Melania Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. దుందుడుకు చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అనాలోచిత నిర్ణయాలతో భారత్ సహా ఇతర మిత్రదేశాలను సైతం ట్రంప్ చిక్కుల్లోకి నెడుతున్నారు. ప్రతీకార సుంకాల పేరుతో మిత్ర దేశాలకు అమెరికాతో ఉన్న సత్సంబంధాలు చేజేతులా చెడకొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడి భార్య మెలానియా ట్రంప్ కూడా తన భర్తకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంది. టెక్సాస్ వరదల నేపథ్యంలో ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదస్పదంగా మారింది. నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ట్రంప్ భార్య ఏమన్నారంటే?
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో చిక్కుకొని 67 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 21 మంది చిన్నారులు ఉండటం బాధను మరింత రెట్టింపు చేస్తోంది. ఓ సమ్మర్ క్యాంప్ లోకి వరద నీరు పోటెత్తగా.. కొట్టుకుపోయిన బాలికల కోసం గాలింపు చర్యలు (Rescue Operation) కొనసాగతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు భార్య మెలానియా ట్రంప్ (Melania Trump) ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఈ కష్టమైన సమయంలో నా మనసు టెక్సాస్ లోని తల్లిదండ్రుల చుట్టూనే తిరుగుతోంది. మీకు శక్తి, సౌఖర్యం, ధైర్యం కలగలాని ప్రార్థనలు చేస్తున్నాను’ అంటూ ఆమె రాసుకొచ్చారు.
My heart goes out to the parents in Texas during this difficult time. I am holding you in my thoughts and sending prayers for strength, comfort, and resilience.
— First Lady Melania Trump (@FLOTUS) July 5, 2025
నెటిజన్ల ఫైర్!
అయితే అమెరికా ప్రథమ మహిళ అయిన మెలానియా ట్రంప్ చేసిన పోస్ట్.. టెక్సాస్ లోని దారుణ పరిస్థితులకు సరిపోలలేదని పలువురు అమెరికన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ సర్కార్.. విపత్తు ప్రతిస్పందన నిధులను గతంతో పోలిస్తే భారీగా తగ్గించిందని ఆరోపిస్తున్నారు. ఒకవేళ విపత్తు నిర్వహణకు మీ భర్త సరైన బడ్జెట్ ఇచ్చి ఉంటే.. సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా జరిగి.. అనేకమంది ప్రాణాలతో బయటపడి ఉండేవారని పేర్కొంటున్నారు.
‘మీ ప్రార్థనలతో ప్రాణాలు తిరిగి రావు’
విపత్తు నిర్వహణకు కేటాయించే బడ్జెట్ లో కోతను మాజీ జాతీయ వాతావరణ సేవా డైరెక్టర్లు గతంలోనే తీవ్రంగా తప్పుబట్టారని నెటిజన్లు అంటున్నారు. ట్రంప్ చర్యలు.. మరణాలకు దారీ తీయవచ్చని గతంలోనే హెచ్చరించారని గుర్తుచేస్తున్నారు. ‘వరదల్లో వాళ్ల పిల్లలు చనిపోతుంటే నువ్వు బాల్కనీలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలను ఇప్పటికే చాలా మంది చూశారు’ అంటూ మెలానియా ట్రంప్ ను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ మండిపడ్డారు. ‘మీ ప్రార్థనలు.. దెబ్బ తిన్న ఇళ్లను పునర్మించవు. పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురావు’ అంటూ మరొక నెటిజన్ సైతం ఫైర్ అయ్యారు.
Also Read: Watch Video: యూరప్ రావొద్దు.. వచ్చారో మీ పని అంతే.. భారతీయుడి స్ట్రాంగ్ వార్నింగ్!
ఇది పెద్ద విపత్తు: ట్రంప్
టెక్సాస్ కు చెందిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు.. జోక్విన్ కాస్ట్రో (Joaquin Castro) మాట్లాడుతూ.. విపత్తు నిర్వహణకు తక్కువ మంది సిబ్బంది ఉండటం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అకస్మిక వరదలు సంభవించినప్పుడు అవసరమైనంత సిబ్బంది లేకపోతే.. పరిస్థితులు విషాదానికి దారి తీసే అవకాశమే ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు టెక్సాస్ వరదల నేపథ్యంలో.. ఆదివారం ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA) రంగంలోకి దిగింది. టెక్సాస్ ఘటనను పెద్ద విపత్తుగా ట్రంప్ అభివర్ణించిన నేపథ్యంలో.. సహాయక చర్యలకు అవసరమైన అన్ని వనరులను FEMA అందిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.