Rahul Gandhi on Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్ పై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలుకు 90 రోజుల డెడ్ లైన్ ను ట్రంప్ విధించారు. మరో రెండ్రోజుల్లో అంటే జులై 9న ఆ గడువు ముగియనుంది. ఈలోగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi)పై తీవ్ర విమర్శలు చేశారు.
మోదీ తలొగ్గుతారు: ట్రంప్
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ నేత, లోక్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా కథనాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. అమెరికాతో ట్రేడ్ డీల్ (US Trade Deal) పై పియూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప.. చేసేదేమి లేదని రాహుల్ విమర్శించారు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారని అన్నారు. తన మాటలు నమ్మకపోతే రాసుపెట్టుకోవాలని ఎక్స్ (Twitter) వేదికగా రాసుకొచ్చారు.
Piyush Goyal can beat his chest all he wants, mark my words, Modi will meekly bow to the Trump tariff deadline. pic.twitter.com/t2HM42KrSi
— Rahul Gandhi (@RahulGandhi) July 5, 2025
అమెరికా వార్నింగ్..!
భారతదేశం నుండి దిగుమతి చేసుకునే ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి ట్రక్కులు, వాహనాల విడి భాగాల దిగుపతిపై 26శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలోనే ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు అవకాశం కల్పిస్తూ 90 రోజుల డెడ్ లైన్ ను విధించారు. దీంతో ప్రతికార సుంకాల నుంచి తప్పించుకునేందుకు అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ ప్రయత్నాలు చేస్తోంది. టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటి కీలకమైన వస్తువులపై సడలింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.
గోయల్ ఏమన్నారంటే?
ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ జులై 9న ముగియనుండటంతో కేంద్రంలోని మోదీ సర్కార్ హడావీడిగా ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతోందన్న విమర్శలు.. విపక్షాలు చేస్తున్నాయి. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వాణిజ్య ఒప్పందం ఉంటుందని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వాటిపై స్పందించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్.. జాతి ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమమని అన్నారు. భారత ప్రయోజనాలకు తగ్గట్లుగా డీల్ ఉంటేనే అమెరికాకు అంగీకారం తెలుపుతామని స్పష్టం చేశారు.
Also Read: India US Trade Deal: ట్రంప్ టెంపరితనం.. చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమైన భారత్.. ఎలాగంటే?
డబ్ల్యూటీఓకు భారత్ ప్రతిపాదన
అమెరికా విధించే 26 శాతం సుంకం.. భారత్ నుంచి వెళ్లే 2.89 బిలియన్ డాలర్ల ఎగుమతులను ప్రభావితం చేయనుంది. సుంకాల పెంపు ద్వారా అమెరికాకు ఏడాదికి 723.75 మిలియన్ డాలర్లు అదనంగా లభించనున్నట్లు భారత్ అంచనా వేస్తోంది. దీంతో తమకు జరిగే నష్టాన్ని అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు పెంచడం ద్వారా భర్తీ చేసుకోవాలని భావిస్తున్నట్లు తాజాగా WTOకు భారత్ తెలిపింది. అధిక సుంకాల నుంచి తమను తాము కాపాడుకునే క్రమంలో సుంకాల రేట్లలో సర్దుబాటు చేసే హక్కులను భారత్ కలిగి ఉందని డబ్ల్యూటీవోకు స్పష్టం చేసింది.