Viral News: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో తీవ్రమైన వైద్య నిర్లక్ష్యపూరిత ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని అంబజోగైలో ఉన్న స్వామి రామానంద్ తీర్థ ప్రభుత్వ ఆసుపత్రిలో జూలై 7న రాత్రి ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, నవజాత శిశువు చనిపోయినట్లు వైద్యులు ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో నిర్ధారించి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపారు. దీంతో, అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాతయ్య తీవ్ర ఆవేదనతో శిశువు మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్వగ్రామానికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం కాగానే శిశువును ఖననం చేసేందుకు ఒక గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. ఇక, మరికొద్దిసేపట్లో ఖననం చేస్తారనగా, శిశువు ముఖాన్ని చివరిసారి చూసేందుకు బిడ్డ చుట్టూ చుట్టి ఉన్న వస్త్రాన్ని అమ్మమ్మ తెరచింది. దీంతో, ఆశ్చర్యకర రీతిలో శిశువు ఒక్కసారిగా గుక్కపట్టి ఏడవడం ప్రారంభించింది. దీంతో, అందరూ విస్మయానికి గురయ్యారు. వెంటనే శిశువును తీసుకొని హాస్పిటల్‌కు పరిగెత్తుకెళ్లారు. వెంటనే చికిత్స అందించడం కూడా మొదలుపెట్టారు. దీంతో, చిన్నారి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. మొత్తంగా చనిపోయినట్టు వైద్యులు ప్రకటించిన 12 గంటల తర్వాత శిశువు సజీవంగా ఉండడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఖననానికి కొన్ని క్షణాల ముందు సజీవంగా శిశువు బయటపడడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Viral News: టెన్నిస్ క్రీడాకారిణిని కాల్చిచంపిన తండ్రి.. ఆ రీల్‌లో ఏముందో?
ఇది తీవ్రమైన మెడికల్ నెగ్లిజెన్సి ఘటన అని ఆసుపత్రి సిబ్బందిపై శిశువు తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత నిర్లక్ష్యం చేస్తారా? అని ప్రశ్నించింది. ఆస్పత్రిలో శిశువు మరణించినట్లు చెబుతున్న సమయంలో కూడా శిశువులో కదలికలు ఉన్నట్టు తాను గమనించానని, ఈ విషయం తాను నర్సుకు చెబుతున్నా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు జిల్లా అధికార యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
Read Also- Viral News: ఒకే కాన్పులో 9 మంది పిల్లలు.. తల్లి ఇప్పుడెలా ఉన్నారంటే?
శిశువు బతికి ఉన్నట్టు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, చికిత్సకు స్పందించలేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. స్వామి రామానంద్ తీర్థ ఆసుపత్రి డీన్ రాజేష్ కచ్రే మాట్లాడుతూ, జూలై 7న ఒక మహిళ ఆసుపత్రికి వచ్చిందని, ఆమె 27 వారాల గర్భిణి అని వివరించారు. సదరు మహిళ గర్భధారణలో సమస్యలు ఉన్నాయని, జూలై 7న రాత్రి 7 సమయంంలో ప్రసవం జరిగిందన్నారు. మగ శిశువు బరువు 900 గ్రాములు ఉందని, శిశువు చాలా బలహీనంగా, తక్కువ బరువుగా ఉందన్నారు. వైద్య శాస్త్రం ప్రకారం సాధారణంగా కనిపించే సజీవ లక్షణాలు ఏవీ శిశువులో కనిపించలేదని రాజేష్ చెప్పారు. ఎటువంటి చికిత్స అందించినా స్పందించలేదని, అందుకే చనిపోయినట్లు ప్రకటించామని తెలిపారు. మరుసటి రోజు ఉదయం శిశువులో కదలికలను గుర్తించి తిరిగి హాస్పిటల్‌కు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ ఘటన జరగడానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, రెండు దర్యాప్తు కమిటీలను ఏర్పాటు చేశామని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.