ములకు, ఆమె అనుచరులకు సంబంధం లేదని చెప్పగలరా? ప్రమాణం చేయాగలరా? నేను ప్రమాణం చేయడానికి సిద్ధం.. నువ్వు సిద్ధమా..? దోంగే.. దోంగ అన్నట్లుగా రోజా మాటలు ఉన్నాయి’ అని రోజాపై భానుప్రకాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రోజా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, ఆమె సినీ నేపథ్యాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకూ నల్లపురెడ్డి ఎపిసోడ్ నడవగా ఇప్పుడు అది పూర్తిగా సైడ్ అయ్యి.. గాలి తెరపైకి వచ్చేశారు. ఒక మహిళను పట్టుకుని దారుణాతి దారుణంగా మాట్లాడిన భానుప్రకాష్ తక్షణమే రోజాకు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ వైసీపీ నుంచి పెరిగిపోయింది. అంతేకాదు.. భాను ప్రకాష్‌ను వెంటనే అరెస్టు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
రోజా ఏమన్నారు?
గాలి కుటుంబానికి రోజాకు అస్సలు పడదనే విషయం జగమెరిగిన సత్యమే. వీళ్లిద్దరూ టీడీపీ ఉన్నప్పటి నుంచీ నేటి వరకూ బద్ధశత్రువులుగానే ఉంటున్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన గాలి భాను ప్రకాష్.. 2024 ఎన్నికల్లో రోజాపైన 45,004 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో భాను తప్పులు ఏమున్నాయా..? ఎప్పుడెప్పుడు దొరుకుతారా? అని రోజా వేచి చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి తెచ్చారు రోజా. ఈ క్రమంలోనే భానుప్రకాష్.. రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటిని సువర్ణావకాశంగా మలుచుకున్న రోజా.. ‘ గాలిలో గెలిచిన గాలిగాడు ఎమ్మెల్యే భాను ప్రకాష్. ఆయన కౌన్సిలర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. నగరి నియోజకవర్గాన్ని అక్రమ మైనింగ్, గంజాయికి అడ్డగా మారింది. నువ్వు అన్ని అక్రమాలను అక్షరాలా బయటకు తీస్తా. నీ అవినీతి బయటకు కక్కిస్తా. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కటీ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికి వచ్చి తమిళనాడుకు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంవత్సర కాలంగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇదిగోండి ఆధారాలు’ అంటూ రోజా కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు రోజా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.
ఎటు పోతున్నాం..?
రాజకీయాల్లో సిద్ధాంతాలు, విధానాలపై చర్చ జరగాలి కానీ, ఇలాంటి వ్యక్తిగత దూషణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఒక మహిళా నాయకురాలిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడం ఏ మాత్రం సమంజసం కాదు.. సభ్య సమాజం అస్సలు అంగీకరించదు కూడా. స్త్రీ లేకపోతే సృష్టి లేదు అలాంటి మహిళలను ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదులే కానీ ఎవ్వరైనా ఒక్కటే. మహిళపై ఇలా ఏ పార్టీకి చెందిన వారు కామెంట్స్ చేసినా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా సరే, ముందుగా ‘స్త్రీ’ ని గౌరవించండి. ఎందుకంటే.. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో విలువలను దిగజారుస్తాయని.. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలను నిరుత్సాహపరుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఆరోగ్యకరమైన చర్చకు బదులు వ్యక్తిగత దాడికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పార్టీ అధిష్టానాలు తమ నాయకుల ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాయకులు తమ స్థాయిని, పదవిని గుర్తుంచుకుని మాట్లాడాలి. ప్రజలు, పౌర సమాజం ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. రాష్ట్ర రాజకీయాల్లో మహిళలపై జరుగుతున్న ఈ రకమైన వ్యక్తిగత దూషణలు తక్షణమే ఆగిపోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు విధానాలు, అభివృద్ధిపై దృష్టి సారించాలి తప్ప, వ్యక్తిగత నిందలు, అగౌరవంపై కాదు.
Read Also- Goshamahal: గోషామహల్‌లో రాజాసింగ్ వర్సెస్ మాధవీలత.. ఎవ్వరూ తగ్గట్లేదుగా!