Screen Time: ఈ రోజుల్లో చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు చూడటం చాలా ఎక్కువైపోయింది. ఒక సాధారణ అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. కానీ, ఈ పరిణామం పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారతదేశంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పిల్లల స్క్రీన్ టైమ్ (మొబైల్ చూసే సమయం) ప్రమాదకర స్థాయిలో ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఇండియాలో ఐదేళ్లలోపు చిన్నపిల్లలు సూచించిన పరిమితిని రెట్టింపు స్థాయిలో ఫోన్లు చూస్తున్నారని ఏఐఐఎంఎస్ రాయపూర్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పరిశోధకులు మెటా డేటాను విశ్లేషించి నిజాలను నిగ్గుతేల్చారు. ఇండియాలో ఐదేళ్లలోపు చిన్నపిల్లలు రోజుకి సగటున 2.22 గంటల మేర స్క్రీన్ టైమ్ గడుపుతున్నారని అధ్యయనం తేల్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) సూచించిన భద్రతా పరిమితి కన్నా ఇది రెట్టింపు అని వెల్లడైంది. ఈ అధ్యయనాన్ని 2025 జూన్ నెలలో క్యూరస్ (Cureus) అనే జర్నల్‌లో ప్రచురితమైంది. భారతదేశంలోని 10 వేర్వేరు ప్రాంతాల్లో అధ్యయనం చేపట్టగా మొత్తం 2,857 మంది చిన్నపిల్లలకు సంబంధించిన సమాచారం సమీకరించి విశ్లేషించారు.
రెండేళ్లలోపు పిల్లలు కూడా ఇంతే
రెండేళ్లలోపు పిల్లలు కూడా పరిమితికి మించి స్ర్కీన్ టైమ్ గడుపుతున్నట్టుగా తేలింది. రెండేళ్లలోపు పిల్లలు రోజుకి సగటున 1.23 గంటలపాటు స్క్రీన్ ముందు గడుపుతున్నారని అధ్యయనం తేల్చింది. ఈ వయసు పిల్లలకు స్క్రీన్ టైమ్ సున్నాగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో, ఐఏపీ సూచిస్తున్నాయి.
స్క్రీన్ టైమ్ ఎక్కువైతే?
పిల్లల స్కీమ్ టైమ్ ఎక్కువగా ఉంటే చాలా అనర్థాలకు దారితీస్తుంది. చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుంది. సామాజిక ప్రవర్తన బలహీనంగా ఉంటుంది. ఊబకాయానికి దారితీయం, నిద్రపట్టకపోవడం, దేనిపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం, భాష నేర్చుకోవడంలో ఆలస్యం, ఈ తరహా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని అధ్యయనంలో వెల్లడైంది.
Read Also- Jasprit Bumrah: 21 ఏళ్ల యువకుడిని కాదు.. ప్రెస్‌మీట్‌లో బుమ్రా సంచలన వ్యాఖ్యలు
పేరెంట్స్‌కు వార్నింగ్
మన దేశంలో చాలా ఇళ్లలో పిల్లలు భోజనం చేయనంటూ మారాం చేసినా, పిల్లలు ఏడుపు ఆపేందుకు ఫోన్లు, ట్యాబ్‌లు అందివ్వడం సాధారణంగా మారిపోయింది. అయితే, ఈ అలవాటు చాలా చేటు చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 60–70 శాతం మంది ఎక్కువగా స్క్రీన్ వినియోగిస్తున్నారని, భౌతికంగా ఎదుగుదల, మానసిక సమస్యలకు దారితీయవచ్చని అప్రమత్తం చేస్తున్నారు. పిల్లల అలవాటును మార్చాలనుకుంటే ముందుగా తల్లిదండ్రులే మారాలని, పిల్లల ముందే ఫోన్లు చూస్తూ ఉంటే, వారూ అదే చేయాలనుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేస్తే పిల్లల్లో మార్పు
పిల్లల స్కీన్ టైమ్ తగ్గించేందుకు తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని మార్పులను ఏఐఐఎంఎస్ అధ్యయనం సూచించింది. ఇంట్లో టెక్-ఫ్రీ జోన్లు సృష్టించాలని పేర్కొంది. బెడ్ రూమ్స్, డైనింగ్ ఏరియాలో టెక్ పరికరాలు లేకుండా చేయాలని వివరించింది. ఒకవేళ పిల్లలు ఫోన్లు చూసినా స్క్రీన్ టైమ్ పరిమితులు విధించాలని పేర్కొంది. శారీరకంగా ఆడుకునే ఆటలు, పిల్లలతో మాట్లాడడం వంటి శారీరక పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధ్యయనం పేర్కొంది. భోజనం చేసేటప్పుడు అసలు స్క్రీన్ లేకుండా అలవాటు చేయాలని తెలిపింది. పిల్లలను బయటకు తీసుకెళ్లి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగని పిల్లలకు డిజిటల్ నాలెడ్జ్ చేయకుండా కూడా ఉండకూదని, అవసరం మేరకు సమర్థవంతమైన డిజిటల్ అలవాట్లను నేర్పించవచ్చని చెప్పారు. వయస్సుకు తగిన కంటెంట్‌ను చూపించాలని అంటున్నారు. వైద్యులు, టీచర్లు, తల్లిదండ్రులు కలసి పని చేస్తే పిల్లల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని పేర్కొంటున్నారు.
Read Also- Kangana Ranaut: ఎంపీగా ఏడాది పూర్తి.. కంగనా అభిప్రాయం ఇదే