Jangama District: ఒకప్పుడు భార్య భర్తలు అంటే ప్రేమానురాగాలకు ప్రతీకగా చెప్పుకునే వారు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఒకరికొకరు తోడు నీడగా నిలిచేవారు. అయితే ప్రస్తుత రోజుల్లో కొందరు ఈ అభిప్రాయాలకు తూట్లు పొడుస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో జీవితాంతం కలిసి ఉండాల్సిన భాగస్వామిని దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ తరహా దారుణమే చోటుచేసుకుంది. భర్తను ఇద్దరు భార్యలు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
జనగామ జిల్లా లింగాలగణపురం మండలం పిట్టలోనిగూడెంకు చెందిన కనకయ్య (30)కు ఇద్దరు భార్యలు. అక్కాచెల్లెళ్లు అయిన శిరీష, గౌరమ్మ అనే ఇద్దరిని కనకయ్య వివాహం చేసుకున్నాడు. అయితే కనకయ్య మద్యానికి బానిసై ఇద్దరు భార్యలను వేధిస్తుండటంతో వారు.. కొద్దిరోజుల క్రితం వారు పుట్టింటికి వెళ్లిపోయారు. భర్త తరుచూ వేదిస్తుండటంతో తల్లి వారికి ఆశ్రయమిచ్చి అక్కడే ఉంచింది.
అత్తను హత్య చేసి..
ఈ క్రమంలో ఇటీవల అత్త ఇంటికి వెళ్లిన కనకయ్య.. తన ఇద్దరు భార్యలను వెంట పంపాలని పట్టుబట్టాడు. ఇందుకు భార్యలు ఒప్పుకోకపోవడంతో అత్త కూడా ససేమీరా అన్నది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన కనకయ్య.. అత్తను దారుణంగా హత్య చేశాడు. అనంతరం జైలుకు వెళ్లాడు. తాజాగా జైలు నుంచి వచ్చిన కనకయ్య.. మద్యం మత్తులో నిన్న రాత్రి భార్యల వద్దకు వెళ్లాడు.
Also Read: Gold Rates (08-07-2025): షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
గొడ్డలితో దాడి.. స్పాట్ డెడ్
తనతో రాకపోతే ఇద్దరిని చంపేస్తానంటూ శిరీష, గౌరమ్మలను అతడు బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో అతడి చేతులో నుంచి గొడ్డలి లాక్కున్న అక్కా చెల్లెళ్లు.. దానితోనే అతడిపై దాడి చేసి హత్య చేశారు. దీంతో కనకయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శిరీష, గౌరమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.