CM Revanth Reddy: 2035 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో జరిగిన ‘శ్రీ మద్భాగవతం పార్ట్-1’ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సాగర్ పిక్చర్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్(Sagar Picture Entertainment Banner)పై ఆకాష్ సాగర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు 2047 విజన్ డాక్యుమెంట్‌ను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అందులో సినీ రంగానికి ప్రత్యేక అధ్యాయం కేటాయించనున్నామని తెలిపారు.
దృశ్య కావ్యం తీయడం గొప్ప విషయం
రామాయణం, మహా భారతం, భాగవతం మన జీవితాల్లో భాగం అయిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి గొప్ప కథను మరోసారి ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకున్న నిర్మాతలను అభినందించారు. 40 ఏళ్ల క్రితం వచ్చిన రామాయణం సీరియల్ ప్రజల హృదయాలను గెలిచిందని, టీవీల్లో రామాయణం సీరియల్ వస్తుందంటే బయట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవని గుర్తు చేశారు. కోవిడ్(Covid) సమయంలో టెలికాస్ట్ చేసినప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. ఈ సినిమాను చిత్రీకరించిన రామానంద్ సాగర్‌కు సంబంధించిన మూడో తరంకు చెందిన మోతీ సాగర్, అమృత్ ఆకాష్‌లు దృశ్య కావ్యంగా మద్భాగవతం తీయడం గొప్ప విషయమన్నారు. ఆ రోజుల్లో రామానంద్ సాగర్ తీసిన రామాయణం ఎంత ప్రాచుర్యం పొందిందో..శ్రీ మద్భాగవతం సినిమా కూడా అలాంటి ఘన విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
Also Read: POCSO Act: పసిపిల్లలపై పైశాచికాలు.. యేటా నమోదవుతున్న పోక్సో కేసులు
రామోజీ ఫిల్మ్ సిటీ గొప్ప స్టూడియో
రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే ఒక ప్రత్యేకమైన ఫిల్మ్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. ఇలాంటి స్టూడియో తెలంగాణ రాష్ట్రంలో ఉండడం గర్వకారణమన్నారు. ఈ ఫిల్మ్ సిటీలోనే శ్రీ మద్భాగవతం చిత్రీకరణ జరగడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేంపల్లి నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ది సంస్థ ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్, మద్భాగవతం పార్ట్-1 ఫిల్మ్ ప్రొడక్షన్స్ మోతీ సాగర్, అమృత్ సాగర్ చోప్రా, ఆకాష్ సాగర్, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుకు మధుసూదన్ రెడ్డి, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: BRS: పార్టీ నేతలను వెంటాడుతున్న కేసులు.. నైరాశ్యంలో గులాబీ క్యాడర్..