YS Jagan: ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే ఉండదని.. రేపు పొద్దున్న వైసీపీ అధికారంలోకి వచ్చాక సినిమా వేరేలా ఉంటుందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం మీడియా ముందుకొచ్చిన జగన్.. తాజా పరిణామాలు, తన పర్యటనపై ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు, నల్లపురెడ్డి ఇంటిపై జరిగిన దాడి, కృష్ణా జిల్లాలో బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్ హారికపై టీడీపీ నేతలు, కార్యకర్తల దాడి ఇలా ఇటీవల చోటు చేసుకున్న విషయాలపైన సుదీర్ఘంగా మాట్లాడారు. ఇప్పుడున్న కూటమి పాలనలో ఏం జరుగుతోంది? అనేది ప్రజలు అందరూ చూస్తున్నారని.. ఇప్పటికైనా చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలని జగన్ హితవు పలికారు.
ఎక్కడున్నాం..?
‘ఇంతకీ మనం ఆంధ్రాలో ఉన్నామా.. బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా ? మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేంటి? ప్రజా ప్రతినిధులకు పోలీసులు గన్ చూపించి బెదిరిస్తారా? తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ పోలీసులు ఎందుకు అడ్డు తగులుతున్నారు. మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు గన్ చూపించమేంటి? అసలు మనం ఎక్కడ ఉన్నాం. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డిపై పచ్చ సైకోలు, అదీ పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారంటే అసలేం జరుగుతోంది? పోలీసులు అక్కడే ఉన్నా ఆ బ్యాచ్‌ను ఎందుకు అడ్డుకోలేదు? మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా? చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి’ అని ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read- Ravi Teja: రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆ ఇద్దర్ని ఒకేసారి కోల్పోయిన హీరో?
చర్యకు ప్రతి చర్య!
‘తప్పుడు వాంగ్మూలతో ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితిని ఇక్కడే చూస్తున్నాం. రాజకీయాల్లో చంద్రబాబు దుష్ట సంప్రదాయం తెచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఏంటి? చంద్రబాబు తప్పుడు సంప్రదాయం విత్తు నాటితే అది విష వృక్షం అవుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏంటి? అందుకే చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదు. దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక నేను చెప్పినా కూడా మా వాళ్లు నా మాట కూడా వినరు. దెబ్బ తగిలిన వాడికి ఆ బాధ తెలుస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు తప్పు తెలుసుకోవాలి. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం’ అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ హెచ్చరించారు.
Also Read- Kota vs Anasuya: కోట, అనసూయల మధ్య గొడవేంటి? కోటను అంతమాట అందా?
తగ్గేదేలా..!
‘ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు..ఆగేది లేదు. నువ్వు పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. మహా అయితే మీ ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుంది. ఆ తర్వాత అన్నీ చెల్లిస్తాం. రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్లు..? ఇది శాడిజం కాదా.. పైశాచికత్వం కాదా..? కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, నందిగాం సురేష్, పోసాని కృష్ణ మురళి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. తమ జీవితంలో మచ్చలేని అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిలపై తప్పుడు వాగ్మూలంతో కేసులు పెడుతున్నారు. అన్నిటికీ ఒకటే మోడ్ ఆఫ్ ఆపరెండ. తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని మోదీని అయినా.. అమిత్ షా ను అయినా అరెస్ట్ చేయిస్తారు. తప్పుడు ఫిర్యాదులు.. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకో.. మేలుకో.. తప్పుడు సంప్రదాయాలు మార్చుకో’ అని వైఎస్ జగన్ గట్టిగానే హెచ్చరించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు