Nimisha Priya: యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న నిమిష ప్రియ ఉరిశిక్ష వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకున్నది. బ్లడ్ మనీకి తాము అంగీకరించే ప్రసక్తే లేదని హతుడు మెహదీ సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది తేల్చి చెప్పేశాడు. ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరిశిక్ష పడాల్సిందేనని చెప్పాడు. అంతేకాదు ఈ సందర్భంగా డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని.. ఆమె బాధితురాలు కాదు దోషి అని చెప్పుకొచ్చాడు. సయోధ్య ప్రయత్నాలు కొత్త ఏమీ కాదని.. ఈ వాయిదాను తాము ఊహించలేదని తన ఫేస్ బుక్ ఖాతాలో అబ్దుల్ పోస్టు చేశాడు. దీంతో నిమిష ప్రియ ఉరిశిక్ష వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యలు ఈ కేసులో మరోసారి ఉత్కంఠను రేకెత్తించాయి.
Also Read- Surekha Vani: పబ్బులో గుర్తు తెలియని వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ.. బండారం బట్టబయలు!
ఏం జరుగునో?
కాగా, ఈ పరిణామంతో నిమిష కేసులో తదుపరి పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తలాల్ అబ్దుల్ మెహదీ కుటుంబం బ్లడ్ మనీని తిరస్కరించడం వల్ల నిమిష ప్రియకు క్షమాభిక్ష లభించే అవకాశాలు మరింత సన్నగిల్లినట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ప్రియకు 2020లో మరణశిక్ష పడింది. 2023లో యెమెన్ సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. షరియా చట్టాల ప్రకారం హత్యకు మరణశిక్ష విధించడం లేదా బాధితుల కుటుంబానికి ‘బ్లడ్ మనీ’ (క్షమాధనం) చెల్లించి క్షమాభిక్ష పొందడం సాధ్యమవుతుందనే ఒక్క ఛాన్స్ ఉంది కానీ దీనికి బాధితుడి కుటుంబం ఒప్పుకోవడం లేదు. వాస్తవానికి.. జులై 16న (బుధవారం) నిమిషకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో అది వాయిదా పడింది. భారత ప్రభుత్వం, యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూషన్ కార్యాలయంతో జరిపిన సంప్రదింపులు, అలాగే భారతదేశంలోని సున్నీ మతాధికారి కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ మత గురు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ జోక్యం చేసుకోవడం వల్ల ఈ వాయిదా సాధ్యమైందని తెలుస్తోంది. షేక్ హబీబ్ ప్రతినిధులు తలాల్ అబ్దుల్ మెహదీ కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఇప్పుడీ పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఏంటో ఎవ్వరికీ అర్థం కాని పరిస్తితి.
Also Read- Ice Discovered in Space: అంతరిక్షంలో మంచుపై షాకింగ్ అధ్యయనం.. అందులో ఏం తేలిందో తెలిస్తే షాకే!
అసలేంటి ఈ కేసు?
నిమిష ప్రియ కేరళకు చెందిన నర్సు. ఆమె 2008లో యెమెన్‌కు వెళ్లి అక్కడ నర్సుగా పనిచేసింది. 2017లో, ఆమె పనిచేస్తున్న క్లినిక్‌లో భాగస్వామి అయిన యెమెన్ పౌరుడు తలాల్ అబ్దుల్ మెహదీని అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి చంపేసిందని ఆరోపణలు వచ్చాయి. నిమిష ప్రియ కథనం ప్రకారం, తలాల్ తనను వేధింపులకు గురిచేసేవాడని, తన పాస్‌పోర్టును తీసేసుకుని ఆమెను బందీగా ఉంచాడని, అందుకే ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించిందని, ఈ క్రమంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అయితే, మత్తుమందు మోతాదు మించిపోవడంతో తలాల్ మరణించాడు. అనంతరం మృతదేహాన్ని ఒక వాటర్ ట్యాంక్‌లో పడేసి, పారిపోయే ప్రయత్నంలో నిమిష ప్రియ పట్టుబడింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు