Baba Vanga Prediction: జపాన్ ను వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. టొకార దీవుల సమూహంలో గత రెండు వారాలుగా భూమి నిరంతరం కంపిస్తూనే ఉండటంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 21 నుంచి ఇప్పటిరవకూ ఏకంగా 900 సార్లు భూప్రకంపనలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో టొకార దీవులు (Tokara Islands) నెలకొని ఉన్న పసిఫిక్ మహా సముద్రం (Pacific Ocean)లో ఏ జరుగుతుందోనన్న ఆందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏ క్షణమైనా సునామీ (Tsunami) సంభవించవచ్చన్న భయాలతో జపనీయులు వణికిపోతున్నారు. ఇప్పటికే ఆ దేశానికి వెళ్లాలనుకునే పర్యాటకులు అర్ధాంతరంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. దీంతో భవిష్యవాణి చెప్పే వంగా జోస్యం నిజం కాబోతోందా అన్న భయాలు మెుదలయ్యాయి.
భవిష్యవాణిలో చెప్పినట్లే
జపాన్ కు భూకంపాలు ఏమి కొత్త కాదు. భూకంపాలు అధికంగా సంభవించే దేశాల్లో జపాన్ ముందువరుసలో ఉంటుంది. అక్కడ ప్రతి ఏటా దాదాపు 1500 వరకూ భూకంపాలు వస్తాయని అంచనా. అయితే తాజాగా జపాన్ లోని టోకరా దీవుల్లో వరుసగా భూకంపాలు రావడం.. అది కూడా 2 వారాల వ్యవధిలోనే 900 సార్లు భూమి కంపించడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. దీంతో టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఆ దీవులలోకి ప్రస్తుతం ప్రయాణికులను అనుమతించడం లేదు. త్వరలోనే భారీ, ప్రాణాంతక భూకంపం సంభవించవచ్చనే వదంతులతో ప్రస్తుతం దేశం మెుత్తం తీవ్ర ఆందోళనలకు గురవుతోంది. ‘న్యూ బాబా వంగా’గా పిలువబడే జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి (Ryo Tatsuki) చెప్పిన భవిష్యవాణికి ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుండటంతో.. రేపే ప్రళయం రావడం ఖాయమేనా అన్న చర్చ జరుగుతోంది.
రేపే ఆఖరి రోజు
న్యూ బాబా వంగా అలియస్ రియో టాట్సుకి (Ryo Tatsuki).. జపాన్ కు సంబంధించి కీలక భవిష్యవాణి చెప్పారు. 2025 జులై 5న జపాన్‌లో భారీ ప్రకృతి విపత్తు సంభవిస్తుందని ఆమె అంచనా వేశారు. ఆమె తన పుస్తకం “ది ఫ్యూచర్ ఐ సా” (The Future I Saw)లో ఈ ప్రిడిక్షన్‌ను పేర్కొన్నారు. ఈ విపత్తు జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన లేదా అగ్నిపర్వత విస్ఫోరణం వల్ల సంభవించవచ్చని చెప్పారు. ఇది మెగా సునామీ లేదా భూకంపం రూపంలో ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తన కలలో సముద్రం నుంచి భారీ గాలి బుడగలు (ఎయిర్ పాకెట్స్) బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయని.. ఇది సముద్ర గర్భంలో అగ్నిపర్వత పేలుడుకు సంకేతమని న్యూ బాబా వంగా తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ సునామీ జపాన్‌తో పాటు తైవాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి తీర ప్రాంతాలను కూడా ప్రభావితం చేయవచ్చని ఆమె అంచనా వేశారు.
Also Read: Viral Video: క్యాబ్‌లో మద్యం తాగిన యువతి.. డ్రైవర్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు!
పర్యటనలు రద్దు
న్యూ బాబా వంగా చెప్పినట్లుగా జులై 5న ప్రళయం రాబోతున్నట్లు గత మూడు నెలల నుంచే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో చైనా (China), దక్షిణ కొరియా (South Korea), తైవాన్ (Taiwan) దేశాల నుంచి జపాన్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకుల సంఖ్య 50 మేర తగ్గినట్లు జపాన్ టూరిజం వర్గాలు పేర్కొన్నాయి. హాంకాంగ్ నుంచి జపాన్ కు వచ్చే ప్రయాణ టికెట్ల బుకింగ్స్ జూన్ – జులై నెలల్లో 83 శాతం మేర పడిపోయినట్లు పేర్కొన్నాయి. కొవిడ్ గురించి టట్సుకీ 1999లోనే జోస్యం చెప్పడం.. అది నిజం కావడంతో జులై 5న ప్రళయం సంభవించే అవకాశాలను కొట్టిపారేయలేమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో రేపు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు ప్రస్తుతం జపాన్ ప్రజలను పీడిస్తోంది.