Crime News: ఇంటి యజమానుల వేధింపులు, దాడులు తట్టుకోలేక ఇబ్బందిపడిన పనిమనుషుల దీనగాథలు గతంలో చాలానే విన్నాం. వింటూనే ఉన్నాం. అయితే, ఇందుకు పూర్తి విరుద్ధమైన ఘటన ఒకటి దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దూషించారన్న కసితో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటి యజమానురాలైన మహిళను, ఆమె చిన్న కొడుకుని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో ఉన్న ఓ ఇంట్లో ఈ జంట హత్యలు జరిగాయి. మృతుల పేర్లు రుచిక సెవానీ (Ruchika Sewani), 14 ఏళ్ల కొడుకు పేరు క్రిష్‌గా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు ముకేష్‌ని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు.
Read also- HHVM Trailer: హరిహర వీరమల్లు ట్రైలర్‌పై ఓ రేంజిలో ట్రోలింగ్.. ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారో?
పనిమనిషిపై యజమాని కేకలు
ఇంటి యజమాని రుచిక సెవానీ, ఆమె కొడుకు క్రిష్ బుధవారం సాయంత్రం ఓ పని విషయంలో ముకేష్‌ను మందలించారు. ఆగ్రహంతో కేకలు వేశారు. యజమానులు తిట్టడంతో నిందిత వ్యక్తి పగ పెంచుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత రుచికను, క్రిష్‌ల గొంతు కోసి హతమార్చాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. రుచిక భర్త కుల్దీప్ సెవానీ బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఆఫీసులో డ్యూటీ ముగించుకున్న తర్వాత ఇంటికి కాల్ చేశారు. భార్య, కొడుకు ఇద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో, కంగారుగా ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు మూసి ఉన్నాయి. దీంతో, ఆయన మరింత కంగారుపడ్డారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, ఇంటి గేటు దగ్గర, మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో ఆందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భార్య, కొడుకు కనిపించడం లేదంటూ వివరించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య, కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నారు.
Read also- Dil Raju: పైరసీపై కఠిన చర్యలకు ఎఫ్‌డీసీ ముందడుగు.. సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ అరెస్ట్
రక్తపు మడుగులో డెడ్‌బాడీస్
మృతురాలు రుచిక వయసు 42 సంవత్సరాలని, ఆమె మృతదేహం బెడ్‌పై ఉందని, రక్తంతో తడిసిపోయిందని పోలీసులు వివరించారు. బాలుడు క్రిష్ డెడ్‌బాడీని బాత్రూమ్‌లో గుర్తించామని తెలిపారు. పిల్లాడి వయసు పద్నాలుగేళ్లు అని, పదో తరగతి చదువుతున్నాడని వివరించారు. నిందితుడు ముకేష్ వయసు 24 సంవత్సరాలని, నగరం నుంచి పారిపోతుండగా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. రుచిక, కొడుకు క్రిష్ తనను తిట్టినందుకే హత్య చేసినట్టు నేరాన్ని ఒప్పుకున్నాడని తెలిపారు. ముఖేష్ బీహార్‌కు చెందినవాడని పేర్కొన్నారు. భార్య, కొడుకు మృతదేహాలను చూసి కుల్దీప్ సెవానీ కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కసారిగా ఆయన కుప్పకూలారు. కాగా, బాధిత కుటుంబానికి ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మార్కెట్లో వస్త్ర దుకాణం ఉంది.
Read also- Breaking: విడాకులు తీసుకోబోతున్న నయనతార.. వైరల్ అవుతున్న పోస్ట్