Vinutha Kotaa: జనసేన నేత కోటా వినుత డ్రైవర్ శ్రీనివాసుల రాయుడు హత్య కేసు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనమే సృష్టిస్తోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూ, చూడటానికి స్మార్ట్‌గా ఉన్న వినుత ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారు..? అసలు ఎందుకు ఇలా చేశారు? తెరవెనుక ఏం జరిగింది..? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని సొంత పార్టీ క్యాడర్, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనకు అసలేం జరిగింది? పోలీసులు ఏం తేల్చారు..? రాయుడు మృతదేహం ఎక్కడ లభ్యమైంది..? ఈ హత్యపై వైసీపీ కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతున్నారు..? అనేది చూసేద్దాం వచ్చేయండి. పూర్తి వివరాల్లోకెళితే.. ఓ గోడౌన్‌లో డ్రైవర్ రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి నదిలో పడేసినట్లుగా తేలిపోయింది. చెన్నై సమీపంలోని కూవం నదిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. రాయుడి చేతి మీద జనసేన సింబల్, వినుత పేరు ఉండడంతో ఆ దిశగా పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబును పోలీసులు లోతుగా విచారించారు. ఆపై ఆమె మాజీ డ్రైవర్ రాయుడుదిగా పోలీసులు నిర్ధారించారు. దీంతో వినుత, చంద్రబాబు, శివకుమార్, షైక్ తాసాన్, గోపిలను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also- Tirumala: టీటీడీపై బండి సంజయ్ వ్యాఖ్యల్లో నిజమెంత.. రగులుతున్న తెలుగు రాష్ట్రాలు!
ఎందుకిలా జరిగింది..?
శ్రీకాళహస్తిలోని బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ రాయుడు కొంతకాలంగా వినుత కోటా దగ్గర నమ్మిన బంటుగా, డ్రైవర్‌గా ఉంటున్నాడు. అంతేకాదు.. ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేశాడు. అయితే జూన్ 21న ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా వినుత సంచలన ప్రకటన చేశారు. ‘ రాయుడు చేసిన అనుచితమైన, అభ్యంతరకరమైన, కుట్రపూరితమైన, మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి, మాకు ఎన్నో రకాలుగా ప్రాణ, గౌరవ అంశాలలో భంగం కలగ చేసినందున, అతనిని మా దగ్గర పనిలో నుంచి తొలగిస్తున్నాం’ అని వినుత కోటా ప్రకటించారు. అయితే.. జూలై 8న రాయడిని హత్య చేసి నదీలో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా.. ‘ ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని మాకు సంబంధించిన సమాచారం వాళ్లకు చేరవేస్తున్నాడు. అందుకే ఆ అనుమానంతోనే రాయుడిని విధుల నుంచి తొలగించాం. ఆపై హత్య చేయించాం’ అని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు.. శనివారం నిందితుల ఫొటోలను సైతం పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం వినుత కోట, చంద్రబాబు, శివకుమార్, షైక్ తాసాన్, గోపిలు పోలీసుల అదుపులోనే ఉన్నారు. మరోవైపు.. వినుత, చంద్రబాబుతో పాటు మిగతా నిందితులను కూడా శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.
ఆది నుంచీ వివాదాలే..!
వినుత అండ్ కో వివాదాల్లో తలదూర్చడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు విషయాల్లో వేలుపెట్టి వార్తల్లో నిలవడం, అధిష్టానం అక్షింతలు వేయడం ఇవన్నీ మూడో కంటికి తెలియకుండా చాలానే జరిగాయి. ఆఖరికి రాయుడి కేసులో వినుతను అరెస్ట్ అయిన కొద్దిసేపటికే, జనసేన పార్టీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. పార్టీ విధివిధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రకటనలో జనసేన పేర్కొంది. అంతేకాదు గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచిన విషయాన్ని కూడా ప్రకటనలో పార్టీ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాయుడి హత్య కేసు, ఆమె అరెస్ట్, జనసేన నుంచి సస్పెన్షన్ అనే అంశాలే ప్రధానంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక వ్యక్తిగత విషయాలు ఉన్నాయని.. అందుకే అవన్నీ హత్యకు దారితీశాయనే ప్రచారం పెద్ద ఎత్తునే జరుగుతోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. మీడియా, సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రాలుగా కారణాలు బయటికొస్తున్నాయి. ఇక ప్రత్యర్థులు అయితే బాబోయ్ రెండ్రోజులకు ఒకరు సస్పెండ్ కావడం, ఇలాంటి మర్డర్లు అసలేం జరుగుతోంది జనసేనలో అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఘటనను మించే ఈ కేసులో ట్విస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో వైసీపీ-జనసేన మధ్య ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే.. తెరవెనుక ఏం జరిగింది? హత్యకు దారితీసిన కారణాలేంటి? అనేవి ఎప్పుడు బయటికొస్తాయో చూడాలి మరి.
Read Also- Tesla in lndia: భారత్‌లోకి టెస్లా ఎంట్రీ షురూ.. ప్లేసు, ముహూర్తం ఫిక్స్.. మీరు సిద్ధమేనా?