Jubilee Hills: హైదరాబాద్ నగరంలోని కీలక నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Poll) అనివార్యం అయింది. ఇక్కడ్నుంచి బీఆర్ఎస్ (BRS) తరఫున ఎవరు పోటీచేస్తారు..? మాగంటి కుటుంబ సభ్యులే పోటీ చేస్తారా? లేకుంటే మరొకరిని బరిలోకి దింపుతారా..? అనే చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నుంచి మాత్రం పెద్ద ఎత్తున పేర్లు తెరపైకి వస్తున్నాయి. రోజుకో పేరు, తానే అభ్యర్థిని అని ప్రకటించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో మాజీ మేయర్, పీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) పేరు అన్యుహంగా ప్రచారంలోకి వచ్చింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా పనిచేయడంతో అందరితో సత్సంబంధాలు ఉండటం, ప్రజలకు కూడా పేరు సుపరిచితమైన వ్యక్తి కావడంతో కాంగ్రెస్ అధిష్టానం మాజీ మేయర్ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మేయర్‌గా పనిచేసినప్పటి నుంచి ఇదే నియోజకవర్గ పరిధిలోనే నివాసం ఉండటం కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం తన పుట్టిన రోజును సైతం నియోజకవర్గ పరిధిలో నిర్వహించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నది.
Read Also- Viral News: పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్.. సెకన్లలోనే సచ్చిపోతారంతే!
ఫిక్స్ అయినట్లేనా..?
కాగా, గతంలో పోటీ చేసిన మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ (Azharuddin) అభ్యర్థిత్వాన్ని ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న ఓ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం కూడా రామ్మోహన్ అభ్యర్థిత్వంపై పార్టీ దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది. అయితే అజారుద్దీన్ మాత్రం పోటీచేసేది తానేనని ప్రకటించేసుకున్నారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల తాను ఓడిపోయానని, అయినా జూబ్లీహిల్స్నియోజకవర్గ ప్రజలు తనపై ప్రేమాభిమానాలు చూపించారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో 60 వేల ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈ సారి వందశాతం తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. నియోజకవర్గంలో ఎంతో హార్డ్వర్క్చేశానని, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియా గాంధీల ఆశీస్సులు ఉన్నాయని వెల్లడించారు. అయితే.. అభ్యర్థిని ఫిక్స్ చేయడం అంత ఆషామాషీ కాదని.. కాంగ్రెస్‌లో చాలా ప్రాసెస్ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. ముందుగా పీసీసీకి ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని.. ఆ తర్వాత వాటిని ఫిల్టర్‌చేసి అధిష్ఠానానికి 3 నుంచి 5 ఆశావహుల పేర్లను పంపుతామని వెల్లడించారు.
బీసీ రాగం!
అయితే.. ఏదేమైనా బీసీ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్‌కు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ మరోమారు తమ పార్టీకి బీసీల పట్ల ఉన్న ప్రేమను చాటడానికి అవకాశంగా ఉపయోగించవచ్చని పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తున్నది. ఈ ఉప ఎన్నికలో గెలుపుతో స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావితం చేయవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది. ఎందుకంటే.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసి చర్లపల్లి నుంచి కార్పొరేటర్‌గా గెలిచి అన్యుహంగా మేయర్ పదవి వరించటం, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పీసీసీలో కీలక బాధ్యతలు ఇవ్వటంతో ఎమ్మెల్యే టికెట్ రేసులో బొంతు కీలకంగా మారనున్నట్లుగా తెలుస్తోంది. రామ్మోహన్ ప్రస్తుతం అదే నెల 29న చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సతీమణి బొంతు శ్రీదేవి కూడా చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే రామ్మోహన్ పోటీచేస్తారని ప్రచారం జరిగినప్పటికీ వీలుకాలేదు. అయితే ఇదే సరైన సమయం అని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ఏ పార్టీ నుంచి ఎవరు?
వాస్తవానికి శాసన సభ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాలి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు రచించబోతోందని సర్వత్రా చర్చించుకుంటున్నారు. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఈ ఉప ఎన్నికలో గెలవాలని పట్టుదలతో ఉంది. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థిపైన కాంగ్రెస్ పెద్దలు ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఎవ్వరినీ ఫైనల్ చేయలేదు కానీ.. పేర్లు మాత్రం గట్టిగానే తెరపైకి వస్తున్నాయి. మరికొందరేమో తామే అభ్యర్థులం అన్నట్లుగా మీడియా ముందుకొచ్చి హడావుడి చేస్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు కానీ, జూటూరు కీర్తిరెడ్డి పేరు మాత్రం ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో ఇదే జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. అయితే.. మైనార్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో చివరికి పార్టీలన్నీ ఎవరివైపు మొగ్గు చూపుతాయో.. అభ్యర్థి విషయంలో ఎలా అడుగేస్తాయో వేచి చూడాలి మరి.
Read Also- Amaravati: రాజధాని అమరావతిలో ఏమేం ఉంటాయ్.. ఎవరికెంత?