pok fires pakistan
అంతర్జాతీయం

Pakistan:మండుతున్న పీఓకే

POK public fire on Pakistan government about Increase prices daily needs:
మరోసారి పీవోకేలో హింస చెలరేగింది. నిరసనకారులు రెచ్చిపోయారు. పాక్ లో రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలతో కుదేలయిన జనం ఇప్పుడు కొత్తగా విద్యుత్ బిల్లుల పెంపుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న గోధుమ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తుండగా అక్కడ సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలపై గత కొన్ని రోజులుగా పీఓకే ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే కంటితుడుపు చర్యగా ఇటీవల పాకిస్తాన్ కేవలం 2 వేల మూడు వందల కోట్ల సబ్సిడీని ప్రకటించి చేతులు దులిపేసుకుంది. అయినా శాంతించని ప్రజానీకం ఆందోళనలు చేస్తునేవున్నాయి. తాజాగా పాక్ సైన్యం పీఓకే నిరసనకారులను అణిచివేసే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పీఓకే పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇంటర్నెట్ సేవలు బంద్

పీవోకేలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి వచ్చిన సైన్యం తిరిగి వెళుతున్న సమయంలో ఈ హింస చోటు చేసుకుంది. మొత్తం 11 వాహనాలతో సైనిక బృందం ముజఫరాబాద్‌ మీదుగా వెళుతున్నపుడు ఆందోళనకారులు భారీస్థాయిలో రాళ్లు రువ్వారు. దీంతో సైన్యం కాల్పులు జరిపింది. బాష్పవాయువును ప్రయోగించింది. ఇటీవల పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ పోలీసు అధికారి మృతి చెందారు. 100 మందికి పైగా భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. పీఓకేలోని ఇస్లాంగఢ్‌ ప్రాంతంలో ఈ ఆందోళన చోటుచేసుకుంది. ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలతో పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అట్టుడికిపోతోంది. గత శనివారం మొదలైన రగడ మరింత ఉధృతమైంది. పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గంచాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై తిరగబడుతున్నారు. . పీఓకేలో పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్‌ సేవలను అధికారులు నిలిపివేశారు. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ అత్యవసర సమావేశం నిర్వహించారు. పీఓకేలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు.

పాక్ సవతి ప్రేమ

పీఓకే ప్రజలు దశాబ్దాలుగా పాక్‌ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ మండిపడుతున్నారు. చివరికి కరెంటు బిల్లుల మదింపులో కూడా ఈ వివక్ష భరించలేనంత ఎక్కువగా ఉందంటూ వాపోతున్నారు. ‘మా ప్రాంతం నుంచే ఏకంగా 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. దాన్నంతటినీ తరలించుకుపోయి దేశమంతటికీ వాడుకుంటున్నారు.బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో వారికి తక్కువగా, మాకు భరించలేనంత ఎక్కువగా వేస్తున్నారు. ఇది మా పట్ల సహించరాని అన్యాయం‘ అంటూ ఆక్రోశిస్తున్నారు. అది కాస్తా కొద్ది రోజులుగా ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. భారీ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒక్క నెలలో రూ.139 కోట్ల బిల్లులు వచ్చాయని ప్రముఖ స్థానిక నేత తౌకీర్‌ వాపోయారు. ‘అందులో కేవలం రూ.19 కోట్ల బిల్లులు కట్టారు. వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదు‘ అని అన్నారు. తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..