TVK Vijay: వచ్చే ఏడాది 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా తమిళ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK Vijay) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటినుంచే ఆయన కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కీలక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును టీవీకే పార్టీ అధికారికంగా ప్రకటించింది. పొత్తుల విషయంలో కూడా స్పష్టత ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉండబోదని క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా, రాష్ట్రంలో అధికార పార్టీ అయిన డీఎంకేతో కూడా చేతులు కలిపే ప్రసక్తేలేదని టీవీకే పార్టీ తేల్చిచెప్పింది.
బీజేపీ సిద్ధాంతపరంగా శత్రువు అని, డీఎంకే రాజకీయ ప్రత్యర్థి అని టీవీకే స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక కమిటీ భేటీలో ప్రత్యేక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఇక వచ్చే నెల ఆగస్టులో తమిళనాడులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో వ్యాపింపజేసేలా గ్రామాల్లో కూడా బహిరంగ సభలు నిర్వహించాలని కూడా పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది.
Read also- Vegetarian In China: చైనా వెళ్లిన వెజిటేరియన్.. ఏమంటున్నాడో మీరే వినండి
ఈ మేరకు శుక్రవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన టీవీకే రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ భేటీకి విజయ్ సారధ్యం వహించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశం చాలా కీలకమైనదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే, కీలకమైన పలు తీర్మానాలు ఆమోదించినట్టు వివరించాయి. ఇంగ్లిష్‌ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల వెనుక దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయని, తమిళనాడు ద్విభాషా విధానంపై ప్రత్యక్ష దాడిలా కనిపిస్తున్నాయని టీవీకే రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ మండిపడింది.
తమిళనాడుపై హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా రుద్దడాన్ని తమ పార్టీ ఎన్నటికీ అంగీకరించబోదని టీవీకే స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరించి ఎన్నికలు నిర్వహించాలనే భారత ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని కూడా ఖండిస్తున్నట్టు పేర్కొంది. మైనారిటీల ఓట్లను తగ్గించడమే దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశమని మండిపడింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బీజేపీ తన అనుకూల ఓట్లను పెంచుకోవడానికి ఓటర్ల సవరణ ఎత్తుగడను వేస్తున్నట్టు టీవీకే నాయకత్వం అనుమానించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు-2016కు ముందు టీవీకే అధినేత విజయ్ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు కూడా ఈ భేటీలో నిర్ణయించారు.
Read also- Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ జనరల్ కీలక ప్రకటన
2024 ఫిబ్రవరిలో పార్టీ ఏర్పాటు
నటుడు విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళిగ వెట్రి కజగం (TVK) పేరిట పార్టీని స్థాపించాడు. అంతకంటే ముందు, 2009లో తన అభిమాన ఫ్యాన్ క్లబ్ ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ స్థాపించాడు. దాని ద్వారా రాజకీయ–సామాజిక ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత దానిని పార్టీగా రూపాంతరం చెందించారు. సామాజిక న్యాయం, సమానత్వం, అందరికీ హక్కులు, అంబేడ్కర్, పెరియార్, మార్క్సిస్ట్ సిద్ధాంతాల ఆధారంగా రాజకీయ సిద్ధాంతాలను ఆయన ప్రకటించారు.