Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) హఠాన్మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు ఎట్టకేలకు సర్కారు ముహూర్తం ఫిక్స్ చేసింది. వచ్చే సెప్టెంబర్ నెల రెండో వారంలో ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. నోటిఫికేషన్ జారీ అయిన 40 రోజుల్లో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్ డ్రా వంటి ప్రక్రియలతో పాటు పోలింగ్, కౌంటింగ్, ఫలితాన్ని ప్రకటించే ఈ కీలక ఘట్టాలన్నింటిని పూర్తి చేయాలని అధికార యంత్రాంగం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఈవీఎంలను భద్రపర్చిన గోదామును పలు సార్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇతర అధికారులు పలు దఫాలుగా పరిశీలించిన సంగతి తెలిసిందే. అంతేగాక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలక్షన్ డ్యూటీలు చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించిన జీహెచ్ఎంసీ మంగళవారం మొదటి దశ శిక్షణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. మరో దశ శిక్షణ ఇచ్చి సిబ్బంది సందేహాలను నివృత్తి చేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఉప ఎన్నికతో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీ కమిషనరే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహారిస్తుండగా, ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఇద్దరు ముగ్గురు అధికారుల పేర్లను ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Read Also- Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్ అయినట్టే!
సెగ్మెంట్ వివరాలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం 3 లక్షల 89 వేల 954 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ వెలువడి ముందు రోజు కల్లా మొత్తం ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశమున్నట్లు తెలిసింది. మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం నియోజకవర్గం పరిధిలోని సుమారు 132 ప్రాంతాల్లో మొత్తం 329 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు లక్షా 86 వేల 793 మంది ఉండగా, పురుష ఓటర్లు రెండు లక్షల3 వేల 137 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో థర్డ్ జెండర్ ఓటర్లు 24 మంది కాగా, ఓవర్ సీస్ ఓటర్లు 96 మంది ఉన్నారు. వీరితో పాటు పీడబ్ల్యూడీ ఓటర్లు 1843 ఉండగా, 80 ఏళ్లకు పై బడిన ఓటర్లు 6056 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 18 మందితో పాటు 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు యువ ఓటర్లు 4030 మంది ఉన్నారు. సెప్టెంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడి రోజు ముందు వరకు నమోదయ్యే ఓటర్లను పరిగణలోకి తీసుకోనున్నందున యువ ఓటర్ల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయి.
Read Also- Coriander: కొత్తిమీర ఎక్కువగా వాడుతున్నారా.. అయితే, జాగ్రత్త ?
పెరుగుతున్న ఆశావహులు
2023లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు గట్టి పోటీనిచ్చి, స్వల్ప తేడాతో ఓటమి పాలైన మాజీ క్రికెట్ అజారుద్దిన్‌తో (Azharuddin) పాటు ఈ సెగ్మెంట్ టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఈ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య దాదాపు పదుల్లోనే ఉందని చెప్పొచ్చు. కానీ, అధికార పార్టీ మాత్రం పీజేఆర్ కూతురు, కార్పొరేటర్ విజయా రెడ్డి (Vijayareddy) పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే 2023లో జరిగిన శాసన సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా ఉన్న విజయా రెడ్డి ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇతర నేతల కన్నా ముందే విజయా రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం పట్ల పార్టీ అధినాయకుల్లో చాలా మంది ఆమె పట్ల సానుభూతిగా కూడా ఉన్నట్లు తెలిసింది. ఆమెను జూబ్లీహిల్స్ బరిలో దింపాలన్న ఉద్దేశ్యంతోనే సర్కార్ ఇటీవలే నిర్మించిన శిల్పా లేవుట్ ఫ్లై ఓవర్‌కు పి.జనార్థన్ రెడ్డి పేరును నామకరణం చేయడంతో పాటు ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో విజయారెడ్డికి తగిన ప్రాధాన్యతను కూడా ఇచ్చింది. విజయారెడ్డికి టికెట్ కేటాయిస్తే, నాటి పీజేఆర్‌తో కలిసి పని చేసిన క్యాడర్ కూడా మళ్లీ పార్టీలో యాక్టివ్‌గా పని చేసే అవకాశాలున్నట్లు రాజకీయ నిపుణల అంచనాలున్నాయి.
Read Also- Coriander: కొత్తిమీర ఎక్కువగా వాడుతున్నారా.. అయితే, జాగ్రత్త ?