Viral Video: ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులు బస్సులు, సైకిళ్లపై స్కూళ్లకు చేరుకుంటున్నారు. సంపన్నుల పిల్లలైతే ప్రత్యేక వాహనాల్లో పాఠశాలలకు వెళుతున్నారు. యూనిఫాం, డిజిటల్ తరగతుల వంటి ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో చక్కటి విద్య అందుకుంటున్నారు. అయితే, దేశంలోని పిల్లలందరూ ఇలాంటి సౌకర్యాలనే పొందుతున్నారని భావిస్తే పొరపాటే అవుతుంది. ఝార్ఖండ్‌లోని ఖుంటీ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థులు స్కూల్‌కు వెళడానికి ప్రాణాలను ప్రమాదంలో పెట్టాల్సి వస్తోంది. పిల్లల పరిస్థితికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వెదురు కర్రల నిచ్చెన మార్గం
విద్యార్థులు కూలిపోయిన ఒక వంతెనను దాటి స్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఇందుకోసం గ్రామస్థులు తయారుచేసిన వెదురుకర్రల నిచ్చెనను విద్యార్థులు ప్రమాదకర స్థితిలో ఉపయోగిస్తు్న్నారు. వీడియోలో కనిపించిన విధంగా, విద్యార్తులు ముందుగా కూలిన వంతెనపై సగం బాగం నడవాల్సి వస్తోంది. ఆ తర్వాత వంతెన మరో సగభాగంపైకి చేరుకోవడానికి వెదురు కర్రల నిచ్చెన ఎక్కుతున్నారు. గ్రామస్థులు కట్టిన ఈ నిచ్చెనను పిల్లలు చాలా జాగ్రత్తగా ఎక్కుతున్నారు. అయితే, పొరపాటున కాలు జారితే మాత్రం విద్యార్థులు వాగులో పడిపోయే ముప్పు పొంచి ఉంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ప్రభుత్వాధికారులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Khunti, Jharkhand | Children walk on a damaged road and use a bamboo ladder to climb up a collapsed bridge to reach their school. pic.twitter.com/nZLUqVCzYY
— ANI (@ANI) July 5, 2025
Read Also- Operation Baam: బలూచిస్థాన్‌లో ఆపరేషన్ బామ్.. పాక్‌లో అల్లకల్లోలం
తీవ్ర వర్షాలకు కూలిన వంతెన
ఝార్ఖంఢ్‌లోని ఖుంటీ-టోర్పా ప్రధాన రోడ్డు నిర్మాణంలో భాగంగా బనాయి నదిపై నిర్మించిన వంతెన భారీ వర్షాల కారనంగా జూన్ 19న కూలిపోయింది. రెండుగా విడిపోయింది. అప్పటి నుంచి వాహనాలు అటువైపు ఇటు, ఇటువైపు అటు వెళ్లడానికి అవకాశం లేకుండాపోయింది. వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల్లో పయనిస్తున్నారు. అయితే, వ్యక్తిగత వాహనాలు లేని సమీప ప్రాంతవాసులు తమ పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనికి వెళ్లే చుట్టుపక్కల ప్రజలకు కూడా పెద్ద సమస్యగా మారింది. వంతెన పునర్నిర్మాణంపై ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మరమ్మతుల ఊసెత్తకపోవడంతో చుట్టుపక్కలవారు విచారం వ్యక్తం చేస్తు్న్నారు. ఎంత ఎదురుచూసినా పరిష్కారం లేకపోవడంతో ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా వెదురుకర్రల నిచ్చెన తయారు చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన మార్గమే అయినప్పటికీ పిల్లలకు చదువులకు ఆటంకం ఎదురుకాకుండా దీనిని ఏర్పాటు చేశారు.
Read Also- Metal Powder Company: ధరణితో దోచుకో.. భూ భారతితో దాచుకో.. ఫారెస్ట్‌లో పాగా వేసుకో!
నిచ్చెన ఎక్కి వంతెనపైకి చేరుకొని స్కూల్‌కు వెళుతుండడంతో పిల్లల భద్రతపై తమకు తీవ్ర ఆందోళనగా అనిపిస్తోందని, అయితే, విద్యాబ్యాసం దెబ్బతింటుందనే భయంతో పిల్లలను ఈ మార్గంలో పంపించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పిల్లలు వెదురు కర్రెల నిచ్చెన ఎక్కి స్కూల్‌కి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో ఈ వీడియో తెలియజేస్తోందని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి, దారుణ పరిస్థితులపై నెటిజన్లు విమర్శల దాడి చేశారు. వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు నిచ్చెన ఎక్కి స్కూల్‌కి వెళుతున్న విధానంపై ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందిస్తూ, ‘ఇది వంతెన కూలిన ఘటన కాదు. పిల్లలకు ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చే కొత్త విధానం!’ అని విమర్శించాడు.
నిచ్చెన తొలగించాం
విద్యార్థులు వెదురు నిచ్చెన ఎక్కి స్కూల్‌కి వెళుతున్న వ్యవహారం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండడంతో ఖుంటీ సబ్ డివిజనల్ ఆఫీసర్ అర్వింద్ ఓజా వెంటనే స్పందించారు. పిల్లలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేశారు. వెదురు నిచ్చెన తొలగించామని, త్వరలోనే ఆ మార్గాన్ని డబుల్ లేన్ రోడ్డుగా మారుస్తామని హామీ ఇచ్చారు. మరో 2–3 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని స్థానికులకు భరోసా ఇచ్చారు. పిల్లలు నిచ్చెన మెట్లు ఎక్కి వంతెన దాటుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదని సంబంధిత అధికారులను ఆదేశించామని అర్వింద్ ఓజా తెలిపారు.