Shubman Gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా యువ సారథి శుభమన్ గిల్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 269, సెకండ్ ఇన్నింగ్స్ లో 161 రన్స్ చేసి.. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ ల్లో 150+ స్కోర్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తద్వారా తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల జాబితాలో కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. 15 స్థానాలు ఎకబాకి 6వ స్థానంలో నిలిచాడు.
సరికొత్త మైలురాయి
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి ముందు గిల్.. టెస్ట్ ర్యాంకింగ్స్ లో 23వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన గత రెండు టెస్టుల్లో ఏకంగా 585 పరుగులు సాధించి.. ఆశ్చర్యకరంగా 15 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. 2023 సెప్టెంబర్ లో గిల్ సాధించిన 14వ స్థానమే ఇప్పటివరకు మెరుగైన టెస్ట్ ర్యాంకింగ్ గా ఉంది. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా అతడు కెరీర్ లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
టాప్‌లోకి దూసుకొచ్చి బ్రూక్
మరోవైపు ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సైతం అందరినీ ఆశ్చర్యపరిచాడు. బర్మింగ్ హామ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 158 పరుగులు చేయడం ద్వారా ఈ 25 ఏళ్ల.. టెస్టుల్లో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జో రూట్ ను వెనక్కి నెట్టి అతడి స్థానంలో పాగా వేశాడు. దీంతో రూట్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బ్రూక్ గతేడాది డిసెంబర్ లోనే నెం.1 స్థానానికి చేరుకున్నాడు. కానీ వారం రోజుల తర్వాత రెండో స్థానానికి పడిపోయాడు. భారత్ పై మరొక క్లాస్ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా తిరిగి తన నెం.1 ర్యాంక్ ను బ్రూక్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ నాల్గో స్థానంలో ఉండటం గమనార్హం.
Also Read: Vadodara bridge collapse: గుజరాత్ మార్క్ ఇదేనా.. ఈ పాపం మీది కాదా.. బీజేపీపై విపక్షాలు ఫైర్!
సత్తాచాటిన భారత ప్లేయర్లు
ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో బ్యాటుతో రాణించిన రవీంద్ర జడేజా.. బ్యాటర్ల జాబితాలో పైకి ఎగబాకాడు. 6 స్థానాలు మెరుగుపరుచుకొని 39వ ర్యాంక్ కు చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో మహమ్మద్ సిరాజ్ 6 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు. రెండో టెస్టులో 10 వికెట్లు సాధించడం ద్వారా భారత బౌలర్ ఆకాష్ దీప్ 39 స్థానాలు ఎగబాకి 45వ స్థానానికి చేరుకున్నాడు. ఆకాష్ కెరీర్ లో ఇదే అత్యుత్తమమైన ర్యాంక్ కావడం గమనార్హం.