BRICS Summit: బ్రెజిల్‌లోని రియోడిజనీరో నగరం వేదికగా జరుగుతున్న 17వ బ్రిక్స్ సదస్సులో (BRICS Summit) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ప్రసంగం చేశారు. వెనుకబడిన దేశాల గొంతు వినిపించడానికి భారత్ ఎల్లప్పుడూ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పారు. 20వ శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలకు 21వ శతాబ్దంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. అందుకే, అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 20వ శతాబ్దంలో ఏర్పాటై ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలు.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించలేకపోయాయని ప్రధానమంత్రి విమర్శించారు. సుస్థిరాభివృద్ధిలో పర్యావరణం, ఆర్థిక సాయం, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు అవసరమని ఆయన సూచించారు.
Read Also-Personal Finance: పెళ్లికి డబ్బులు కావాలా.. ఇలా చేయండి తిరుగుండదు!
పెత్తనం ఒకే దేశంలో చేతిలో ఉండొద్దు
అంతర్జాతీయ సంస్థల పనితీరు ఒకే దేశం చేతిలో ఆధారపడి ఉండకూడదని, సమ్మిళిత ప్రపంచ కోసం ఒక క్రమమైన విధానాన్ని కలిగివుండాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో పాలనా సంస్థలైన ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లను సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా వెంటనే సంస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక, బ్రిక్స్ భవిష్యత్తు గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, మరింత సమానత్వం ఉన్న ప్రపంచాన్ని రూపుదిద్దడంలో బ్రిక్స్ కూటమి దోహదపడుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక, బహుళ పక్షవాదం, ఆర్థిక, ఫైనాన్స్ వ్యవహారాలు, కృత్రిమ మేధస్సు బలోపేతంపై జరిగిన చర్చలో కూడా మోదీ మాట్లాడారు. వైవిధ్యం, ఆధిపత్య దేశాలతో ఏర్పడమే బ్రిక్స్ కూటమి బలాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ రాజకీయ విధానాన్ని మార్చడంలో బ్రిక్స్ ముఖ్యమైన పాత్ర పోషించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాల పరిధిలోనే పరిశోధన, విజ్ఞాన భాండాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కృత్రిమ మేధపై పరస్పరం సహకారాన్ని పంచుకోవాలని ఆయన సూచించారు.
Read Also- F-35B Jet: కేరళలో నిలిచిన బ్రిటన్ ఎఫ్-35బీ విషయంలో కీలక పరిణామం
పహల్గామ్ ఉగ్రదాడిపై గర్జన
‘శాంతి, భద్రత, ప్రపంచ విధానాల్లో సంస్కరణలు’ అనే అంశంపై మాట్లాడిన మోదీ, మానవాళికి ఉగ్రవాదం తీవ్రమైన ముప్పుగా ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, ప్రపంచ స్థాయి వ్యవస్థలలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన దేశాల అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని, నిబద్ధతతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇక, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని బ్రిక్స్ సభ్య దేశాల సభ్యులు ఖండించడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి మానవాళిపై జరిగిన దాడి. తీవ్రవాదం మానవాళికి పెనుముప్పు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, వారిని ప్రోత్సహించడం, సురక్షితమైన స్థావరాలు కల్పించడాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు) దమ్ము రవి మీడియా ప్రత్యేక సమావేశంలో మోదీ ప్రసంగాన్ని చదివి వినిపించారు. శాంతి, భద్రత, బహుళ సంస్కరణలపై చర్చల సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పారు.