Buck Moon 2025: ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఎప్పుడు దగ దగ మెరుస్తూ తెల్లగా కనిపించే చంద్రుడు.. ఇవాళ మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. సాధారణ రోజుల కంటే భిన్నంగా అందరి దృష్టిని ఆకర్షించనున్నాడు. నేడు ఆకాశంలో దర్శనమిచ్చే చంద్రుడిని ‘బక్ మూన్’ గా పిలుస్తారు. అయితే అలా పిలవడానికి కారణం ఏంటీ? ఇవాళ కనిపించే చంద్రుడు ఎందుకు ప్రత్యేకం? సాధారణ రోజులతో పోలిస్తే ఇవాళ మూన్ లో కనిపించే వ్యాత్యాసం ఏంటీ? అన్న వాటిని ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ప్రతీ ఏటా జులైలో..
ప్రతి ఏటా జూలైలో వచ్చే పౌర్ణమి రోజున.. ఆకాశంలో కనిపించే చంద్రుడిని ‘బక్ మూన్’ అని పిలుస్తారు. ఈ రోజు చంద్రుడు సాధారణ పౌర్ణమిలలో కన్నా మరింత ప్రకాశవంతంగా కొద్దిగా ఎరుపు వర్ణంతో మెరిసిపోతుంటాడు. ఇదే రోజును హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమిగా కూడా పరిగణిస్తారు. గురువుల పట్ల విద్యార్థులు, శిష్యులు తమ అభిమానాన్ని చాటుకుంటారు.
‘బక్ మూన్’ పేరు ఎలా వచ్చింది?
జులై వచ్చే పౌర్ణమిని బక్ మూన్ గా పిలవడానికి ఓ కారణం ఉంది. అమెరికన్ ఆల్గాన్క్విన్ తెగ నుంచి బక్ మూన్ అనే పేరు ఆవిర్భవించింది. ఈ తెగ తమ జీవన విధానంలో భాగమైన ఘటనల ఆధారంగా పౌర్ణములకు ప్రత్యేక పేర్లు పెట్టడం జరిగింది. ఈ తెగ ప్రకారం జులై నెలలో మగ జింకలు (Buck) కొమ్ములు పెరగడం ప్రారంభమవుతుంది. పాత కొమ్ములు రాలిపోయిన తర్వాత కొత్తవి వెల్వెట్ లాంటి పొరతో పెరగడం ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలో జులై నెలలో వచ్చే పౌర్ణమికి బక్ మూన్ గా నామకరణం చేశారు.
బక్ మూన్ ఎలా కనిపిస్తాడు?
ఈ ఏడాది బక్ మూన్.. ఒక అరుదైన ఖగోళ సంఘటనగా పిలిచే ‘మేజర్ లూనార్ స్టాండ్‌స్టిల్’ (Major Lunar Standstill) సమయంలో సంభవిస్తుంది. ఇది ప్రతి 18.6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సమయంలో చంద్రుడు భూమిపైన ఉండేవారికి చాలా చిన్నగా కనిపిస్తాడు. జూలై 3న భూమి సూర్యుడికి దూరంగా ఉండే బిందువైన అఫీలియన్ (Aphelion)కు చేరుకోవడం వల్ల కూడా ఈ పౌర్ణమి సూర్యుడికి దూరంగా ఉంటుంది. దీని వల్ల చంద్రుడు ఆకాశంలో తక్కువ ఎత్తులో కనిపిస్తాడు.
Also Read: Harish Rao on KCR: మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కేసీఆరే.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!
భారత్ లో ఎప్పుడు చూడాలి?
భారతదేశంలో బక్ మూన్ ను సూర్యాస్తమయం తర్వాత చూడాల్సి ఉంటుంది. అంటే సరిగ్గా 20 నిమిషాల తర్వాత (సుమారు 7:19 గం.ల ప్రాంతంలో) చంద్రుడ్ని ఆకాశంలో చూడవచ్చు. రాత్రి ఆకాశం స్పష్టంగా ఉన్నప్పుడు టెలిస్కోప్ ద్వారా ఈ అందమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఇదిలా ఉంటే బక్ మూన్ కు మరికొన్ని పేర్లు సైతం ఉన్నాయి. థండర్ మూన్ (జూలైలో వచ్చే గాలి, వానలతో కూడిన తుఫానులను సూచిస్తూ), సాల్మన్ మూన్ (సాల్మన్ చేపలు ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత కొట్టడం ప్రారంభించే కాలానికి గుర్తుగా) అని కూడా దీనిని పిలుస్తారు.