Viral News: అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. 67 మంది ప్రాణాలను కుక్క అరుపు కాపాడింది. ఏంటి నమ్మకం కలగట్లేదా..? అవునండోయ్ కుక్క విశ్వాసం గల జంతువే కాదు ప్రాణాలు కూడా కాపాడుతుందనే విషయం ఈ సంఘటనతోనే రుజువైంది. ఈ ఘటనతో ప్రకృతి వైపరీత్యాలు అకస్మాత్తుగా సంభవించినప్పుడు మానవ ప్రాణాలను రక్షించడంలో జంతువులు కీలక పాత్ర పోషించగలవని మరోసారి నిరూపితమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachalpradesh) ఇటీవల ఆకస్మిక వరదలు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో మనం వార్తల్లో చూసే ఉంటాం. క్లౌడ్ బరస్ట్‌తో ఒక్కసారిగా వరదలు మండిని ముంచెత్తాయి. ఎంతలా అంటే అమాంతంగా వచ్చిన వరదలతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయిన భయానక పరిస్థితి. ఈ వరదల థాటికి కట్టుబట్టలతో కొందరు ప్రాణాలు కాపాడుకోగా, ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వర్షాలు మొదలైన నాటి నుంచి మంగళవారం వరకూ 87 మంది చనిపోగా, ఎంత మంది గాయపడ్డారనేది లెక్కే లేదు. అసలు కుక్క ప్రాణాలు ఎలా కాపాడింది? ఆ కథా కామామిషు ఏంటనే సంగతి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..!
అసలేం జరిగింది?
హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం తీవ్రమైంది. జూన్ 30న మండి జిల్లా, ధర్మపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంపై పెద్ద కొండచరియ విరిగిపడే అవకాశం ఉంది. గ్రామంలోని నరేంద్ర అనే వ్యక్తి ఇంటి రెండో అంతస్తులో నిద్రిస్తున్న పెంపుడు కుక్క, ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి, అకస్మాత్తుగా భయంకరంగా అరవడం ప్రారంభించింది. అప్పటికే గ్రామంలోని కొండపై నుంచి పెద్ద పెద్ద రాళ్లు, మట్టి పెళ్లలు వేగంగా జారిపడటం ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కుక్క నిరంతరంగా, భయంకరంగా అరవడంతో నరేంద్రకు అనుమానం కలిగింది. హుటాహుటిన నిద్రలేచి ఏం జరిగిందా? అని బయటికొచ్చి ఆరా తీశాడు. తన ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడటం, లోపలికి నీరు ప్రవేశించడాన్ని గుర్తించాడు. వెంటనే నరేంద్ర పరిస్థితి తీవ్రతను గ్రహించి, తన కుక్కను తీసుకుని కిందకు వెళ్లి, గ్రామస్థులందరినీ నిద్రలేపి, ప్రమాదం గురించి హెచ్చరించాడు. కుక్క అరుపుల వల్ల గ్రామస్థులు అప్రమత్తమై వెంటనే తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. కొద్దిసేపటికే, భారీ కొండచరియ విరిగిపడి గ్రామంలోని అనేక ఇళ్లు.. ముఖ్యంగా నరేంద్ర ఇంటితో సహా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ కొండచరియ రావడం వల్ల ఏర్పడిన భారీ శబ్దం గ్రామం అంతా వినిపించింది. ఈ సంఘటనలో సుమారు 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలు సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారు సమీపంలోని నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. చూశారుగా కుక్క అరుపుతో సియాతి గ్రామం మొత్తం అదృష్టవశాత్తు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నది.
Read Also- Coriander: కొత్తిమీర ఎక్కువగా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త ?
దండం పెట్టాల్సిందే..!
అదృష్టవశాత్తు, కుక్క చేసిన సాయం వల్ల ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇళ్లు కోల్పోయిన 20 కుటుంబాలకు చెందిన 67 మంది గ్రామస్థులను అధికారులు సమీపంలోని ఒక ఆలయానికి తరలించి, వారికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. నిర్వాసితులకు ఆహారం, ఇతర ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో భవిష్యత్తులో కూడా ప్రమాదాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సంఘటన కుక్కల విశ్వసనీయతకు, వాటికి ఉండే అపాయాన్ని ముందే పసిగట్టే సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. ప్రకృతి విపత్తుల సమయంలో జంతువులు కూడా మానవుల ప్రాణాలను కాపాడటంలో ఎంతగానో సహాయపడతాయని ఇది మరోసారి నిరూపించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారి, కుక్కల విశ్వాసానికి ప్రశంసలు దక్కాయి. ఆ కుక్క తెలివితేటలు, విశ్వసనీయతపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. జంతువులు ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టగలవని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఈ శునకానికి తగిన గుర్తింపు, సత్కారం లభించాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ కుక్కకు దండేసి దండం పెట్టాలా.. వద్దా అనేది..!
అస్తవ్యస్తంగా హిమాచలం!
కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. గత కొన్నిరోజులుగా పరిస్థితి తీవ్రంగా ఉన్నది. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలకు సంబంధించిన సంఘటనలలో మరణించిన వారి సంఖ్య 80కి పైగా చేరుకుంది. ఇందులో కొండచరియలు, ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటనాల వల్ల 52 మంది, రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాక్‌లు వంటి ఇతర కారణాల వల్ల 28 మంది మరణించారు. ఇంకా 35 మందికి పైగా గల్లంతయ్యారు. ముఖ్యంగా మండి జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ 17 మరణాలు సంభవించగా, 30 మందికి పైగా గల్లంతయ్యారు. అనేక చోట్ల మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 269 రోడ్లు మూసివేయబడ్డాయి, ముఖ్యంగా మండి జిల్లాలో 200కు పైగా రోడ్లు మూతపడ్డాయి. దీనివల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. చాంబాతో సహా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జూన్ 20 నుంచి జూలై 7 వరకు రాష్ట్రానికి సుమారు రూ.692.65 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. 320 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 38 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పంటలు, వంతెనలు, ఇతర ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.
Read Also- Chandrababu: రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్.. సీబీఎన్ విజన్ అదిరిపోయిందిగా!
మేమున్నామనీ..
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(SDRF), పోలీసులు, హోంగార్డులు, సైన్యం, ఐటీబీపీ (ITBP) బృందాలు సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, మందులు అందిస్తున్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని పలు జిల్లాలకు, ముఖ్యంగా మండి, కాంగ్రా, సిర్మౌర్ జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మొత్తంగా, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం రుతుపవనాల ప్రకోపంతో తీవ్రంగా అల్లాడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం, వివిధ ఏజెన్సీలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వరద ప్రభావితమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10వేలు తక్షణ సహాయం అందిస్తోంది. కాగా, ఈ మహా విపత్తు తర్వాత చాలా మంది గ్రామస్థులు అధిక రక్తపోటు, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.
Read Also- Fish Venkat: ప్రభాస్ చేయలేదు.. ఆ యంగ్ హీరో సాయం చేశాడు
🌧️ The spell of heavy monsoon rain continues in Himachal Pradesh.
In the last 24 hrs, Aghar (Hamirpur) recorded the highest rainfall at 110 mm.
Cloudbursts in Mandi and Chamba have disrupted normal life.
⚠️ IMD issues warning for heavy rain & flash floods in 10 districts over… pic.twitter.com/rqA9NaBPio
— All India Radio News (@airnewsalerts) July 6, 2025