Triple R Project: హైదరాబాద్ రూపురేఖలను మార్చేసే ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్లను కూడా ఖరారు చేశామని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఆయన వెల్లడించారు. గురువారం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో రాష్ట్రంలోని ఆర్ అండ్ బీ అధికారులతో మూడు గంటలకు పైగా సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. హ్యామ్ రోడ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆగస్టు నెలాఖరు వరకు అగ్రిమెంట్ పూర్తి చేసి, సెప్టెంబర్‌లో పనులు మొదలు పెడతామని తెలిపారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో హ్యామ్ మోడల్‌లో రోడ్ల నిర్మాణం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం 42 బ్రిడ్జ్‌లను అనుమతులు లేకుండా వదిలేసిందని, కనీసం ఏఈలను కూడా రిక్రూట్ చేయలేదని విమర్శించారు.
ప్రజల కోసమే రోడ్లు..
“రోడ్లు వేసేది ప్రజల కోసమే తప్ప, తమకు పేరు కోసం కాదు, కాంట్రాక్టర్ల కోసం కాదు” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మూడున్నరేళ్లలో ఆర్ అండ్ బీ ద్వారా 12 వేల కిలోమీటర్ల రోడ్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆన్ గోయింగ్ పనులకు రూ.300 కోట్లు విడుదల చేశారని, ఈ నెలలో గడ్కరీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ట్రిపుల్ ఆర్‌కు అనుమతులు తెచ్చుకుంటామని తెలిపారు.
Also Read: MP Crime: ఇదేం దిక్కుమాలిన కేసు.. ప్రియుడి కోసం అమ్మాయిగా మారిన అబ్బాయి.. చివరికి!
రూరల్ రోడ్ల అభివృద్ధి..
ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.6,500 కోట్లతో రూరల్ రోడ్ల టెండర్లు పిలిచామని, రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. పెండింగ్ రోడ్లను పూర్తి చేయాలని నిర్ణయించామని, తెలంగాణలో తమ శాఖ రోల్ మోడల్‌గా ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు. రూరల్ రోడ్లన్నింటినీ రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు సేఫ్టీ కింద బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి పనులు జరుపుతున్నామని ఆయన వివరించారు.