Akash Deep: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌పై టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 336 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర నెలకొంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే, గిల్‌తో సమానంగా పేసర్ ఆకాశ్ దీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 21.1 ఓవర్లు సంధించి 6 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌట్ చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా కీలకమైన 4 వికెట్లు తీశాడు. మొత్తం 10 వికెట్లతో తన సత్తా చాటాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆకాష్ దీప్ మాట్లాడుతూ, ఎడ్జ్‌బాస్టన్‌లో వీరోచిత ప్రదర్శనను తన అక్క అఖండ్ జ్యోతి సింగ్‌కు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. మ్యాచ్‌లో ప్రదర్శనను తన అక్కకు అంకితం చేయడం వెనుక ఒక భావోద్వేగ కారణం ఉంది.
క్యాన్సర్‌తో పోరాటం
ఆకాశ్ దీప్ అక్క అఖండ్ జ్యోతి సింగ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇంగ్లండ్ టూర్‌కు సెలక్ట్ అయిన తర్వాత అక్కను వదిలి వెళ్లే సమయంలో ఆకాశ్ దీప్ ఒకింత దుఃఖానికి గురయ్యాడు. బాధలో ఉండి కూడా ఇంగ్లండ్ పర్యటనకు ముందు తమ్ముడు ఆకాశ్‌కు జ్యోతి ధైర్యం చెప్పారు. తన ఆరోగ్యం గురించి బాధపడొద్దని, దేశం తరపున ఆడటంపై దృష్టి పెట్టాలని చెప్పి పంపించారు. కుటుంబం సంక్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో ఆకాశ్ దీప్ చేసిన ప్రదర్శన చాలా ఆనందాన్ని ఇచ్చిందని అఖండ్ జ్యోతి సింగ్ చెప్పారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. క్యాన్సర్ మూడవ స్టేజ్‌లో ఉందని, తాను ఇంకో ఆరు నెలలపాటు చికిత్స తీసుకోవాల్సిన అవసరమని ఉందని ఆమె వెల్లడించారు.
Read Also- Sehwag Son: సెహ్వాగ్ పెద్ద కొడుకు సంచలనం.. వేలంలో భారీ ధర
దేశానికి గర్వకారణం
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 10 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ భారతదేశానికి గర్వకారణమని అఖండ్ జ్యోతి సింగ్ చెప్పారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడానికి ముందు, విమానాశ్రయంలో ఆకాశ్ దీప్‌ని కలవడానికి వెళ్లామని, తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పానని తెలిపారు. ‘‘నా గురించి బాధపడకు. దేశం తరపున మంచిగా ఆడు. నేను క్యాన్సర్ మూడవ దశలో ఉన్నాను. చికిత్స మరో ఆరు నెలలు కొనసాగుతుందని డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత చూద్దాం. నువ్వు జాగ్రత్త. మంచిగా ఆడు అని చెప్పాను’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆకాశ్ దీప్ వికెట్లు తీయడం తనకు చాలా సంతోషం కలిగించిందని, తమ్ముడు వికెట్ తీసుకున్నప్పుడల్లా, ఇంట్లో అందరం గట్టిగా చప్పట్లు కొట్టామని ఆనందాన్ని పంచుకున్నారు. తాము సంతోషంతో కేకలు వేస్తుంటే.. ఏమైందంటూ ఇరుగుపొరుగువారు ఆరా తీశారంటూ గుర్తుచేసుకొని ఆమె నవ్వారు.
Read Also- Viral News: బెంగళూరులో వింత పరిస్థితి.. ఆఫీసులు మూసివేయాలంటూ డిమాండ్లు
తాను క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం బయటవారికి తెలియదని, ఆ విషయాన్ని ఆకాశ్ దీప్ అంతర్జాతీయ టీవీ ఛానల్‌లో వెల్లడించాడని జ్యోతి పేర్కొన్నారు. ‘‘ఆకాశ్ ఈ విషయాన్ని బయటకు చెబుతాడని నేను అస్సలు అనుకోలేదు. క్యానర్ గురించి బహిరంగంగా మాట్లాడడానికి మేము సిద్ధంగా లేను. కానీ, ఆకాశ్ భావోద్వేగానికి గురై నా గురించి మాట్లాడడం, నాకు అంకితం చేయడం చాలా పెద్ద విషయం. కుటుంబాన్ని, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియచెబుతోంది. ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మంచి ప్రదర్శన చేసి వికెట్లు తీయడం నిజంగా చాలా పెద్ద విషయం. ఆకాశ్‌తో నేను స్నేహంగా ఉంటాను’’ అని ఆమె పేర్కొన్నారు.