Air India Crash: గత నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఘోర ప్రమాదానికి (Air India Crash) గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు వెలుగులోకి రాగా, తాజాగా అమెరికన్ మీడియా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో సంచలన కథనం ప్రచురితమైంది. విమానం కూలడానికి ముందు ఇద్దరు పైలట్లు మధ్య జరిగిన చివరి సంభాషణ (కాక్‌పిట్ రికార్డింగ్) ఆధారంగా, కెప్టెన్ స్వయంగా ఇంజిన్‌కు ఇంధనాన్ని నిలిపివేసినట్టుగా పేర్కొంది. విమానం గాల్లో ఉండగానే ఫ్యూయల్ స్విచ్‌లను ఎందుకు ‘కట్ ఆఫ్’ మోడ్‌లో పెట్టారంటూ కెప్టెన్ సుమీత్ సబర్వాల్‌ను ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ప్రశ్నించినట్టు పేర్కొంది. ఆ వెంటనే క్లైవ్ కుందర్ ఆందోళనతో స్పందించగా, కెప్టెన్ సుమీత్ మాత్రం శాంతంగా ఉన్నట్టు వారి సంభాషణ ద్వారా అర్థమైందని కథనం విశ్లేషించింది.
ఇద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణ ఆధారంగా ఫ్యూయల్ స్విచ్‌లను కెప్టెన్ ఆఫ్ చేసినట్టు అనుమానాలకు ఆస్కారం ఇస్తోందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం సందేహం వ్యక్తం చేసింది. అయితే, తప్పుదొర్లిందా లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అనే విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఇటీవలే విడుదలైన ప్రాథమిక నివేదిక ప్రకారం, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే రెండు ఇంజిన్లకు సంబంధించిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు కేవలం ఒక సెకన్ వ్యవధిలోనే ‘కట్ ఆఫ్’ స్థితిలోకి మారినట్టు స్పష్టమైంది. విమానం టేకాఫ్ సమయం నుంచి కూలిపోయే వరకు కేవలం 32 సెకన్ల సమయం మాత్రమే ఉన్నట్టు తేలింది. ఎయిరిండియా విమాన ప్రమాదంలో విమానంలోని మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమానం కూలిన జేబీ మెడికల్ కాలేజీలోకి చెందిన మరో 19 మంది కూడా మృత్యువాతపడ్డారు. విమానాన్ని పైలట్లలో ఒకరైన కెప్టెన్ సుమీత్ సబర్వాల్‌కు 15,638 గంటల ఫ్లయింగ్ అనుభవం, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్‌కు 3,403 గంటల అనుభవం ఉన్నాయి.
Read Also- Hair Tips: వర్షంలో జట్టు తడుస్తోందా?.. డెర్మటాలజిస్టులు ఏం చెబుతున్నారంటే?
ఇండియన్ పైలట్ల సమాఖ్య ఖండన
అమెరికా మీడియా కథనంపై ఇండియన్ పైలట్స్ సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) అధ్యక్షుడు సీఎస్ రంధావా స్పందిస్తూ, వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అసత్యమని కొట్టిపారేశారు. ఆధారాల లేనిదని మండిపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికలో పైలట్లే ఇంధనాన్ని నిలిపివేసినట్టు ఎక్కడా పేర్కొనలేదని, ఆ కథనంపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంధావా హెచ్చరించారు. కాగా, ప్రాథమిక నివేదిక ఆధారంగా ప్రమాదానికి గల కారణాలపై నిర్ణయానికి వచ్చేయవద్దంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు ఇటీవలే సూచించారు. ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమేనని, తుది నివేదిక వచ్చేంత వరకు ఎలాంటి అభిప్రాయాలకు రావొద్దన్నారు. ‘‘మన పైలట్లు ప్రపంచంలోనే బెస్ట్. ప్రాథమిక సమాచారం ఆధారంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదు’’ అని ఆయన ఆయన కోరారు.
Read Also- Viral Video: ఏఐ మ్యాజిక్.. ఈ వీడియో నిజం కాదంటే నమ్మలేరు!
ఇదిలావుంచితే, ప్రమాదానికి అసలు కారణంపై క్లారిటీ లేకపోయినప్పటికీ ఇండియాలో విమానాల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల పరిశీలన ప్రారంభమైంది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ మధ్యే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎయిరిండియా తన బోయింగ్ 787-8 విమానాల్లోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లను పరిశీలించింది. ఈ పరిశీలనలో ఎలాంటి లోపాలు గుర్తించలేదని ప్రకటించింది. ఏదేమైనప్పటికీ, ప్రాథమిక నివేదిక ఆధారంగా అప్పుడే తుది నిర్ణయానికి రాలేము. ప్రమాదంపై తుది నివేదిక వచ్చేవరకు ఒక అభిప్రాయానికి రాలేమని నిపుణులు చెబుతున్నారు.