Goshamahal: గోషామహల్‌లో మళ్లీ కొత్త గోల మొదలైంది. మొన్నటి వరకు రాజాసింగ్ ఇష్యూ సంచలనం సృష్టించగా.. తాజాగా బీజేపీ నేత, గత ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎంటర్ అయ్యారు. రాజాసింగ్‌పై ఘాటు విమర్శలు చేస్తూ సంచలనానికి దిగారు. దీంతో ఇష్యూ కాస్త రాజాసింగ్ వర్సెస్ మాధవీలత అన్నట్లుగా మారింది. తెలంగాణ బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేయడం, జాతీయ నాయత్వం సైతం ఆమోదం తెలపడంతో ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న మాధవీలత ఒక్కసారిగా సీన్‌లోకి ఎంటరయ్యారు. రాజాసింగ్ అలా వెళ్లారో లేదో.. గోషామహల్ అసెంబ్లీ స్థానానికి తనకు లైన్ క్లియర్ అయిందనే భావనలో మాధవీలత ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఆస్థానం తనదే అనే ధోరణిలో ఆమె వ్యవహరిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె రాజాసింగ్‌పై విమర్శలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ అనుచరులు సైతం ప్రతివిమర్శలు షురూ చేశారు.
Read Also- Panchayat Elections: తెలంగాణ పల్లెల్లో ఆశావాహుల కోలాహలం.. అధినేతలు, గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు!
కొరకరాని కొయ్యగా..!
గోషామహల్ పేరు చెబితేనే పార్టీలో కొందరు లీడర్లకు ఒకింత భయం.., ఒకింత అసహనం వ్యక్తమయ్యేది. ఎందుకంటు రాజాసింగ్ పార్టీలో ఉంటూనే తమ నేతలకే కొరకరాని కొయ్యగా మారారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల సమయంలో తాను పోటీ చేస్తానని చెప్పినా తనను బలపనిచేవారిని బెదిరించారనే కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టంచేశారు. దీంతో పార్టీ సైతం పది రోజుల్లోనే ఆమోదం తెలిపింది. దీంతో అప్పటి వరకు సీన్ లో లేని మాధవీలత ఒక్కసారి సీన్ లోకి ఎంటరైంది. ఎప్పుడో పార్లమెంట్ ఎన్నికల సమయంలో యాక్టివ్ గా ఉన్న ఆమె.. తిరిగి రాజాసింగ్ ఇష్యూ అనంతరం మళ్లీ తెరపైకి వచ్చింది. మధ్యలో అడపాదడపా ఒకట్రెండు కార్యక్రమాలకు అలా వచ్చి.. ఇలా వెళ్లింది. అయితే రాజాసింగ్ రాజీనామాతో ఆయన రాజకీయ భవితవ్యం సందిగ్ధంలో పడింది. తెలంగాణ పాలిటిక్స్ లో ఉంటారో? లేదో కూడా తెలియని పరిస్థితి. దీన్నే మాధవీలత అడ్వాంటేజీగా తీసుకుంటోందని తెలుస్తోంది. అందుకే గోషామహల్ అసెంబ్లీ స్థానంపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also- Vijay Devarakonda: తీవ్రమైన అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో చేరిన విజయ్ దేవరకొండ..
ఎప్పుడేం జరుగునో?
తెలంగాణలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని మాధవీలతకు పార్టీ కేటాయించింది. కాగా, అప్పట్లో కూడా రాజాసింగ్ ఘాటు విమర్శలు చేశారు. పోటీకి మగాడు దొరకలేదా? అంటూ పార్టీపైనే విమర్శలకు దిగారు. తమ అసెంబ్లీ ఆ పార్లమెంట్ పరిధిలోకే వస్తుందని, కనీసం తమ అభిప్రాయమేంటో తెలుసుకోకుండా ఎలా కేటాయిస్తారని పార్టీని ప్రశ్నించారు. అయితే అప్పుడు సైలెంట్‌గా ఉన్న మాధవీలత.. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాతో ఆయనపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ఒక మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగునా? అంటూ తూర్పారపట్టారు. పార్టీనే విమర్శిస్తారా? అంటూ చురకలంటించారు. అయితే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న మాధవీ.. రాజా రాజీనామాతో ఒక్కసారి తెరపైకి రావడం, కరుడుగట్టిన హిందుత్వవాది అయిన రాజాసింగ్‌పైనే విమర్శలు చేయడాన్ని ఆయన అనుచరులు, స్థానిక కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె చేసిన విమర్శలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు. ఈ విషయంలో మాధవీలతను ఏమాత్రం లెక్కచేయకపోగా రాజీనామా చేసినా కూడా రాజాసింగ్‌కే మద్దతు తెలపడం గమనార్హం. ఈ ఇష్యూకు ఎప్పుడు తెరపడుతుందో ఏంటో చూడాలి మరి.
Read Also- Chiranjeevi: హైకోర్టు కీలక ఆదేశాలు.. చిరంజీవి ఫుల్ హ్యాపీ!