Perni Nani On Pawan
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Perni Nani: పవన్ కళ్యాణ్‌ను పేర్ని నాని ఇంత మాట అన్నారేంటి?

Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ యాస, ప్రాస.. కౌంటర్లు, విమర్శలు వేరుగా ఉంటాయి. ఎంతటి ప్రత్యర్థినైనా సరే గట్టిగానే మాట్లాడేస్తుంటారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అనేది లెక్కే లేకుండా విమర్శలు చేస్తుంటారు. శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా నరసింహాపురం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సభలో మాట్లాడుతూ వైసీపీ.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కౌంటర్‌గా మీడియా ముందుకొచ్చిన పేర్ని నాని గట్టిగానే ఇచ్చిపడేశారు. ఈ కామెంట్స్ విన్న జనాలు, జనసైనికులు, వీరాభిమానులు.. ప్చ్ ఇన్ని మాటలు అన్నారేంటి? అని ఒకింత కంగుతిన్నారు. ఇంతకీ పవన్ ఏమన్నారు..? నాని ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి..

Read Also- Viral Video: ఫ్లైఓవర్‌పై యువకుల చిల్లర చేష్టలు.. రెడ్ హ్యాండెండ్‌గా పోలీసుల డ్రోన్‌‌కు చిక్కి..!

జ‌గ‌న్ రారు.. అనడానికి నువ్వెవరు?
వైసీపీ స్థాపించి, సొంతంగా పోటీ చేసి ఎవరూ ఊహించని ప్రజామోదంతో అధికారంలోకి వ‌చ్చి తన పాల‌నలో ఒక మార్క్ క్రియేట్ చేసిన నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy). అలాంటి జ‌గ‌న్‌ని మ‌ళ్లీ అధికారంలోకి రానివ్వను అని అనడానికి ప‌వన్ క‌ళ్యాణ్ ఎవ‌రు? జగన్‌ గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదు. చంద్రబాబుకి న‌ష్టం జ‌రిగిన‌ప్పుడు త‌ప్ప ఎప్పుడైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌య‌ట‌కొచ్చారా? జ‌గ‌న్ మ‌ళ్లీ రావాలా.. వ‌ద్దా? అనేది నిర్ణయాల్సింది ప్రజ‌లే తప్ప.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్రబాబు కాదు. మ‌ళ్లీ ఈవీఎంల‌ను మేనేజ్ చేసి గెల‌వ‌చ్చనే ధైర్యంతోనే జ‌గ‌న్‌ని అధికారంలోకి రానివ్వన‌ని చెబుతున్నారని బ‌య‌ట మాట్లాడుకుంటున్నారు. దానికి త‌గ్గట్టుగానే మొన్నటి సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఈవీఎంలలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాల‌తో స‌హా వివ‌రించడం జ‌రిగింది. అందుకే బ్యాలెట్ ప‌ద్ధతిలో ఎన్నిక‌లు నిర్వహించాల‌ని మా పార్టీ డిమాండ్ చేస్తోంది. జ‌న‌సేన పార్టీ టెంట్ హౌస్‌లాగా అద్దెకిచ్చే పార్టీ అని నేను మాట్లాడితే తిట్టారు. ఇప్పుడు జ‌రుగుతున్నది అదే క‌దా..? సొంతంగా గెల‌వ‌లేక అంద‌రూ ఒక్కటై ప్రజ‌ల‌ను దోచుకుంటున్నారు. అది చేస్తా.. ఇది చేస్తా అని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన ప‌వ‌న్, అధికారంలోకి వ‌చ్చిన ఏడాది కాలంగా ఎక్కడున్నారు? అని ఉప ముఖ్యమంత్రిని పేర్ని నాని ప్రశ్నించారు.

Perni Nani

ఇదేనా సుప‌రిపాల‌న?
ఆంధ్రప్రదేశ్‌లో ఏదో మూల‌న రోజూ అత్యాచారాలు, హ‌త్యలు, దాడులు జ‌రుగుతున్నా నిందితులెవ‌రికీ శిక్షలు ప‌డ‌టం లేదు. చంపేశాక శ‌వ పంచ‌నామా చేయ‌డానికి మాత్రమే పోలీసులు వ‌స్తున్నారు. రాష్ట్రంలో ఆడ‌పిల్లలు అదృశ్యమైతే ఏడాది కాలంలో ఇద్దర్నే ప‌ట్టుకున్నార‌ట‌, అది కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశిస్తేనే జ‌రిగింద‌ని చెప్పుకోవ‌డం పోలీసుల‌కే సిగ్గు చేటు. ఆ ప‌వ‌న్‌కే స‌మ‌స్యలు చెప్పుకుందామ‌ని వెళ్దామ‌నుకుంటే మాత్రం ఆయ‌నెప్పుడూ రాష్ట్రంలో అందుబాటులో ఉండ‌డు. ఆయ‌న్ను క‌ల‌వాలంటే ప‌క్క రాష్ట్రంలో షూటింగ్ స్పాట్‌కి వెళ్లాలేమో..? వ్యయ‌ప్రయాస‌ల‌కోర్చి క‌ష్టప‌డి చ‌దివి డాక్టర్ పాసైన విద్యార్థుల‌కు కూడా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా ఈ ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగుల‌కు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఐపీఎస్‌లు సైతం భ‌య‌ప‌డి రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. వేల‌కు వేలు క‌రెంట్ బిల్లులు ఎందుకొస్తున్నాయ‌ని ఎమ్మెల్యేల‌ను ప్రశ్నిస్తుంటే స‌మాధానం చెప్పుకోలే ఎల్లో ప‌త్రిక‌ల్లో గ‌త ప్రభుత్వమే కార‌ణ‌మ‌ని అస‌త్య క‌థ‌నాలు రాయిస్తున్నారు. కారుంటే అమ్మ ఒడి ఎందుకివ్వరు? మా పాల‌న‌లో అడ్డగోలు నిబంధ‌న‌లు అంటూ ప్రజ‌ల్ని రెచ్చగొట్టారు. అవే ఇప్పుడెందుకు అమ‌లు చేస్తున్నట్టు? ఇది టీడీపీ ఎమ్మెల్యేల‌కే సుప‌రిపాల‌న త‌ప్ప, ప్రజ‌ల‌కు కాదు. విషాహారం తిని విద్యార్థినులు అనారోగ్యం పాలై అల్లాడి పోతుంటే మంత్రి వచ్చేదాకా అంబులెన్స్‌లో త‌ర‌లించ‌కూదంటూ అడ్డుకున్నారు అని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan

పవన్ ఏమన్నారు..?
శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన పవన్.. వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తామంటూ గట్టిగా హెచ్చరించారు. ‘ 2029 ఎన్నికల్లో గెలిచి మా అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. వాళ్లు అసలు అధికారంలోకి వస్తే కదా? అదీ మేము చూస్తాం. వైసీపీ నేతలపై వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కక్ష లేదు. గత ప్రభుత్వంలో వైసీపీ, ఆ పార్టీ నేతలు అభివృద్ధిని పట్టించుకోలేదు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. సొంత ప్రయోజనాలనే చూసుకున్నారు. రౌడీయిజం, గూండాయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ప్రజలకు కనీసం తాగు నీరు అందించాలన్న యోచన లేకుండా పనిచేశారు’ అని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కు ఒక్కరోజు గ్యాప్‌లో మీడియా ముందుకొచ్చిన పేర్ని నాని పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.

Read Also- Google Map: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మితే కొంప కొల్లేరే.. ఇది తెలిశాక జన్మలో జోలికెళ్లరు!

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?