Air India Flight Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం.. యావత్ దేశాన్ని తీవ్ర కలవరానికి గురి చేసిన సంగతి తెలిసిందే. జూన్ 12వ తేదీ మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానశ్రయం (Sardar Vallabhbhai Patel International Airport) నుంచి లండన్ (London)కు బయలుదేరిన విమానం.. టెకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఈ ఘటనలో ఫ్లైట్ లోని 241 సిబ్బంది, హాస్టల్ బిల్డింగ్ పై పడటంతో అందులోని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) శుక్రవారం రాత్రి ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ప్రమాదానికి సంబంధించి అందులో ప్రస్తావించిన అంశాలు.. పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇంధన నియంత్రణ స్విచ్‌లు
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోని ఎన్హాన్స్ ఎయిర్ బోర్న్ ఫ్లైట్ రికార్డర్ (EAFR) నుంచి సేకరించిన డేటా ప్రకారం.. విమానం.. దాదాపు 283 కి.మీ. వేగంతో విమానశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. సెకన్ల వ్యవధిలోనే అది రూ.333 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంది. వాతావరణపరంగా చూస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవు. ఆకాశం స్పష్టంగా కనిపిస్తూ.. తేలికపాటి గాలులతో ఉంది. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే ఇంజిన్ 1, ఇంజిన్ 2కు ఇంధన సరఫరా ఆగిపోయినట్లు AAIB నివేదిక స్పష్టం చేసింది. ఇంధన నియంత్రణ స్విచ్ లు.. రన్ (RUN) నుంచి కట్ ఆఫ్ (CUTOFF) స్థానానికి సెకను వ్యవధిలో మార్చబడ్డాయని నివేదిక తెలిపింది. ఇంజిన్ స్విచ్ లు కట్ ఆఫ్ లోకి మారడంతో ఇంజిన్ లోని ఇంధన సరఫర ఆగిపోయి.. విమాన వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది.
పైలెట్ల సంభాషణ
రెండు బ్లాక్ బాక్స్ భాగాలలో ఒకటైన కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (CVR).. ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు పైలెట్ల మధ్య జరిగిన సంభాషణనను రికార్డ్ చేసింది. కమాండర్ పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ (Sumeet Sabharwal), పైలెట్ ఫ్లయింగ్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ (Clive Kunder) ఇద్దరు అనుభవజ్ఞులే. ఆరోగ్యపరంగానూ ఫిట్ గా ఉన్నారు. అయితే సీవీఆర్ రికార్డ్ ప్రకారం.. ఇద్దరిలోని ఒక పైలెట్.. మరొకరిని ‘ఎందుకు ఆపివేశావ్?’ అని ప్రశ్నించారు. అందుకు రెండో పైలెట్ ‘నేను ఆపలేదు’ అంటూ ప్రతిస్పందించారు. కాక్ పీట్ లో ఇవే పైలెట్ల చివరి మాటలను ఏఏబీ నివేదిక వెల్లడించింది. అయితే ఇంజిన్ కు ఇంధనాన్ని సరఫరా చేసే స్విచ్ ను ఉద్దేశపూర్వకంగానే రన్ నుంచి కట్ ఆఫ్ చేశారా? లేదా సాంకేతికంగా జరిగిన తప్పిదమా? అన్న కోణంలో ఏఏబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే ప్రతి స్విచ్ దానంతటా అదే ఆఫ్ అయ్యే అవకాశముండదని ఫ్లైట్ నిపుణులు అంటున్నారు. ప్రతి స్విచ్ లో గార్డ్ రైల్ ఉంటుందని రన్ నుంచి కట్ ఆఫ్ లోకి మార్చడానికి పైలెట్ దానిని ఎత్తి క్రిందికి మార్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగే పొరపాట్లను ఈ డిజైన్ నియంత్రిస్తుందని స్పష్టం చేస్తున్నారు. పైగా ఫ్లైట్ కు ఇంజిన్ 1, ఇంజిన్ 2 స్విచ్ లు దాదాపు రెండు నుంచి 3 అంగుళాల దూరంలో ఉంటాయని.. పొరపాటున రెండింటినీ ఒకేసారి రన్ నుంచి కట్ ఆఫ్ లోకి మార్చడం అసంభవమని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ రెండు స్విచ్ లు ఒకేసారి కట్ ఆఫ్ అయినట్లు ఏఏబీ డేటా నిర్ధారించడం అనుమానాలకు తావిస్తోంది.
మెురాయించిన రెండో ఇంజిన్
ఇంజిన్లకు ఫ్యూయిల్ సరఫరా నిలిచిపోవడంతో విమానం ఎత్తు తగ్గడం మెుదలైంది. అయితే పరిస్థితులను చక్కదిద్దేందుకు పైలెట్లు వేగంగా పనిచేశారని.. కట్ ఆఫ్ నుంచి రన్ లోకి 10 సెకన్ల వ్యవధిలోనే మార్చారని ఏఏబీ నివేదిక తెలియజేసింది. ఈ క్రమంలో ఇంజిన్ 1 స్పందించడంతో దాని కోర్ వేగం తగ్గడం ఆగిపోయింది. థ్రస్ట్ స్థాయులు కోలుకోవడం ప్రారంభమైంది. ఇంజిన్ 2 ను కూడా తిరిగి రన్నింగ్ లోకి తీసుకురావాలని పదే పదే ప్రయత్నించినప్పటికీ దాని కోర్ వేగం తగ్గుతూనే వచ్చిందని ఏఏబీ నివేదిక తెలిపింది. దీంతో రెండు ఇంజిన్లు ఫెయిలై జూన్ 12 మద్యాహ్నం 1:39:32 గంటలకు ఎయిర్ ఇండియా విమానం హాస్టల్ ను ఢీకొట్టినట్లు ఏఏబీ తెలియజేసింది.
Also Read: Indian Origin Couple: అమెరికా నుంచి వచ్చేస్తామన్న భారత జంట.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్!
మానవ చర్య? సాంకేతిక లోపమా?
ఏఏబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికను బట్టి చూస్తే అందరి దృష్టి ఇంధన నియంత్రణ స్విచ్ లపైకి వెళ్తోంది. పొరపాటున ఇంజిన్ స్విచ్ ను రన్ నుంచి కట్ ఆఫ్ లోకి మార్చే ప్రసక్తే ఉండదని.. పైలెట్ కు ఏదైనా దురుద్దేశం ఉంటే తప్పా అని మాజీ సీనియర్ కమాండర్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ అన్నారు. ఇది పొరపాటున క్లిక్ చేసే ఇంట్లోని లైట్ స్విచ్ లు కాదని ఆయన అన్నారు. ఒకవేళ స్విచ్ లు స్వతంత్రంగా కదలడానికి సాంకేతిక లోపం ఏమైనా కారణమై ఉండొచ్చా? లేదంటే స్విచ్ లు రన్ లో ఉన్నప్పటికీ ఇంధన ప్రవాహం ఆగిపోయి ఉండవచ్చా? అన్న ప్రశ్నలకు ఏఏబీ నివేదిక ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. దీనిపై మున్ముందు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.