Viral News: ఇండియన్ సిలికాన్ సిటీగా పిలుచుకునే బెంగళూరు మహానగరంలో డ్రైవర్ యూనియన్లు, ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత రవాణా ప్లాట్‌ఫామ్‌ల మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్తకర పరిస్థితులు (Viral News) నెలకొన్నాయి. ఈ మధ్యనే బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించగా, తాజాగా ఉబర్, ఓలా వంటి సంస్థలను కఠిన నిబంధనలతో నియంత్రించాలంటూ డ్రైవర్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. బైక్ టాక్సీలను కూడా యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా, రద్దీ సమయాల్లో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎంతలా అంటే, రిషబ్ అనే యువకుడు క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకునేందుకు ఏకంగా అరగంటపాటు ప్రయత్నించాడు. అయినప్పటికీ బుక్ కాకపోవడంతో బెంగళూరు నగరంలో నెలకొన్న అస్తవ్యస్త రవాణా సౌకర్యాలపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అతడు పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Read Also- Rupee Fall: మన ‘రూపాయి’కి ఏమైంది?.. ఇవాళ ఒక్కరోజే భారీ పతనం
ఆఫీసులను మూసేయండి
బెంగళూరు నగరంలో రవాణా అస్తవ్యస్త పరిస్థితులపై రిషబ్ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టాడు. “బెంగళూరు నగరం నిజంగా ఒక రోత. నేను గత 30 నిమిషాలుగా క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ, ఏమీ దొరకలేదు. ఉబర్, ఓలాలను కూడా నిషేధించాలని డ్రైవర్ యూనియన్లు నిర్ణయించుకున్నాయి. మొదట వాళ్లు బైక్ టాక్సీలను నిషేధించారు. ఇప్పుడు క్యాబ్‌లు, ఆటోలా?. అసలు ఇదేం మాఫియా?. అర్థం పర్థం లేని పనులు. నగరంలో మౌలిక సదుపాయాలు లేవు. సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేదు. ఎప్పుడు చూసినా భాషాపరమైన ఇబ్బందులు. మనసులో ఉన్న మాట నిజాయితీగా చెబుతున్నాను, ఆఫీసులు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించాలి. అప్పుడూ అందరం సర్దుకుని మంచిగా ఉన్న నగరానికి తరలివెళ్లిపోతాం’’ అని అంటూ ఆక్రోశం వ్యక్తం చేశాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులో రవాణా సౌకర్యాలు, ఉబర్, ఓలా వంటి యాప్ ఆధారిత సేవల పాత్రపై చర్చకు దారితీసింది.
Read Also- BRICS Summit: బ్రిక్స్ సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు
నెటిజన్లు స్పందన ఇదే
బెంగళూరు రవాణా వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తూ పెట్టిన పోస్టుపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. కొంతమంది యూజర్లు బెంగళూరు నగరాన్ని సమర్థిస్తూ వాదించారు. ‘‘బెంగళూరు నుంచి వెళ్లిపోండి బ్రదర్.. మిమ్మల్ని ఎవరూ ఉండమని ఆపడం లేదు. మన రాష్ట్రం గురించి మాకు బాగా తెలుసు. బెంగళూరులో మెట్రోతో పాటు అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంది. సిటీ కొంచెం రద్దీగా ఉందనే విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ, బెంగళూరు బాగానే ఉంది” అని ఒక యూజర్ స్పందించాడు. “క్యాబ్ బుక్ చేసుకుంటే గానీ జ్ఞానోదయం కాదు” అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తి స్పందస్తూ, “ఇక్కడ ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కార్యకలాపాలను మూసివేస్తున్నాం.. వెళ్లిపోమంటూ కంపెనీలు చెబితే గుహ మాదిరిగా ఉండే ఈ చెత్త నగరాన్ని వీడి వెళ్లిపోవడానికి సంతోషిస్తాం’’ అని పేర్కొన్నాడు. బెంగళూరు నగరాన్ని విమర్శించడంపై పలువురు వ్యతిరేకించడంతో అసలు పోస్టు పెట్టిన రిషబ్ స్పందించాడు. ‘‘నగర వాసులారా.. నన్ను మన్నించండి. నేను అనేది బెంగళూరుని కాదు. బెంగళూరు బాగుంది. ఇన్నేళ్లుగా ఈ నగరాన్ని పాలిస్తున్నది తెలివితక్కువ, అవినీతిమయమైన ప్రభుత్వాలను అంటున్నాను” అని క్లారిటీ ఇచ్చాడు. బృహత్ బెంగళూరు మహానగర పాలికేకు ఆరేళ్లుగా కనీసం ఎన్నికలు కూడా నిర్వహించలేదని, పౌర సమస్యలు పట్టించుకునేవారు పెద్దగా ఎవరూ లేరని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలు గంటలు ట్రాఫిక్‌లోనే గడిచిపోతోందని, నిరసన తెలపడానికి కూడా తమకు సమయం చాలడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.