PACL Scam: దేశంలో వెలుగుచూసిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పీఏసీఎల్ (Pearls Agro-tech Corporation Ltd) మోసం కేసులో కీలక నిందితుడైన గుర్నామ్ సింగ్‌ను (69) ఉత్తరప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (EOW) టీమ్ గురువారం అరెస్ట్ చేసింది. పంజాబ్‌లోని రోపర్ జిల్లాలో ఆయనను అదుపులోకి తీసుకుంది. ‘‘గుర్నామ్ సింగ్ 1998లో కంపెనీ డైరెక్టర్ అయ్యారు. ఈ సంస్థ మొత్తం పోంజీ స్కీమ్ పద్ధతిలో పనిచేసింది. మొదటి ఇన్వెస్టర్లకు లాభాలిచ్చి, ఇతరులను ఆకర్షించారు. అది ఒక పెద్ద నెట్ లాంటి స్కామ్’’ అని ఈవోడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. గుర్నామ్ సింగ్‌ను కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా నిర్మల్ సింగ్ భంగూ నియమించినట్టు కంపెనీ పత్రాల ద్వారా వెల్లడైంది.
10 రాష్ట్రాల్లో డబ్బు వసూలు
పీఏసీఎల్ మోసంలో భాగంగా మొత్తం 10 రాష్ట్రాలకు చెందిన ఐదు కోట్ల మందికి పైగా అమాయకుల నుంచి సుమారుగా రూ.49,000 కోట్ల వరకు అక్రమంగా డిపాజిట్లు చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్, అసోం, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ మోసాలకు పాల్పడ్డారు. భూమి ఇస్తామని, అధిక వడ్డీ చెల్లిస్తామంటూ జనాల చెవుల్లో పువ్వులు పెట్టి పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేయించుకున్నారు. ఆకర్షణీయమైన స్కీమ్స్, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు పేరిట డిపాజిట్లు చేయించుకున్నారు. కానీ, జనాలకు భూమీ ఇవ్వలేదు, లాభాలూ కూడా పంచలేదని దర్యాప్తు సంస్థల అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు గర్నామ్ సింగ్ పంజాబ్‌కు చెందినవాడని, ఈ భారీ కుంభకోణంలో కీలక వ్యక్తి అని తెలిపారు.
Read Also- Viral News: ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందనే మాట నిజమైందోచ్!!
సీబీఐ, ఈడీ కేసులు నమోదు
ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పీఏసీఎల్‌పై కేసులు నమోదు చేశాయి. బాధితుల ఫిర్యాదులు, సెబీ (SEBI) విచారణ ఆధారంగా కన్పూర్‌లోని ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీస్ స్టేషన్‌లో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద ఒక కేసు నమోదైంది. ఈ కేసులో గర్నామ్ సింగ్‌తో పాటు మొత్తం 10 మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో నలుగురు ఇప్పటికే జైలులో ఉన్నారు. మిగతావారు పరారీలో ఉన్నారు. వారి కోసం దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి.
మోసం జరిగిందిలా..
మొదటగా1996 ఫిబ్రవరి 13న ‘గురువంత్ అగ్రో టెక్ లిమిటెడ్’ పేరుతో నిర్మల్ సింగ్ భంగూ కంపెనీని వ్యవస్థాపించారు. జైపూర్‌లో కంపెనీని రిజిస్టర్ చేయించారు. దానిని 2011లో ‘పెర్ల్స్ అగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్’గా (PACL Ltd) పేరు మార్చివేశారు. ఢిల్లీలోని బారాఖంబా రోడ్‌లో ఆఫీస్ కూడా ఉంది. ఆర్‌బీఐ నుంచి ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) అనుమతులు తీసుకోకుండానే జనాల నుంచి భారీ మొత్తంలో డబ్బు సేకరించారు. ఇందుకోసం మోసపూరిత విధానాలను ఎంచుకున్నారు. డబ్బుకు బదులు భూమి ఇస్తామంటూ అమాయక ప్రజలను పీఏసీఎల్ ప్రతినిధులు నమ్మించారు. భూమికి సంబంధించిన బాండ్ రసీదులు కూడా సృష్టించి ఇచ్చారు. చివరాఖరకు భూమి ఎక్కడని ప్రశ్నిస్తే చేతులెత్తేశారు. ఆశచూపిన ఎక్కువ వడ్డీని కూడా ఇవ్వలేదు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రూ.19,000 కోట్లకు పైగా డబ్బును సేకరించారు.
Read Also- Viral Video: అయ్యోపాపం.. స్కూల్ పిల్లలకు పెద్ద కష్టమొచ్చింది!
పోంజీ స్కీమ్ మాదిరిగానే
పీఏసీఎల్ మోసం పోంజీ స్కీమ్ మాదిరిగానే జరిగింది. పాత ఇన్వెస్టర్లకు కొత్త ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన డబ్బుతో కొంతవరకు వడ్డీలు చెల్లించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మరో ఇద్దరినైనా చేర్చించాలనే అని ప్రోత్సహించారు. ఈ క్రమంలో ఎజెంట్లకు భారీ కమిషన్లు ముట్టచెప్పారు. కంపెనీ తరఫున అనేక మీటింగ్‌లు పెట్టి విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. జనాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పీఎంఎల్ఏ చట్టాల కింద పీఏసీఎల్‌పై కేసు నమోదు చేసిన ఈడీ విచారణ మొదలుపెట్టింది. కంపెనీకి వ్యవస్థాపకుడు నిర్మల్ సింగ్ భంగూ అల్లుడు హర్సతీందర్ పాల్ సింగ్ ఆధ్వర్యంలో డబ్బును నకిలీ కంపెనీలలోకి బదిలీ చేసినట్టు గుర్తించారు. ఈ డబ్బుతో ముంబై, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో అనేక భవనాలు కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. నకిలీ కంపెనీ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయంగా చూపించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని గుర్తించారు. పీఏసీఎల్ కంపెనీ వ్యవస్థాపకుడైన నిర్మల్ సింగ్ భంగూ మొదట పాలు అమ్మే వ్యక్తిగా కెరీర్ మొదలుపెట్టారు. కోల్‌కతాలోని ఓ ముత్యాల కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత, గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ అనే చీటింగ్ కంపెనీలో చేరారు. ఆ సంస్థ మూసి వేసిన తర్వాత తానే కొత్తగా పీఏసీఎల్ పేరిట ఈ కంపెనీని స్థాపించారు.