Medchal Park Site: లే ఆవుట్లు చేయడం నిబంధనల ప్రకారం సామాజిక ప్రయోజనాల కోసం స్థలాలను కేటాయించడం అనుమతులు పొందిన తర్వాత వదిలిన ఖాళీ స్థలాలను చెరపట్టడం పరిపాటిగా మారింది. ఈ తరహా దందా నగర శివారులో ఉన్న మేడ్చల్(Medchal) నియోజకవర్గ ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉంది. ఇంటి స్థలాల ధరలు ఆకాశన్నంటిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న పార్కు స్థలాలను అక్రమంగా అమ్ముకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో తాజాగా వెలుగు చూసింది. దాదాపు 25 ఏండ్ల కిందట గ్రామ పంచాయతీ అనుమతితో చేసిన వెంచర్(Venture)లో ఖాళీగా ఉన్న 3,800 గజాల పై చిలుకు స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. లే ఆవుట్ చేసిన వారే బై నంబర్లతో అమ్ముకునే పయత్నం చేస్తున్నారు.
లేఆవుట్‌లో ధరలు బాగా పెరగడంతో
ఘట్ కేసర్ మండలం అవుషాపూర్‌లో 303, 304, 305, 306, 307 సర్వే నెంబర్లలో 2001 లో వినూత్న హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్(Vinootna Homes Private Limited) వారు 43 ఎకరాల్లో వెంచర్ చేశారు. అందులో సామాజిక ప్రయోజనాల కోసం 3,878 గజాల స్థలాన్ని కేటాయించారు. లే ఆవుట్‌లోని ప్లాట్లను విక్రయించారు. ఎంతో మంది ఇండ్లను నిర్మించుకొని, నివాసం ఉంటున్నారు. దాదాపు 600 ఇండ్ల వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఆ లేఆవుట్‌లో ధరలు బాగా పెరగడంతో లే అవుట్ చేసిన వారు సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలంపై కన్నేశారు. రూ. కోట్లలో విలువ చేసే స్థలాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు పథకం పన్నారు. ఆ స్థలంలో పాగా వేయడంలో భాగంగా ఖాళీ స్థలాన్ని శుభ్రం చేశారు.
Also Read: Gold Rates (08-07-2025): షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ఆ స్థలానికి ప్లాట్ల నెంబర్లు కేటాయిచేందుకు రంగం సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్‌కు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆందోళనకు దిగారు. తమ అందరి ప్రయోజనాల కోసం ఉపయోగపడాల్సిన స్థలాన్ని కబ్జాగా కాకుండా చూడాలని, రిజిస్ర్టేషన్‌లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వినూత్న కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తాసిల్దారు, మున్సిపాలిటీ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్‌తో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తే రాబోయే రోజుల్లో వాటర్ ట్యాంక్, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, క్రీడా స్థలం కోసం స్థలం ఉండదని, ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు అధికారులకు వివరించారు.
మున్సిపల్ కమిషనర్ ఏమన్నారంటే
సామాజిక ప్రయోజనాల కోసం వినూత్న హైట్స్ లే అవుట్‌లో కేటాయించిన స్థలం కబ్జాపై మున్సిపాలిటీ కమిషనర్ రాజేశ్‌ను వివరణ కోరగా విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతామని, కబ్జా చేస్తున్నట్టు గుర్తిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష!