Viral News: హర్యానా క్రీడావర్గాల్లో గుర్తింపు తెచ్చుకుంటూ ఎదుగుతున్న రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె కన్నతండ్రి ఘోరంగా హత్య చేశాడు. గురువారం గురుగ్రామ్‌లోని వారి ఇంట్లోనే తుపాకీతో ఆమెపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. రాధికా యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో విషయమై ఇద్దరి మధ్య వివాదం రాజుకుందని, ఈ క్రమంలోనే కాల్చిచంపినట్టుగా పోలీసులు వెల్లడించారు. మృతురాలి వయసు 25 ఏళ్లని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందిత తండ్రిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో, ఇంటి మొదటి అంతస్తులో ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు. రాధిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామన్నారు.
ప్రాణం తీసిన రీల్
రాధిక యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఒక వీడియో చిత్రీకరించిందని, ఇన్‌స్టా రీల్ కోసం ఉద్దేశించిన ఈ వీడియోపై ఆమె తండ్రితో విభేదించాడని తెలిపారు. పోస్ట్ చేయడంతో ఆగ్రహానికి గురైన తండ్రి ఇంట్లో ఉన్న తన లైసెన్స్‌డ్ రివాల్వర్ తీసుకొచ్చి కాల్పులు జరిపాడని గురుగ్రామ్ పోలీస్ పీఆర్‌వో సందీప్ కుమార్ వెల్లడించారు. సోషల్ మీడియా పోస్ట్ ఇంట్లో కోపోద్రిక్త తలకు దారితీసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందన్నారు. “తండ్రి తీవ్ర ఆగ్రహంతో రాధికాను తుపాకీతో కాల్చాడు. ఉపయోగించిన ఆయుధం లైసెన్స్‌డ్ రివాల్వర్. దానిని స్వాధీనం చేసుకున్నాం. తీవ్రంగా గాయపడిన రాధికను కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది’’ అని సందీప్ కుమార్ తెలిపారు. కాగా, తండ్రి, కూతురి మధ్య వివాదానికి దారితీసిన రీల్ ఏముందనేది తెలియరాలేదు.
Read Also- Kapil Sharma Cafe: కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పుల మోత.. ఖలిస్థానీ ఉగ్రవాది బరితెగింపు
తుపాకీ గాయాలతో ఓ యువతి చనిపోయిందంటూ ఆసుపత్రి నుంచి తమకు సమాచారం అందిందని గురుగ్రామ్‌లోని సెక్టార్ 56 పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేందర్ కుమార్ వెల్లడించారు. “తుపాకీ గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఒక యువతికి సంబంధించిన సమాచారం అందింది. ఆసుపత్రి నుంచి కాల్ వచ్చింది. మేము అక్కడికి చేరుకునే సమయానికే రాధిక చనిపోయింది. తండ్రే కారణమంటూ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు ఇచ్చారు” అని ఆయన చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బంధువులు, పొరుగువారిని ప్రశ్నిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, నేరం జరిగిన సమయంలో నిందితుడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, రాధిక మృతిపై హర్యానా క్రీడావర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఆమెకు గతంలో శిక్షణ ఇచ్చిన మనోజ్ భరద్వాజ్ స్పందిస్తూ, రాధిక మరణం పెద్ద లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఆమె క్రమశిక్షణగా ఉంటుందని, మంచి ప్రతిభావంతురాలని, ఆమె మరణంతో చాలా పెద్ద నష్టం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, రాధిక యాదవ్ హర్యానా తరపున పలు రాష్ట్ర స్థాయి టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొని సత్తా చాటింది. రాష్ట్రస్థాయి క్రీడావర్గాల్లో పేరు తెచ్చుకొని ఎదుగుతున్న తరుణంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
Read Also- Viral News: ఒకే కాన్పులో 9 మంది పిల్లలు.. తల్లి ఇప్పుడెలా ఉన్నారంటే?